చిరు జావలు!

సూర్యుడు శక్తి కొద్దీ ప్రతాపం చూపిస్తూ... స్ట్రా వేసుకుని వంట్లోని నీటిని పీల్చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అబ్బే... మన దగ్గర చిరుధాన్యాలతో చేసిన జావలున్నాయిగా!  ఒక గ్లాసుడు తాగితే చాలు... శక్తి, పోషకాలు... రెండూ సొంతం చేసుకోవచ్చు...  

Published : 23 Apr 2023 00:29 IST

సూర్యుడు శక్తి కొద్దీ ప్రతాపం చూపిస్తూ... స్ట్రా వేసుకుని వంట్లోని నీటిని పీల్చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అబ్బే... మన దగ్గర చిరుధాన్యాలతో చేసిన జావలున్నాయిగా!  ఒక గ్లాసుడు తాగితే చాలు... శక్తి, పోషకాలు... రెండూ సొంతం చేసుకోవచ్చు... 

 


అరికెలతో గంజి..

కావల్సినవి:  అరికెలు- గ్లాసు, ఉల్లిపాయలు- రెండు, టొమోటోలు- రెండు, పాలకూర- కట్ట, క్యారెట్‌లు- మూడు, కొత్తిమీర- అర కట్ట, నిమ్మకాయ- ఒకటి, పసుపు- కొద్దిగా, పచ్చిమిర్చి- అయిదు.

తయారీ: అరికెల్ని పచ్చివాసన పోయేంత వరకూ కడాయిలో వేయించుకోవాలి. చల్లారాక తగినన్ని నీళ్లు పోసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి ఆరుగంటలపాటు నానబెట్టుకోవాలి. కూరగాయల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. జావ కోసం మట్టి పాత్రని ఎంచుకుంటే మేలు. దాంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న కూరగాయలు, పసుపు వేసి అరికెల్ని నానబెట్టడానికి ఉంచిన పై నీరు వేసి ఉడికించాలి. ఒక పొంగు రాగానే అరికెల పిండి వేసుకోవాలి. జావ మధ్యలో చన్నీళ్లు పోయొద్దు. అందుకే మరో గిన్నెలో 4 గ్లాసుల వేడి నీళ్లు సిద్ధంగా ఉంచుకోవాలి. జావపై మూత వారగా పెట్టుకొని మంట తక్కువలో పెట్టి ఉడికించాలి. అది గట్టి పడుతున్నప్పుడల్లా కొద్దిగా వేడి నీళ్లు పోసుకుంటూ కలపాలి. దింపడానికి 5 నిమిషాల ముందు పాలకూర వేసి ఉడకనివ్వాలి. చివర్లో కొత్తిమీర వేసుకొని దింపేయాలి. జావ మరీ గట్టి పడకుండా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే తేలిగ్గా జీర్ణమవుతుంది. ఆఖరున నిమ్మరసం వేసి సర్వ్‌ చేసుకోవటమే.


సజ్జలతో..

కావల్సినవి:  సజ్జపిండి- పావు కప్పు, నెయ్యి- కొద్దిగా, వాము- కొద్దిగా, లవంగాలు- రెండు, దాల్చినచెక్క పొడి- కొద్దిగా, బెల్లం- కొద్దిగా, ఉప్పు, మిరియాల పొడి- తగినంత

తయారీ: కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని దాంట్లో లవంగాలు, వాము వేసి వేగనివ్వాలి. దాంట్లో పిండి వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేగనివ్వాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. ఉండలు లేకుండా కలపాలి. జావ బాగా ఉడికేందుకు నీరు కాస్త ఎక్కువగానే పడుతుంది. దింపేముందు బెల్లం, మిరియాల పొడి, చెక్కపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. జావ చిక్కబడక ముందే దింపేస్తే. రుచికరమైన సజ్జ జావ రెడీ.


రాగి గంజి..

కావల్సినవి:  రాగిపిండి- పావు కప్పు, పాలు- కప్పు, బెల్లం- పావుకప్పు, యాలకులపొడి- పావు చెంచా, ఉప్పు- పావుచెంచా.

తయారీ: రాగిపిండిని కడాయిలోకి తీసుకొని పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. చల్లారాక దాంట్లో పాలు పోసి కలపాలి. తర్వాత దాంట్లో నీళ్లు కూడా పోసి ఉండలు లేకుండా కలపాలి. దీన్ని చిన్నమంట మీద ఉంచి కలుపుతూ ఉండాలి. జావ కొద్దిగా చిక్కబడుతున్నప్పుడు.. తురిమిన బెల్లం, యాలకుల పొడి, ఉప్పు వేసి కలిపి దింపాలి. దీన్ని రోజూ తీసుకుంటే రక్తం వృద్ధి చెందుతుంది. బరువు తగ్గేందుకూ ఉపయోగపడుతుంది.


జొన్న అంబలి..

కావల్సినవి:  జొన్నపిండి- పావుకప్పు, ఉప్పు- అరచెంచా.

తయారీ: జొన్నపిండిలో ఎనిమిది కప్పుల నీళ్లు తీసుకొని రాత్రంతా నానబెట్టాలి. ఇది ఉదయానికి కొద్దిగా పులుస్తుంది. దాంట్లోని తేటనీరుని ఒక పాత్రలోకి తీసుకొని చిన్నమంట మీద ఉంచి ఒక  పొంగు రానివ్వాలి. ఆ తర్వాత ఉప్పు వేసుకొని జొన్న పిండిని కూడా వేసి ఉండలు కట్టుకుండా కలపాలి. అది బాగా ఉడికి, కొద్దిగా చిక్కపడగానే దింపేసుకోవాలి. అంతే అమ్మమ్మల కాలం నాటి జొన్న అంబలి తయార్‌. దీన్ని వేసవిలో తాపాన్ని తట్టుకునేందుకు రోజుకు రెండు సార్లు తీసుకోవచ్చు. దీంతో పాటు కొత్త ఆవకాయ, ఉల్లిపాయ నంజుపెట్టుకుని  తింటారు కొందరు.


కొర్రలతో...

కావల్సినవి:  కొర్రలు- అర కప్పు, మరమరాలు- కప్పు, క్యారెట్‌- కప్పు, టొమాటో రసం- ఒకటిన్నర కప్పు, పెరుగు- కప్పు, స్వీట్‌కార్న్‌- అర కప్పు, సొరకాయ ముక్కలు- అర కప్పు, క్యాప్సికం ముక్కలు- అరకప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్టు- చెంచా, పసుపు- కొద్దిగా, కొత్తిమీర- కొద్దిగా, నిమ్మరసం- చెంచా, జీలకర్ర- చెంచా

తయారీ: కొర్రల్ని ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఎనిమిది కప్పుల నీళ్లు పోసుకుని దాంట్లో నానబెట్టిన కొర్రలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు వేసి మూతపెట్టి కాసేపు ఉడకనివ్వాలి. విడిగా ఒక కుక్కర్లో కూరగాయ ముక్కలు, టొమాటో గుజ్జు వేసి రెండు విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించుకోవాలి. ఉడికిన కొర్రల్లో ఈ కూరగాయ ముక్కలు వేసుకోవాలి. పెరుగులో మరమరాలు వేసి ఓ అయిదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఉడుకుతున్న జావలో పెరుగు మిశ్రమం, కొత్తిమీర, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపి దింపేసుకోవాలి. అంతే కొర్రజావ రెడీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని