మనసు శుద్ధి అయితేనే...

పద్మలోచనుడనే యువకుడు ఏ పనీ లేకుండా తిరుగుతుండేవాడు. ఆ ఊళ్లో కొండపైన ఓ దేవాలయం శిథిలావస్థలో ఉంది.

Published : 19 Oct 2023 00:16 IST

ద్మలోచనుడనే యువకుడు ఏ పనీ లేకుండా తిరుగుతుండేవాడు. ఆ ఊళ్లో కొండపైన ఓ దేవాలయం శిథిలావస్థలో ఉంది. విగ్రహాలను దొంగలు అపహరించారు. ఆలయం లోపలా, బయటా చెట్టుచేమలు వ్యాపించగా.. గర్భమందిరం గుడ్లగూబలూ, గబ్డిలాలకు ఆలవాలమైంది. ఇలా పాడుబడ్డ కోవెల నుంచి ఓ రోజు- జేగంటలు, శంఖరావాలు వినిపించాయి. ఎవరో భక్తుడు ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజాదికాలు చేస్తున్నాడని భావించారు గ్రామస్థులు. అందరూ కొండపై దేవళానికి చేరుకున్నారు. చేతులు జోడించి విగ్రహాన్ని తిలకిద్దామని నిరీక్షించారు. వారిలో ఒకరు ఏం జరుగుతున్నదో చూద్దామన్న కుతూహలంతో లోనికి తొంగిచూశాడు. ఆలయం ఎప్పటిలానే అశుభ్రంగా, చిందరవందరగా ఉంది. దైవ ప్రతిమ లేదు. పూజాద్రవ్యాలు లేవు. కోవెల ప్రాంగణమంతా దుర్వాసన కొడుతోంది. కానీ పద్మలోచనడు మాత్రం ఓ మూలన నిలబడి.. ఎడతెరపి లేకుండా గంట కొడుతున్నాడు, శంఖం ఊదుతున్నాడు. వాళ్లంతా ఆగ్రహించి ‘మందమతీ! ఇదేం విడ్డూరం? గుడిలో విగ్రహం లేకుండా, ఆలయాన్ని శుద్ధి చేయ కుండా.. ఈ శంఖరావాలేంటి? ఇలా గంట మోగించటమేంటి?’ అని కోప్పడ్డారు. ఒకసారి రామకృష్ణ పరమహంస ఈ కథ చెప్పి- ‘మనసే మందిరం. దాన్ని పరిశుద్ధం చేయకుండా, భక్తి పేరుతో ఎన్ని ఆర్భాటాలు చేసినా నిష్ప్రయోజనం. మొదట మన అంతరంగాన్ని పవిత్రం చేసుకోవాలి. ఆపైనే బాహ్య ఉపచారాలకు ఉపక్రమించాలి’ అని ఉపదేశించారు.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని