Vegetarian Recipes: ఆరోగ్యానికి.. ఆకు తోడు!
ఆకుకూరలు చేసే మేలు గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. కానీ మనకు తెలిసిన ఆకు కూరలకంటే తెలియనవే ఎక్కువ. అలా అరుదుగా చేసే ఆకుకూరల వంటకాలే ఇవన్నీ.
ఆకుకూరలు చేసే మేలు గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. కానీ మనకు తెలిసిన ఆకు కూరలకంటే తెలియనవే ఎక్కువ. అలా అరుదుగా చేసే ఆకుకూరల వంటకాలే ఇవన్నీ. గుంటగలగరాకు పచ్చడి, ఉత్తరేణాకుపప్పు ఇంకా మరికొన్ని రకాల గురించి చదివేయండి..
కామంచి లేదా కాకమాచి ఆకుతో
కావాల్సినవి: కామంచి ఆకు- కప్పు, కందిపప్పు- కప్పు, పచ్చిమిర్చి- ఐదు, చింతపండు గుజ్జు- చెంచాన్నర తాలింపుకోసం: జీలకర్ర, ఆవాలు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, ఎండుమిర్చి- 2 పులుపు కోసం చింతపండు లేకపోతే టొమాటోని వాడుకోవచ్చు.
తయారీ: కుక్కర్‌లో ఆకు, పప్పు వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి మరోసారి ఉడికించుకోవాలి. చివరిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లితో పోపు పెట్టుకుంటే సరి.
లాభాలు: బీపీని అదుపులో ఉంచుతుంది. కాలేయ సమస్యలకు చక్కని మందు.
సెనగాకు కూర
బజారులో సెనగలతోపాటు ఆకు కూడా దొరుకుతుంది. దీంతో కూర వండుకోవచ్చు. లేదంటే కుండీల్లో సెనగలు వేసినా మొలకెత్తుతాయి. వాటినీ వండుకోవచ్చు.
కావాల్సినవి: సెనగాకు- రెండు కప్పులు, పెసరపప్పు- కప్పు, నూనె- రెండు చెంచాలు, పచ్చిమిర్చి- ఆరు, కొబ్బరి- అరకప్పు తాలింపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఎండుమిర్చి
తయారీ: పెసరపప్పుని అరగంటముందు నానబెట్టుకోవాలి. సెనగాకును శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. మూకుడులో కొద్దిగా నూనె వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పసుపు, మిర్చి, ఇంగువతో పోపు వేసి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవి వేగాక నానబెట్టిన పెసరపప్పు వేసి వేయించాలి. అది కొద్దిగా వేగాక సెనగాకుని వేసి ఉప్పు వేసి చిన్న మంటమీద మూత పెట్టి మగ్గనివ్వాలి. కూర మగ్గాక తురిమిన పచ్చికొబ్బరి, కొత్తిమీర వేసి కాసేపు మూత పెట్టి ఉంచి వేగనివ్వాలి. సెనగాకు పొడి కూర సిద్ధం. కూర మొత్తం ఉడికి దగ్గర పడగానే నిమ్మరసం వేసి కలుపుకొంటే చాలా రుచిగా ఉంటుంది.
లాభాలు: సెనగాకులో పీచు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహకరిస్తుంది.
ముల్లంగి ఆకు పకోడి
కావాల్సినవి: సన్నగా తురుమిన ముల్లంగాకు- కప్పు, సెనగపిండి- కప్పు, బియ్యప్పిండి- 2 చెంచాలు, పల్లీలు- రెండు చెంచాలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి- 4, జీలకర్ర- చెంచా, పసుపు, ఇంగువ- కొద్దిగా, తరిగిన కొత్తిమీర- రెండు చెంచాలు
తయారీ: గిన్నెలో తరిగిన ముల్లంగాకు, ఉప్పు, కొత్తిమీర, ఉంటే కొద్దిగా పాలకూర కూడా వేసుకుని కొద్దిగా నీళ్లు చిలకరించి కాస్త గట్టిగా కలుపుకోవాలి. పిండిని కాగుతున్న నూనెలో పకోడీల్లా వేసుకోవడమే. నచ్చితే ఉల్లిపాయ ముక్కలు, ఉల్లి ఆకు కూడా వేసుకోవచ్చు.
లాభాలు: చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఆకు.
ఉత్తరేణి ఆకుతో పప్పు
కావాల్సినవి: ఉత్తరేణి ఆకు- కప్పు, పెసరపప్పు- కప్పు, పచ్చిమిర్చి- నాలుగు, కారం- చెంచా, చింతపండు గుజ్జు- చెంచా, తాలింపుకోసం- జీలకర్ర, ఆవాలు, పసుపు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి
తయారీ: కుక్కర్‌లో పెసరపప్పు, ఉత్తరేణాకు వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులో ఉప్పు, పచ్చిమిర్చి వేసి, కొద్దిగా చింతపండు రసం లేదా నిమ్మరసం వేసి కాసేపు ఉడికించి చివరిగా ఇంగువతో పోపు పెట్టుకోవడమే.
లాభాలు: ఉత్తరేణికి చర్మవ్యాధులని నయం చేసే గుణం ఉంది. దంత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గుంటగలగరాకు పచ్చడి
కావాల్సినవి: గుంటగలగరాకు- కప్పు, ఎండుమిర్చి-8, ధనియాలు- చెంచా, మెంతులు- అరచెంచా, నూనె- చెంచాన్నర, టొమాటో- ఒకటి లేదా చింతపండు గుజ్జు- చెంచాన్నర, నువ్వులు- చెంచా, ఉప్పు- తగినంత, తాలింపు దినుసులు- జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, మినపప్పు, పసుపు, నూనె
తయారీ: కడాయిలో నూనె వేసుకుని వేడెక్కాక అందులో ఎండుమిర్చి, మెంతులు, ధనియాలు, నువ్వులు, మినపప్పు వేయించుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి. అదే మూకుట్లో కొద్దిగా నూనె వేసి కడిగి శుభ్రం చేసుకున్న గుంటగలరాకుని వేసి మగ్గనివ్వాలి. పూర్తిగా మగ్గాక ఉప్పు చేర్చి రుబ్బుకోవాలి. టొమాటోల బదులు చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇంగువతో పోపు వేసుకుంటే గుంటగలరాకు పచ్చడి సిద్ధం.
లాభాలు: ఈ పచ్చడి రక్తవృద్ధికి, శిరోజాలు ఆరోగ్యంగా ఉండటానికీ సహకరిస్తుంది.
కల్యాణి శాస్త్రుల, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Palnadu: తెదేపా నేత జూలకంటి బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కేసు
-
Disney+Hotstar: క్రికెట్ ఫ్యాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ గుడ్‌న్యూస్.. కొత్త ఫీచర్లతో రెడీ
-
Revanth Reddy: మోదీ నోట.. చీకటి మిత్రుడి మాట: రేవంత్
-
Vivek Ramaswamy: వివేక్ పిల్లల.. ‘కేర్ టేకర్’ జీతం రూ.80లక్షలు..?
-
Arunachal Border: భారత సరిహద్దులో.. చైనా, పాకిస్థాన్‌ల సమావేశం!
-
Asian Games 2022: ఆసియా క్రీడలు.. అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకాల వర్షం