చేప మంచూరియా... తిని తీరాలయా!

చేపల పులుసు ఘుమఘుమలాడుతూ నోరూరించినా ఎప్పుడూ అదే తినలేం కదా... అందుకే ఈసారి చేపల కూరల్ని ఈ రుచుల్లో వండేద్దామా.

Published : 26 Jun 2021 12:00 IST

చేపల పులుసు ఘుమఘుమలాడుతూ నోరూరించినా ఎప్పుడూ అదే తినలేం కదా... అందుకే ఈసారి చేపల కూరల్ని ఈ రుచుల్లో వండేద్దామా

మసాలా కర్రీ...

కావలసినవి: చేప ముక్కలు: ఏడు, వాము: ముప్పావుచెంచా, సెనగపిండి: టేబుల్‌స్పూను, కారం: మూడు చెంచాలు, పసుపు: చెంచా, అల్లంవెల్లుల్లిముద్ద: చెంచా, నిమ్మరసం: చెంచా, ఉప్పు: తగినంత, నూనె: పావుకప్పు, పెరుగు: పావుకప్పు, కరివేపాకు: రెండు రెబ్బలు, జీడిపప్పు: పావుకప్పు (నానబెట్టుకుని ముద్దలా చేసుకోవాలి), టొమాటో గుజ్జు: టేబుల్‌స్పూను, ఉల్లిపాయ: ఒకటి, నెయ్యి: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత అల్లంముద్ద: చెంచా.

తయారీ విధానం: చేప ముక్కల్ని శుభ్రం చేసి వాటికి ఉప్పు పట్టించి పెట్టుకోవాలి. ఓ గిన్నెలో అల్లంవెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, పావుచెంచా వాము, సెనగపిండి, చెంచా కారం, సగం పసుపు వేసి కలిపి.. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించి అరగంట ఫ్రిజ్‌లో పెట్టాలి. స్టౌమీద బాణలి పెట్టి నూనె వేసి అందులో చేపముక్కల్ని వేయించుకుని తీసుకోవాలి. ఓ గిన్నెలో పెరుగు, జీడిపప్పు ముద్ద, టొమాటో గుజ్జు, మిగిలిన కారం, పసుపు, పావుకప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి నెయ్యి వేసి మిగిలిన వాము వేసి వేయించి ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి వేగాక అల్లంముద్ద, పెరుగు మిశ్రమం, కరివేపాకు వేసి మరిగించాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక తగినంత ఉప్పు, చేప ముక్కలు వేసి బాగా కలిపి దింపేయాలి.


గోవన్‌ ఫిష్‌ కర్రీ...

కావలసినవి: చేప ముక్కలు: అరకేజీ, దనియాలు: రెండు చెంచాలు, జీలకర్ర: చెంచా, ఆవాలు: అరచెంచా, వెల్లుల్లిరెబ్బలు: మూడు, కొత్తిమీర: కట్ట, అల్లంతరుగు: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, మిరియాలు: అరచెంచా, కారం: అరచెంచా, పసుపు: అరచెంచా, నూనె: టేబుల్‌స్పూను, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి, చింతపండురసం: రెండు చెంచాలు, కొబ్బరిపాలు: కప్పు.

తయారీవిధానం: స్టౌమీద బాణలి పెట్టి దనియాలు, జీలకర్ర, ఆవాలు వేయించాలి. వీటితోపాటూ వెల్లుల్లిరెబ్బలు, కొత్తిమీర, అల్లంతరుగు, తగినంత ఉప్పు, మిరియాలు, కారం, పసుపు మిక్సీలో వేసి కాసిని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి నూనె వేసి ఉల్లిపాయముక్కలు వేయించాలి. అవి వేగాక చేసి పెట్టుకున్న మసాలా వేసి కలపాలి. నిమిషమయ్యాక టొమాటో ముక్కలు కూడా వేయించి, చేప ముక్కలు, చింతపండు రసం వేయాలి. ఆ ముక్కలు ఉడుకుతున్నప్పుడు కొబ్బరిపాలు పోయాలి. కూర చిక్కగా అయ్యాక దింపేయాలి.


టిక్కా మసాలా...

కావలసినవి: ముల్లులేని చేప: అరకేజీ, నిమ్మరసం: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, కారం: మూడు చెంచాలు, అల్లంవెల్లుల్లి ముద్ద: నాలుగు చెంచాలు, పెరుగు: పావుకప్పు, సోంపు: అరచెంచా, మెంతులు: చెంచా, నూనె: అరకప్పు, ఉల్లిపాయ: ఒకటి, వేయించిన జీలకర్రపొడి: చెంచా, పసుపు: అరచెంచా, టిక్కా మసాలా: చెంచా, వెన్న: రెండు చెంచాలు, క్రీమ్‌: అరకప్పు, టొమాటో గుజ్జు: అరకప్పు, కొత్తిమీర: అలంకరణకోసం, చాట్‌మసాలా: చెంచా, సెనగపిండి: రెండు చెంచాలు.

తయారీవిధానం: ఓ గిన్నెలో చేప ముక్కలు, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, చెంచా కారం, చెంచా అల్లంవెల్లుల్లి ముద్ద, సెనగపిండి, పెరుగు, సోంపు తీసుకుని అన్నింటినీ కలిపి అరగంట ఫ్రిజ్‌లో పెట్టాలి. స్టౌమీద పాన్‌ పెట్టి నూనె వేస్తూ ఈ ముక్కల్ని ఎర్రగా వేయించి తీసుకోవాలి. అదే స్టౌమీద బాణలి పెట్టి మిగిలిన నూనె వేసి ఉల్లిపాయముక్కలు వేయించాలి. ఇందులో  మెంతులపొడి, జీలకర్రపొడి, పసుపు, మిగిలిన కారం, టిక్కా మసాలా, చాట్‌మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత టొమాటో గుజ్జు, చేపముక్కలు వేసి కలిపి, వెన్న, క్రీమ్‌ వేసి రెండు నిమిషాలయ్యాక దింపేసి కొత్తిమీర చల్లాలి.


మంచూరియా కర్రీ

కావలసినవి: చేప ముక్కలు: రెండుకప్పులు, నూనె: వేయించేందుకు సరిపడా, మైదా: ముప్పావుకప్పు, మొక్కజొన్నపిండి: పావుకప్పు, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: రెండు చెంచాలు, సోయాసాస్‌: రెండు చెంచాలు. గ్రేవీకోసం: అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, టొమాటో: ఒకటి, చక్కెర: చెంచా, ఎండుమిర్చి ముద్ద: టేబుల్‌స్పూను, గ్రీన్‌ చిల్లీసాస్‌: చెంచా, టొమాటో కెచప్‌: టేబుల్‌స్పూను, మొక్కజొన్నపిండి: టేబుల్‌స్పూను (నీళ్లతో జారు పిండిలా కలుపుకోవాలి), కొత్తిమీర: కట్ట.

తయారీ విధానం: ఓ గిన్నెలో మైదా, మొక్కజొన్నపిండి, కొద్దిగా ఉప్పు, చెంచా మిరియాలపొడి, చెంచా సోయాసాస్‌ వేసి, నీళ్లు పోస్తూ చిక్కని పిండిలా చేసుకోవాలి. ఇందులో చేప ముక్కల్ని ముంచి... కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. బాణలిని స్టౌమీద పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి. అది వేడయ్యాక అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. నిమిషమయ్యాక టొమాటో ముక్కలు కూడా వేయించి, తగినంత ఉప్పు, చక్కెర, ఎండుమిర్చి ముద్ద, మిగిలిన సోయాసాస్‌, గ్రీన్‌చిల్లీసాస్‌, టొమాటో కెచప్‌, వేసి అరకప్పు నీళ్లు పోయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మొక్కజొన్న పిండి, మిరియాలపొడి వేయాలి. ఇది చిక్కగా అవుతున్నప్పుడు వేయించుకున్న చేపముక్కలు వేసి కలిపి కొత్తిమీర చల్లి దింపేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని