పెసర పొంగనాలు.. పసందుగా!

ఇడ్లీపిండీ దోశపిండీ మిగిలిపోతే... వాటిల్లో పచ్చిమిర్చీ కొత్తిమీరా కలిపి పొంగనాలుగా వేసుకోవడం చాలామంది ఇళ్లల్లో చేసేదే. ఇవి మాత్రమే కాదు... వాటిని మరికొన్ని రుచుల్లోనూ చేసుకోవచ్చు. ఈ చలికాలంలో వేడివేడిగా వేసుకుంటే ఏ వేళయినా తినొచ్చు.

Published : 26 Jun 2021 14:16 IST

ఇడ్లీపిండీ దోశపిండీ మిగిలిపోతే... వాటిల్లో పచ్చిమిర్చీ కొత్తిమీరా కలిపి పొంగనాలుగా వేసుకోవడం చాలామంది ఇళ్లల్లో చేసేదే. ఇవి మాత్రమే కాదు... వాటిని మరికొన్ని రుచుల్లోనూ చేసుకోవచ్చు. ఈ చలికాలంలో వేడివేడిగా వేసుకుంటే ఏ వేళయినా తినొచ్చు.

కావలసినవి
ఓట్స్‌: కప్పు, బియ్యప్పిండి: మూడు టేబుల్‌స్పూన్లు, చిక్కని పెరుగు: అరకప్పు, వంటసోడా: పావుచెంచా, క్యారెట్‌: ఒకటి, కారం: అరచెంచా, క్యాబేజీ తరుగు: రెండు చెంచాలు,  కొత్తిమీర: కట్ట, నూనె: అరకప్పు, ఉప్పు: తగినంత, ఆవాలు: చెంచా, మినప్పప్పు: అరచెంచా, కరివేపాకు:  రెండు రెమ్మలు.
తయారుచేసే విధానం
* స్టౌమీద బాణలిని పెట్టి... ఓట్స్‌ వేసి వేయించుకుని రెండు నిమిషాలయ్యాక ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అదే బాణలిలో చెంచా నూనె వేసి ఆవాలూ, మినప్పప్పూ, కరివేపాకూ వేయాలి. అవి వేగాక క్యారెట్‌, క్యాబేజీ తరుగూ వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించుకుని రెండు నిమిషాలయ్యాక స్టౌ కట్టేయాలి. వేయించి పెట్టుకున్న ఓట్స్‌లో ఈ తాలింపూ, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కాసిని నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండిలా చేసుకోవాలి. పావుగంటయ్యాక ఈ పిండితో పొంగనాలు వేసుకోవచ్చు. పొంగనాల పాన్‌ని స్టౌమీద పెట్టి.. ఈ పిండిని కొద్దికొద్దిగా వేసుకుని మూత పెట్టాలి. రెండు నిమిషాలయ్యాక మూత తీసి... కొద్దిగా నూనె వేసుకుని రెండు వైపులా తిప్పుతూ... ఎర్రగా అయ్యాక తీసుకుంటే చాలు.


రాగులతో...

కావలసినవి
రాగులు: కప్పు,  బియ్యం ముప్పావుకప్పు, ఇడ్లీబియ్యం: ముప్పావుకప్పు, మినప్పప్పు: పావుకప్పు, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా, ఆవాలు: చెంచా, సెనగపప్పు: రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాలు: చెంచా, పచ్చిమిర్చి: రెండు, అల్లంతరుగు: చెంచా, కొత్తిమీర తరుగు: పావుకప్పు, కరివేపాకు రెమ్మలు: రెండు.
తయారుచేసే విధానం
* రాగులూ, బియ్యం, ఇడ్లీ బియ్యం మినప్పప్పు ఓ గిన్నెలోకి తీసుకుని సరిపడా నీళ్లు పోసి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి. ఆ తరువాత నీళ్లు వంపేసి ఇడ్లీపిండిలా రుబ్బుకుని ఉప్పు కలపాలి. ఇప్పుడు స్టౌమీద బాణలి పెట్టి చెంచా నూనె వేసి ఆవాలూ సెనగపప్పూ మిరియాలూ పచ్చిమిర్చి తరుగూ అల్లంతరుగూ కరివేపాకు రెమ్మలు వేయాలి. తాలింపు వేగాక రాగి పిండిలో వేసి బాగా కలపాలి. తరువాత కొత్తిమీర తరుగూ వేసి కలిపి మూత పెట్టేయాలి. ఇరవై నిమిషాల తరువాత పొంగనాలపాన్‌ని పొయ్యిమీద పెట్టి ఈ పిండిని కొద్దికొద్దిగా వేసుకుని నూనె వేస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి. ఈ పిండిని ఓ రోజంతా నానబెట్టి పులిశాక వేసుకుంటే పొంగనాలు ఇంకా రుచిగా ఉంటాయి.


పప్పులతో...

కావలసినవి
మినప్పప్పు: అరకప్పు, సెనగపప్పు, కందిపప్పు: పావుకప్పు చొప్పున, ఇడ్లీరవ్వ: కప్పు, అల్లం తరుగు: చెంచా, క్యాబేజీ తరుగు: రెండు పెద్ద చెంచాలు, క్యారెట్‌: ఒకటి (తురమాలి), జీలకర్ర: చెంచా, కరివేపాకు: రెండు రెమ్మలు, కారం: చెంచా, ఉప్పు: సరిపడా, నూనె: అరకప్పు.
తయారుచేసే విధానం
* పప్పులన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని సరిపడా నీళ్లు పోసి కనీసం ఐదు గంటలు నానబెట్టుకుని తరువాత మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో ఓసారి కడిగి, నీళ్లు పిండిన ఇడ్లీ రవ్వ, సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి మూత పెట్టాలి. మర్నాటికి ఈ పిండి పులుస్తుంది. ఇందులో అల్లం, క్యాబేజీ తరుగు, క్యారెట్‌ తురుము, కారం వేసుకుని పిండిని మరోసారి కలపాలి. స్టౌమీద బాణలి పెట్టి చెంచా నూనె వేసి జీలకర్ర, కరివేపాకు రెమ్మలు వేయించి ఈ పిండిలో వేయాలి. పొంగనాల పాన్‌ని స్టౌమీద పెట్టి.. ఈ పిండిని కొద్దికొద్దిగా వేసుకుని మూత పెట్టాలి. రెండు నిమిషాలయ్యాక నూనె వేసుకుంటూ రెండువైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి.


పెసరపప్పుతో...

కావలసినవి
పెసరపప్పు: కప్పు, అటుకులు: అరకప్పు, పచ్చిమిర్చి: నాలుగు, సోంపు: చెంచా, క్యాబేజీ తరుగు: రెండు చెంచాలు, కొత్తిమీర: రెండుకట్టలు, అల్లం తరుగు: అరచెంచా, క్యారెట్‌ తురుము: రెండు చెంచాలు, జీలకర్ర: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా.
తయారుచేసే విధానం
* ముందుగా పెసరపప్పునీ అటుకుల్నీ ఒకటిరెండు గంటలు నానబెట్టుకుని... నీళ్లు వంపేసి మిక్సీలోకి తీసుకోవాలి. ఇందులో పావు కప్పు నీళ్లూ, పచ్చిమిర్చీ, సోంపు వేసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఈ పిండిలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ అన్నీంటినీ కలపాలి. పది నిమిషాలయ్యాక పొంగనాల పాన్‌ని పొయ్యి మీద పెట్టి... ఈ మిశ్రమాన్ని కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి. నూనె వేసుకుంటూ రెండువైపులా తిప్పుతూ... ఎర్రగా అయ్యాయనుకున్నాక ప్లేటులోకి తీసుకోవాలి. వీటికి కొబ్బరిచట్నీ మంచి కాంబినేషన్‌.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని