చెరసాలలో కృష్ణ సాక్షాత్కారం

తల్లి, తండ్రి, గురువు, దైవం.. అన్నారు. తల్లిని ప్రేమించడం దైవాన్ని ఆరాధించడం లాంటిదే. తల్లితో సమానమైంది కనుక దేశాన్ని ప్రేమించడమూ మహోన్నతమే.

Published : 10 Aug 2023 00:17 IST

(ఆగస్టు 15 శ్రీఅరవిందుల జయంతి)

ల్లి, తండ్రి, గురువు, దైవం.. అన్నారు. తల్లిని ప్రేమించడం దైవాన్ని ఆరాధించడం లాంటిదే. తల్లితో సమానమైంది కనుక దేశాన్ని ప్రేమించడమూ మహోన్నతమే. దేశమాత దాస్యశృంఖలాలను తొలగించేందుకు తన రచనా పరంపరతో సమరశంఖం పూరించి బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించారు శ్రీఅరవిందులు. ఆయన 1872 ఆగస్టు 15న కోల్‌కతాలో జన్మించారు. పుట్టగానే పరిమళించినట్లు దేశభక్తి ఆయనలో ప్రభవించింది. తండ్రి డా.కృష్ణధన్‌ఘోష్‌ ఆంగ్లేయుల మానసపుత్రుడు. దాంతో హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడిలా ఉండేది. ఏడేళ్ల వయసులోనే చదువు కోసం లండన్‌ వెళ్లారు. 14 ఏళ్లు పరదేశంలో గడిపి, వనవాసం ముగించిన అయోధ్యారాముడిలా స్వదేశానికి తిరిగొచ్చారు.

అరవిందుల జీవన ప్రస్థానం రెండు దశలుగా సాగింది. 1910 వరకూ భౌతికమైతే, అక్కడి నుంచి ఆధ్యాత్మికం. బరోడా మహారాజా కళాశాలలో ఆంగ్లోపన్యాసకుడిగా రాజీనామా చేసి ‘వందేమాతరం’ పత్రికకు సంపాదకత్వం చేపట్టారు. ఆ పత్రిక ఎందరినో ఉద్యమవీరులుగా మలిచింది. ఆయన రచనలు తెల్లదొరలను కలవర పరిచాయి. దేశద్రోహం పేరుతో మూడుసార్లు జైల్లో పెట్టి.. నేరం రుజువు చేయలేక విడుదల చేశారు. మరోసారి ముజఫర్‌పూర్‌ బాంబు పేలుడులో ఆయన పాత్ర లేకున్నా చెరసాలలో బంధించారు. అక్కడే కృష్ణ సాక్షాత్కారం కలిగింది. తర్వాత పాండిచ్చేరి ఆశ్రమంలో ఆధ్యాత్మిక జీవనం ఆరంభించి ప్రపంచానికి దివ్యజీవన సందేశం అందించారు. పరోక్షంగా స్వాతంత్య్ర సమరానికి ఆధ్యాత్మిక శక్తిని పెంచారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ దినం ఆయన 151వ జన్మదినం కావడం ముదావహం.

ఉప్పు రాఘవేంద్ర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని