Veg Recipes: ఆవకాయ ఇలా చేస్తే పాడవదు

అమెరికాలో ఉన్న మా అమ్మాయికి పంపించడానికి ఆవకాయ  పెట్టాలనుకుంటున్నా? ఇంట్లో పెడితే సరిగా రాదు... పాడవుతుందని అంటున్నారు.

Published : 16 Apr 2023 00:08 IST

అమెరికాలో ఉన్న మా అమ్మాయికి పంపించడానికి ఆవకాయ  పెట్టాలనుకుంటున్నా? ఇంట్లో పెడితే సరిగా రాదు... పాడవుతుందని అంటున్నారు. పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

ఆవకాయ నిల్వ ఉండాలంటే అందులో పదార్థాల పాళ్లు ఎంత ముఖ్యమో, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఊరగాయ పెట్టే స్థలం తప్పనిసరిగా శుభ్రంగా, పొడిగా ఉండాలి. చేతులకు కూడా తడి ఉండకూడదు. తరిగిన ముక్కల్ని పొడిగా ఉండే కాటన్‌ వస్త్రంతో తుడిచి పెట్టుకోవాలి. బయట ముక్కలు కొట్టించుకుంటే నాప్కిన్‌తో తప్పనిసరిగా తుడవాలి. కాయ మెత్తగా ఉన్నా, పండినా పక్కన పెట్టేయండి. అవి పచ్చడి రుచిని పాడుచేస్తాయి. టెంకతో సహా ముక్కలు కోస్తే మంచిది. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఆవకాయలో వాడే ఆవాలు, వెల్లుల్లి, ఉప్పు, కారం, మెంతులు వంటివాటిని ముందుగా ఎండలో ఉంచి తడి లేకుండా చేసుకుని వాడుకోవాలి. ఆవకాయ కారాన్ని ఎంచుకునేటప్పుడు రంగుతోపాటు నాణ్యత తెలుసుకోవాలి. కొన్ని కారాలు మరీ ఘాటుగా ఉంటాయి. అలా కాకుండా కమ్మగా ఉండే ప్రత్యేక రకాల్ని ఎంచుకోవాలి. ఇందులో దొడ్డుప్పుని మాత్రమే వేయాలి. బజారులో దొరికే ఐయొడైజ్డ్‌ ఉప్పుని కాకుండా దొడ్డుప్పు లేదా కల్లుప్పుని మాత్రమే నిల్వ పచ్చళ్లకి వాడాలి. వేరుసెనగలేదా నువ్వుల నూనె పచ్చడి రుచిని పెంచుతుంది. ఆవకాయ కలిపిన తర్వాత సెరామిక్‌ జార్‌లు, జాడీలు, గాజుపాత్రల్లో మాత్రమే నిల్వ చేయాలి. పొడిగా ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. ప్లాస్టిక్‌ని వాడకూడదు. ఇలా చేస్తే పచ్చడి ఏడాది పొడవునా నిల్వ ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని