మోదక ప్రియా.. ఆరగించి దీవించుమయా!

భక్తితో కాసిని ఉండ్రాళ్లు... ప్రేమతో ఇంకొన్ని కుడుములు రుచిగా మోదక్‌లు వండి పెడితే చాలు.. బొజ్జ గణపయ్య కృపని పొందడానికి  అంతకన్నా ఏం కావాలి?

Updated : 28 Aug 2022 03:07 IST

భక్తితో కాసిని ఉండ్రాళ్లు... ప్రేమతో ఇంకొన్ని కుడుములు రుచిగా మోదక్‌లు వండి పెడితే చాలు.. బొజ్జ గణపయ్య కృపని పొందడానికి  అంతకన్నా ఏం కావాలి? మోదక్‌లు, ఉండ్రాళ్లని వినాయకునికి నచ్చేలా ఇలా చేసేద్దాం...

ఫ్రైడ్‌ మోదక్‌

కావాల్సినవి: గోధుమపిండి- అరకప్పు, మైదా- అరకప్పు, ఉప్పు- తగినంత (కావాలంటేనే), నెయ్యి- రెండు చెంచాలు

స్టఫింగ్‌ కోసం: కొబ్బరిపొడి- కప్పు, పాలు- అరకప్పు, బెల్లం- అరకప్పు, యాలకులపొడి- అర చెంచా, సన్నగా తరిగిన డ్రైఫ్రూట్స్‌ పలుకులు- రెండు చెంచాలు, నూనె- వేయించడానికి సరిపడా

తయారీ: ఒక పాత్రలో గోధుమపిండి, మైదా పిండి అందులో కొద్దిగా ఉప్పు, చెంచా వేడి వేడి నెయ్యి వేసి కలపాలి. ఇందులో నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ముద్దగా కలపాలి. మరీ మృదువుగా ఉంటే మోదక్‌లు చేయడానికి వీలుకాదు. చపాతీ పిండిలా ఉంటే చాలు. ఈ పిండిపై మూత పెట్టి పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి ఒక పాన్‌ తీసుకుని అందులో చెంచా నెయ్యి వేసి.. వేడెక్కాక పచ్చి కొబ్బరికోరు వేసి ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో అరకప్పు పాలు వేసి మరుగుతున్నప్పుడు  బెల్లం తురుము కూడా వేసి పూర్తిగా కరగనివ్వాలి. దగ్గరకు వచ్చాక సన్నగా తరిగిన డ్రైఫ్రూట్స్‌, యాలకులపొడి వేసి స్టౌ కట్టేయాలి. ఇప్పుడు పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని వాటిని చపాతీల్లా ఒత్తుకోవాలి. ఇందులో స్టఫింగ్‌ మిశ్రమాన్ని ఉంచి మోదక్‌లని చేసినట్టుగా తయారు చేసుకొని నూనెలో వేయించుకోవాలి. రుచికరమైన ఫ్రైడ్‌ మోదక్‌లు సిద్ధం.

 


ఉండ్రాళ్ల పాయసం

కావాల్సినవి: బియ్యప్పిండి- కప్పు, బియ్యపు రవ్వ- రెండు చెంచాలు, పాలు- కప్పు, నెయ్యి- మూడు చెంచాలు, పంచదార- రెండు చెంచాలు, బెల్లం- కప్పు, ఎండుద్రాక్ష, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు- రెండు చెంచాల చొప్పున

తయారీ:  స్టౌ వెలిగించి పాన్‌లో కప్పు నీళ్లు తీసుకొని అందులో చిటికెడు ఉప్పు, రెండు చెంచాల పంచదార, చెంచా నెయ్యి వేసుకోవాలి. నీళ్లు మరిగాక ఇందులో కప్పు బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. స్టౌ కట్టేసి పిండిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ పిండిని చిన్నచిన్న ఉండ్రాళ్లలా చేసుకోవాలి. ఒక పాత్రలో రెండు చెంచాల నెయ్యి తీసుకుని.. ఇందులో ఎండుద్రాక్ష, జీడిపప్పు, కొబ్బరిముక్కలు వేసి వేయించుకుని, నేతితో సహా తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గ్లాసు నీళ్లు తీసుకుని అవి మరిగాక అందులో ఉండ్రాళ్లు వేసి నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో కప్పు పాలు పోసి అవి మరుగుతున్నప్పుడు పాయసం చిక్కబడటానికి రెండు చెంచాల బియ్యపు రవ్వ వేసుకోవాలి. ఉడికాక మంట తగ్గించి బెల్లం తురుము వేసి బాగా కలపాలి. చివరిగా యాలకుల పొడి, నేతిలో వేయించిన జీడిపప్పుల మిశ్రమాన్ని వేసి స్టౌ కట్టేయడమే. ఉండ్రాళ్ల పాయసం సిద్ధం.

 


బెల్లం కుడుములు

కావాల్సినవి: బియ్యప్పిండి- కప్పు తురుమిన బెల్లం- ముప్పావుకప్పు, నానబెట్టిన సెనగపప్పు- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, పచ్చి కొబ్బరి తురుము- రెండు చెంచాలు, నెయ్యి- చెంచా, యాలకులపొడి- చెంచా

తయారీ:  స్టౌ వెలిగించి ఒక పాత్రలో బెల్లాన్ని తీసుకుని ఇందులో అరకప్పు నీళ్లు వేసి కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. కరిగితే చాలు. ఈ నీళ్లను పక్కన పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి పాన్‌లో ఒక కప్పు నీళ్లు, చిటికెడు ఉప్పు, నానబెట్టిన సెనగపప్పు, కొబ్బరి తురుము వేసుకుని మరిగించుకోవాలి. ఈ నీళ్లలో వడకట్టిన బెల్లం నీళ్లను కూడా వేసుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా నెయ్యి వేసుకుని...ఆ తర్వాత అందులో బియ్యప్పిండి వేసి గరిటెతో బాగా కలపాలి. చివరిగా యాలకులపొడి కూడా వేసి కలిపి పక్కన పెట్టేయాలి. గోరువెచ్చగా అయ్యాక చేతికి నెయ్యి రాసుకుని బెల్లం కుడుములుగాకానీ, ఉండ్రాళ్లుగా కానీ, అప్పాలుగా కానీ చేసుకోవాలి. స్టౌ వెలిగించి.. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి అవి మరుగుతున్నప్పుడు మనం చేసిన ఉండ్రాళ్లని ఒక గిన్నెలో పెట్టి, ఆవిరిమీద ఇడ్లీలు ఉడికించిననట్టుగా ఉడికించుకోవాలి. బెల్లం ఉండ్రాళ్లు లేదా కుడుములు సిద్ధం.


పాల తాలికలు

కావాల్సినవి: బియ్యం- గ్లాసు, బెల్లం- కప్పు, పెసరపప్పు- రెండు చెంచాలు( పావుగంటపాటు నానబెట్టుకోవాలి), నెయ్యి- రెండు చెంచాలు, జీడిపప్పులు, ఎండుద్రాక్షలు, ఎండుకొబ్బరి ముక్కలు- చెంచాచొప్పున, యాలకులపొడి- అరచెంచా, పచ్చకర్పూరం- చిటికెడు కన్నా తక్కువ.

తయారీ: బియ్యాన్ని బాగా కడిగి ఐదు గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత ఆ తడిపోయేలా ఒక వస్త్రంపై వేసి పొడిగా అయ్యేంతవరకూ ఆరబెట్టి మిక్సీలో  మెత్తగా పొడి చేసుకోవాలి. ఆపై దీనిని జల్లెడ పట్టుకుని కప్పు బియ్యప్పిండి తీసుకోవాలి. ఇప్పుడొక పాన్‌లో పావుకప్పు నీళ్లు తీసుకుని అందులో రెండు చెంచాల బెల్లం తురుము, యాలకులపొడి వేసి కలపాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో తడి బియ్యప్పిండి వేసి బాగా కలిపి స్టౌ కట్టేయాలి. గోరువెచ్చగా అయ్యాక ఆ పిండిని మీక్కావాల్సిన విధంగా సన్నగా కానీ లావుగా కానీ తాలికల్లా చేసుకోవాలి. స్టౌ వెలిగించి ఒక పాత్రలో బెల్లం తీసుకుని అందులో అరకప్పు నీళ్లని వేసి అందంతా కరిగే వరకూ ఉండి పక్కనపెట్టాలి. స్టౌ వెలిగించి మరొక పాత్ర తీసుకుని అందులో రెండు కప్పుల పాలు తీసుకోవాలి. అందులో అరకప్పు నీళ్లు, రెండు చెంచాలు నానబెట్టిన పెసరపప్పు వేసుకుని మరగనివ్వాలి. ఇందులో తాలికలు వేసుకుని నెమ్మదిగా కలపాలి. ఓ ఐదారు నిమిషాలపాటు తాలికల్ని ఉడికించుకోవాలి. అప్పుడే మరొక గిన్నెలో ఓ రెండు చెంచాల బియ్యప్పిండి తీసుకుని నీళ్లలో కలపాలి. తాలికలు దాదాపుగా ఉడికిపోయాయి అనుకున్నప్పుడు ఈ బియ్యం నీళ్లను పాయసంలో వేస్తే పాయసం చిక్కబడుతుంది. ఆ తర్వాత స్టౌకట్టేసి వడకట్టిన బెల్లం నీళ్లను పోసి కలపాలి. ఒక చిన్నగిన్నెలో డ్రైఫ్రూట్స్‌ పలుకుల్ని నేతిలో వేయించుకుని దానిని పాయసంలో కలపాలి. చివరిగా యాలకులపొడి, పచ్చకర్పూరం వేసుకొంటే చాలు.

- శ్రావణి, హైదరాబాద్‌


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని