పిల్లలకు ఇవ్వాల్సిన సంపద!

స్వామి వివేకానంద తండ్రి విశ్వనాథ దత్తా ఆ రోజుల్లో కలకత్తాలోనే బాగా పేరున్న న్యాయవాది. ఆయన నగరంలోని శ్రీమంతుల్లో ప్రముఖుడు. ఎంతో ఉదారుడు కూడా. దానధర్మాల్లో విశ్వనాథదత్తాది అందెవేసిన చేయి.

Published : 22 Jun 2023 00:43 IST

స్వామి వివేకానంద తండ్రి విశ్వనాథ దత్తా ఆ రోజుల్లో కలకత్తాలోనే బాగా పేరున్న న్యాయవాది. ఆయన నగరంలోని శ్రీమంతుల్లో ప్రముఖుడు. ఎంతో ఉదారుడు కూడా. దానధర్మాల్లో విశ్వనాథదత్తాది అందెవేసిన చేయి. ఆయనలా ఎముక లేని చేతితో యథేచ్ఛగా ధనాన్ని వెచ్చిస్తుంటే కుటుంబసభ్యులు ఆందోళనచెందినా ఎవరూ ధైర్యం చేసి బయటపడేవారు కాదు. వివేకానంద మాత్రం యుక్తవయసులో ఒకసారి ధైర్యం చేసి తండ్రితో ‘నాన్నా! ఇలా సంపాదించిన దంతా అందరికీ పంచేస్తూ ఉంటే, ఇకేం మిగులు తుంది? నాకంటూ ఏమీ ఇవ్వవా?’ అనడిగాడు సరదాగా. దానికాయన బదులు చెప్పక, నిలువుటద్దం వద్దకు తీసుకెళ్లారు. వివేకానందను దాని ముందు నిలబెట్టి ‘చూడు నేను నీకేమిచ్చానో! ఇదుగో ఈ బలిష్టమైన శరీరం.. ఇదే నీకు నేనిచ్చిన ఆస్తి. పెద్ద చదువు, ఆరోగ్యవంతమైన శరీరం.. ఇంతకన్నా సంపద ఇంకేముంటుంది చెప్పు?!’ అన్నారు ప్రశాంతంగా నవ్వుతూ. విశాలమైన వ్యక్తిత్వం, విలువైన జీవనప్రమాణాలు పిల్లలకు అందిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా రూపొందుతుందన్నది విశ్వనాథదత్తా ఆలోచన. దాన్నాయన పుత్రుడి ద్వారా నిరూపించారు. విశ్వనాథ దత్తా విశాలభావాలు కలిగిన ఆభ్యుదయవాది. రచయిత, గాయకుడు. పలుభాషల్లో నిష్ణాతుడు. సంగీతాన్ని ఆస్వాదించే వారు. ఆ సద్గుణాలన్నీ తండ్రి ద్వారానే పుణికి పుచ్చుకున్నానని తదనంతర కాలంలో వివేకానంద సగర్వంగా గుర్తుచేసుకునేవారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని