మీ క్యాలెండర్‌ బంగారం గానూ..

కాలాన్ని డబ్బుతోనే కాదు, బంగారంతోనూ కొనలేమన్నది ఎవరూ కాదనలేని మాట. కానీ ఆ కాలాన్ని చూపే క్యాలెండర్‌ని మాత్రం బంగారంతో చేయించుకోవచ్చు అన్నది ఇప్పుడు అందరూ ఒప్పుకోవాల్సిన మాట. ఎందుకంటే...

Updated : 02 Jan 2022 14:18 IST

మీ క్యాలెండర్‌ బంగారం గానూ..

కాలాన్ని డబ్బుతోనే కాదు, బంగారంతోనూ కొనలేమన్నది ఎవరూ కాదనలేని మాట. కానీ ఆ కాలాన్ని చూపే క్యాలెండర్‌ని మాత్రం బంగారంతో చేయించుకోవచ్చు అన్నది ఇప్పుడు అందరూ ఒప్పుకోవాల్సిన మాట. ఎందుకంటే... ఎందరో దేవీదేవుళ్ల రూపాలతో పసిడి మెరుపులతో ‘గోల్డ్‌ ఫాయిల్‌ క్యాలెండర్లు’ వచ్చేశాయి మరి!

2021కి బైబై చెప్పేశాం, 2022లో అడుగుపెట్టేశాం. ఈ కొత్త సంవత్సరంలో మన ఇంట్లోని ఏ వస్తువులోనూ ఎలాంటి మార్పూ రాకపోవచ్చేమో కానీ ఒక్క దాంట్లో మాత్రం తప్పకుండా వచ్చితీరుతుందంతే. మారే ఆ వస్తువేదో ఇప్పటికే అర్థమై ఉంటుందిగా, అదేనండీ... క్యాలెండర్‌. రోజూ, తేదీ, నెలా చూడ్డానికి ప్రతి ఒక్కరూ కచ్చితంగా దీన్ని ఫాలో అయిపోవాల్సిందే. అందుకే అందరి ఇళ్లల్లో, ఆఫీసుల్లో ఇది కనిపించేస్తుంది. అవసరాన్ని బట్టి వీటిల్లో కాగితమూ, కలపా, ప్లాస్టిక్‌తో చేసినవే ఉపయోగించి ఉంటారిన్నాళ్లూ. వాటన్నింటికి కాస్త వెరైటీగా మార్కెట్లో గోల్డ్‌ ఫాయిల్‌ క్యాలెండర్లూ దొరికేస్తున్నాయిప్పుడు. కాలం ఎంతో విలువైనది కదా మరి దాన్ని చూపే క్యాలెండర్‌ కూడా అంతే విలువైనదిగా ఉండాలనుకున్నారో ఏమో కొంతమంది తయారీదారులు పలుచటి బంగారు రేకులతో క్యాలెండర్‌ను తయారుచేసి ఇస్తున్నారు. పసిడి కాంతులకు దేవతామూర్తుల చిత్రాల్ని జోడించి అందంగా రూపుదిద్దుతున్నారు. కొన్నింటిని ఆ ఏడాదికి సంబంధించిన నెలలూ తేదీలను దానిమీదే అచ్చువేసి రూపొందిస్తుంటే... ఇంకొన్నింటిలో ఎప్పటికైనా వాడుకునేలా పైన చూడముచ్చటైన చిత్రాన్నీ కింద కాగితపు క్యాలెండర్‌నీ జత చేస్తున్నారు. దీంట్లో సంవత్సరం పూర్తికాగానే మళ్లీ న్యూ ఇయర్‌ క్యాలెండర్‌ను పెట్టేసుకోవచ్చన్నమాట. కొన్ని జ్యువెలరీ దుకాణాలతో పాటు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. మనకు కావాల్సిన భాషా, సైజూ... నచ్చిన చిత్రం ఎంచుకుని ఆర్డర్‌ ఇస్తే చాలు. త్రీడీ హంగులతో బంగారురేకుల క్యాలెండర్‌ ఇంటికి వచ్చేస్తుంది. బంగారం అనగానే బాబోయ్‌ ఎంత ధర ఉంటుందో అనుకునేరు, కొన్ని రకాల ఆహార పదార్థాలమీద వాడే గోల్డ్‌ ఫాయిల్‌ లాంటిదే ఇదీ కాబట్టి అందుబాటు ధరలోనే ఉంటుంది.

ఎందరో దేవుళ్లు...
మనం నిత్యం కొలిచే సీతారాముల రూపంతో ఉన్న ఈ మెరుపుల క్యాలెండర్‌ని ఇంట్లో గోడమీద ఉంచామంటే తిథులు చూడ్డానికే కాదు, మామూలు సమయాల్లోనూ చూపు ఆ సుందరచిత్రం వైపు మరలదా చెప్పండి. సన్నిహితులకు వారివారి అభిరుచిని బట్టి చిన్నికృష్ణుడు, లక్ష్మీదేవి, దుర్గమ్మ, శివపార్వతులు, గణపయ్య, ఆంజనేయుడు, వేంకటేశ్వరస్వామి... ఇలా వారికిష్టమైన దైవాల ఫొటోలతో చేసిన ఈ పసుపు వన్నెల క్యాలెండర్లను ఇచ్చి చూడండి, ‘ఇక ఈ ఏడాదంతా మీకు బంగారుమయమే అని చెప్పకనే చెప్పినట్టుందే’ అనుకుని ఎంతో ఆనందపడిపోతారు.


బెడ్‌షీట్లనూ పంచుకుంటూ..

ధురానుభూతుల్ని పంచుకుంటూ, మనసుల్ని పెనవేసుకుంటూ... గడిపే పడకగది ప్రత్యేకంగా కనిపించాలనుకునే జంటలు చాలామందే. వారికోసమే మార్కెట్‌లోకి వచ్చాయి ‘కపుల్‌ బెడ్‌షీట్‌లు’. తెలుపూ, నలుపూ రంగులతో నీకో సగం, నాకో సగం అన్నట్లు ఉండే ఈ దుప్పట్లు పడకగదికి కొత్తందం తెచ్చిపెడతాయి. అంతేకాదు దంపతుల్ని గుర్తు చేసేలా బొమ్మలూ, దుస్తులూ, చెప్పులూ వంటి గుర్తులూ... వివిధ రకాల కొటేషన్లతో వీటిని తీర్చిదిద్దారు డిజైనర్లు. ఈ బెడ్‌షీట్లు మనసుకి నచ్చడమే కాదు... మంచంపై వేస్తే గదికి నయా లుక్‌ రావడం ఖాయం.


ముచ్చటగా మీటర్‌ బాక్సులు...

ధునిక జీవనశైలిలో ఇంటీరియర్‌ వస్తువులకూ, డిజైన్లకూ ప్రాధాన్యం పెరిగింది. కాళ్లు తుడుచుకునే మ్యాట్‌ల నుంచి గోడలకు కొట్టే మేకుల వరకూ...అన్నీ ఇంటికి కొత్తదనం తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నారు అందరూ. అలాంటి వాటిల్లో ఎలక్ట్రిక్‌ మీటర్‌ బాక్స్‌లు కూడా ఒకటి. ఇప్పటివరకూ ఇంటి వరండాలోనో, గది మూలనో అప్రాధాన్యంగా ఉన్న మీటర్లకు కూడా అలంకరణ అవసరమే అంటున్నారిప్పుడు. అందుకు తగ్గట్లుగానే... మార్కెట్‌లోకి వచ్చాయి డెకరేటివ్‌ మీటర్‌ బాక్సులు. తోటలూ, తలుపులూ, కిటికీల వంటి రకరకాల డిజైన్లలో దొరుకుతున్నాయివి. కొని తీసుకొచ్చి తగిలిస్తే చాలు, మీటర్‌ బాక్స్‌కు అందమైన ముసుగు వేసినట్లే. బాగున్నాయి కదూ!  


పూల కాంతులివి..

ఇంట్లో ప్రతి గదికీ ఒకటి రెండు లైట్లు ఉండటం సహజమే. కానీ అవి వెలుగుల్ని మాత్రమే ఇస్తే ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏముండదు. అందుకే తయారీదారులు వాటికే అదనపు హంగులూ, అలంకరణలూ చేరుస్తున్నారు. అలాంటివే ఈ ఫ్లోరల్‌ లైట్లు. పూలే కాంతిని విరజిమ్ముతున్నాయా అన్నట్లు కనిపిస్తోన్న వీటిని వాషి అనే జపనీస్‌ పేపర్‌తో తయారు చేశారు. ఆన్‌లైన్‌లో వివిధ రకాల పూలూ, రంగులను పోలి ఉండే ఈ లైట్లను నట్టింట్లో సీలింగ్‌ నుంచి వేలాడదీస్తే కాంతిని అందించడంతో పాటు కళనూ తెచ్చిపెడతాయి.


ముచ్చటైన రోళ్లు

మిక్సీలూ, గ్రైండర్ల వాడకం వచ్చాక చాన్నాళ్లు రాతి రోళ్లు వినియోగించడం తగ్గింది. మళ్లీ ఇప్పుడిప్పుడే ఆ పాత పద్ధతుల్నే చిన్న చిన్న మార్పులతో తిరిగి కొత్త అలవాట్లుగా మార్చుకుంటున్నారు. కాకపోతే, పల్లెటూళ్లలోలా పెద్ద రోళ్లకు బదులు చిన్నవి ఎంచుకుంటున్నారు. వీటిల్లోనూ సాధారణ గ్రానైట్‌ రకాలతో పాటు మార్బుల్‌, పాలరాయివీ వినియోగిస్తున్నారు. ఇత్తడీ, చెక్కతో చేసినవీ మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిపై చెక్కిన డిజైన్లు చూడముచ్చటగా ఉంటున్నాయి. అంతేనా! మసాలాలు, కొద్ది కొద్దిగా చేసుకునే రోటి పచ్చళ్లకు ప్రత్యేక రుచితో పాటు వంటింటికి అందాన్నీ తెచ్చిపెడుతుండటంతో అందరూ వీటికే ఓటేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు