కానుకలు తిరస్కరించిన సద్గురువు

ఛత్రపతి శివాజీ మహారాజు గురువు సమర్థ రామదాసు. తనకు మార్గనిర్దేశనం చేస్తూ, ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడుతున్న గురువుకు దక్షిణగా శివాజీ.. దుస్తులు, ఆహారసామగ్రి, ఆభరణాలు మొదలైనవి పంపాలనుకున్నారు.

Published : 10 Aug 2023 00:24 IST

త్రపతి శివాజీ మహారాజు గురువు సమర్థ రామదాసు. తనకు మార్గనిర్దేశనం చేస్తూ, ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడుతున్న గురువుకు దక్షిణగా శివాజీ.. దుస్తులు, ఆహారసామగ్రి, ఆభరణాలు మొదలైనవి పంపాలనుకున్నారు. ఓ రోజు సైనికుల్ని పిలిచి ‘మా గురుదేవులకు అవసరమైన సామగ్రిని ఆశ్రమానికి చేర్చండి’ అని ఆదేశించారు. రాజభటులు మహారాజు ఆదేశం మేరకు దుస్తులు, ఆహారపదార్థాలు, ఆభరణాలు సమర్థరామదాసు వద్దకు తీసుకువెళ్లారు. ధ్యాననిమగ్నులైన ఆ సద్గురువు కళ్లు తెరచి, ఎదుట ఉన్న వస్తువులను చూసి ‘ఎవరి కోసం ఇవన్నీ?’ అనడిగారు. ‘మహారాజు తమరికి ఇవ్వమన్నారు!’ అన్నాడు సైన్యాధ్యక్షుడు. రామదాసు నవ్వి ‘అయ్యో! ఒక మహారాజుకే నాపై ఇంత దయ, అపేక్ష ఉంటే, సర్వలోకాలకూ అధిపతి అయిన ఆ భగవంతుడికి నాపై ఇంకెంత కరుణాకటాక్షాలు ఉంటాయి! ఇన్నాళ్లుగా నా అవసరాలు తీర్చిన ఆ పరమాత్మ, ఇకపై మాత్రం చూసుకోడా? ఈ మాటే మీ మహారాజుకు తెలియజేయండి! అన్యధా భావించవద్దని నా అభ్యర్థనగా విన్నవించండి. దయచేసి వీటన్నింటినీ తిరిగి తీసుకువెళ్లండి’ అని సున్నితంగా తిరస్కరించారు. సద్గురువులు ఆ సర్వేశ్వరుణ్ణి ఆశ్రయిస్తారే తప్పించి మరెవరి మీదా ఆధారపడరని నిరూపించారాయన.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని