భీష్ముడు చెప్పిన కథ

ఒక కీటకం శకటాలు నడిచే బాటలో వేగంగా పరుగెడుతోంది. అది చూసి ‘ఎందుకలా పరిగెడుతున్నావు? ఏమైనా ఆపద ముంచుకొచ్చిందా?’ అనడిగాడు వేదవ్యాసుడు.

Published : 31 Aug 2023 00:04 IST

ఒక కీటకం శకటాలు నడిచే బాటలో వేగంగా పరుగెడుతోంది. అది చూసి ‘ఎందుకలా పరిగెడుతున్నావు? ఏమైనా ఆపద ముంచుకొచ్చిందా?’ అనడిగాడు వేదవ్యాసుడు. ‘శకటాలు, రథసారథుల శబ్దాలకు భయమేసింది. ప్రాణం మీది తీపితో తప్పించుకోవాలని చూస్తున్నాను’ అంది కీటకం. ‘నీవంటి కీటకాలకు ఇంద్రియసుఖాలు పొందే అవకాశం లేదు. ఉన్నవన్నీ దుఃఖాలే. మరి బతుకు మీద తీపి ఎందుకు?’ అన్నాడు వ్యాసుడు.

‘గతజన్మలో నేనొక అత్యాశాపరుణ్ణి. స్వార్థంతో ఇతరుల ధనాన్ని ఆశించి కూడబెట్టడంతో నాలో వినయం పోయి క్రౌర్యం నిండింది. కానీ మాతృ మూర్తిని దేవతలా ఆరాధించి సేవచేయడం, అతిథిగా వచ్చిన బ్రాహ్మణుణ్ణి పూజించడం లాంటి పుణ్యఫలంతో పూర్వజన్మ జ్ఞాపకాలు నాలో ఉన్నాయి. సత్కర్మలు సుఖాన్నిస్తాయని తెలుసుకున్నాను’ అంది కీటకం.

‘నువ్వు చేసిన పాపాలూ, పుణ్యాలూ రెండూ తెలుసు. నీ అంతరంగం తెలుసుకోవాలనే అడిగాను. పాపాల ఫలితంగా పురుగై పుట్టావు. పుణ్య కర్మల ఫలితంగానే నువ్వు నాతో మాట్లాడావు. ఇది కర్మ భూమి. ఇక్కడ జీవులు మంచి పనులు చేస్తే సత్ఫలితాలను, పాపాలు చేస్తే కీటకాలుగా జన్మిస్తారు. ఈ క్షణమే కీటక జన్మ నుంచి నీకు విముక్తి కలిగిస్తాను. నిశ్చింతగా ఉండు’ అని మోక్షం కల్పించాడు వ్యాసుడు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు- పాపపుణ్యాల గురించి ధర్మరాజుకు చెప్పిన కథ ఇది.

ఉమా మహేష్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని