జిహ్వకో కొత్త రుచి!

ఓ గిన్నెలో అరటిపండ్ల గుజ్జు వేయాలి. అందులోనే పంచదార, జీలకర్రపొడి, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు దీన్ని ఓ గరిటెతో మెత్తగా అయ్యేలా కలపాలి. అందులోనే గోధుమపిండి, పెరుగు, నెయ్యి,  

Published : 27 Jun 2021 18:10 IST

బనానా పూరీ

కావలసినవి 
అరటిపండ్లు: రెండు, పంచదార: 4 టేబుల్‌స్పూన్లు, జీలకర్రపొడి: అరటీస్పూను,  
గోధుమపిండి: ఒకటిన్నర కప్పులు, పెరుగు: టేబుల్‌స్పూను, బేకింగ్‌సోడా: పావుటీస్పూను, ఉప్పు: చిటికెడు, నెయ్యి: టేబుల్‌స్పూను, నూనె: వేయించడానికి సరిపడా 
తయారుచేసే విధానం 
* ఓ గిన్నెలో అరటిపండ్ల గుజ్జు వేయాలి. అందులోనే పంచదార, జీలకర్రపొడి, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు దీన్ని ఓ గరిటెతో మెత్తగా అయ్యేలా కలపాలి. అందులోనే గోధుమపిండి, పెరుగు, నెయ్యి,  
బేకింగ్‌సోడా వేసి కలపాలి. పిండిముద్ద మరీ గట్టిగా ఉంటే మరికాస్త పెరుగు వేసి కలపాలి. చేతులకి కాస్త నెయ్యి రాసుకుని పిండిని మెత్తగా కలిపి మూతపెట్టి సుమారు ఎనిమిది గంటలపాటు  
నాననివ్వాలి. ఇందులో నీళ్లు అసలు పోయకూడదు.  
* తరవాత ముద్దను చిన్న ఉండల్లా చేసి మందపాటి పూరీల్లా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి. వేడిగానే కాదు, చల్లారినా కూడా బాగుంటాయివి.

పంచరతన్‌ హల్వా

కావలసినవి 
ఖర్జూరాలు: 20, ఎండుద్రాక్ష: పావుకప్పు, బెల్లంతురుము: అరకప్పు, పంచదార: పావుకప్పు, బాదం, జీడిపప్పు: కప్పు, కొబ్బరితురుము: అరకప్పు, నెయ్యి: 3 టేబుల్‌స్పూన్లు, గసగసాలు: 2 టీస్పూన్లు 
తయారుచేసే విధానం 
* ఖర్జూరాల్లో గింజలు తీసి ఓ బాణలిలో వేయాలి. అందులోనే ఎండుద్రాక్ష కూడా వేసి అవి మునిగేవరకూ నీళ్లు పోసి మెత్తగా అయ్యేవరకూ ఉడికించి దించాలి.  
* మిక్సీలో బాదం, జీడిపప్పు వేసి కాస్త గరుకుగా ఉండేలా పొడి చేయాలి. ఇప్పుడు దీన్ని విడిగా తీసి ఉంచాలి. అదే మిక్సీలో చల్లారిన ఖర్జూరాలూ ఎండుద్రాక్ష వేసి మెత్తగా రుబ్బాలి. తరవాత బాదం, జీడిపప్పు పొడి కూడ వేసి ఓసారి తిప్పి తీయాలి.  
* బాణలిలో బెల్లం, పంచదార వేసి అవి మునిగేవరకూ నీళ్లు పోసి గరిటెతో తిప్పుతూ చిక్కని ఉండ పాకం వచ్చేవరకూ ఉడికించాలి. ఇప్పుడు అందులో కొబ్బరి, రుబ్బిన ఖర్జూర మిశ్రమం వేసి, నెయ్యి కూడా వేసి బాగా తిప్పుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా ఉడికి బాగా చిక్కబడ్డాక గసగసాలు చల్లాలి. ఇప్పుడు దీన్ని మరోసారి కలిపి నెయ్యి రాసిన ప్లేటులో వేసి ఆరాక ముక్కలుగా కోయాలి.

కీరా పుడ్డింగ్‌


 

కావలసినవి 
బియ్యం: అరకిలో, కీరాదోస: పావుకిలో, కొబ్బరికాయ: ఒకటి, బెల్లంతురుము: 400గ్రా., ఉప్పు: చిటికెడు 
తయారుచేసే విధానం 
* బియ్యం నాలుగు గంటలపాటు నాననివ్వాలి.  
* కొబ్బరి తురమాలి. కీరా తొక్కు తీసి సన్నగా తురమాలి. బియ్యంలో నీళ్లు వంపేసి మిక్సీలో వేయాలి. అందులోనే తురిమిన కొబ్బరి, కీరాదోస తురుము తగినన్ని నీళ్లు వేసి మెత్తగా దోసెపిండిలా రుబ్బాలి. విడిగా ఓ గిన్నెలోకి బెల్లంతురుము, ఉప్పు వేసి అది కరిగేవరకూ కలపాలి. ఇప్పుడు రుబ్బిన మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. 
* ఇడ్లీ కుక్కర్‌లో అడుగున నీళ్లు పోసి మరిగించాలి. ఓ మందపాటి గిన్నెలో అడుగున నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని వేసి మూతపెట్టి ఆవిరిమీద సుమారు 30 నిమిషాలపాటు ఉడికించాలి. చల్లారాక బయటకు తీసి కావలసిన సైజుల్లో ముక్కలుగా కోసుకుంటే సరి. ఇది బలవర్ధకమైన అల్పాహారం కూడా. 

సెల్‌ రోటి

కావలసినవి 

బియ్యం: 2 కప్పులు, పంచదార: 3 టేబుల్‌స్పూన్లు, నెయ్యి: 3 టేబుల్‌స్పూన్లు, పాలు: అరకప్పు,  
బియ్యప్పిండి: టేబుల్‌స్పూను(అవసరమైతేనే), నూనె: వేయించడానికి సరిపడా 
తయారుచేసే విధానం 
* బియ్యం 8 గంటలపాటు నానబెట్టాలి. నీళ్లు వంపేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. అందులోనే పంచదార, నెయ్యి, పాలు కూడా పోసి మరోసారి పేస్టులా మెత్తగా అయ్యేవరకూ రుబ్బాలి. పిండి మరీ జారుగా కాకుండా కాస్త గట్టిగానే ఉండాలి. రుబ్బిన తరవాత ఇంకా పలుచగా అనిపిస్తే బియ్యప్పిండి వేసి కలపాలి.  
* ఇప్పుడు పిండిని ప్లాస్టిక్‌ కవర్‌లో వేసి దానికి రంధ్రం పెట్టి కాస్త పెద్ద సైజు చెగోడీ మాదిరిగా గుండ్రంగా చుట్టినట్లుగా కాగిన నూనెలో వేసి బంగారువర్ణంలోకి మారేవరకూ వేయించి తీయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని