ఆనంద పారవశ్యాల సఖ్యభక్తి

దేవుడిచ్చిన వరం స్నేహం. కాలం గడిచేకొద్దీ గాఢత పెరుగుతుంది. మన బలహీనలతలను గుర్తుచేసి, వాటికి లొంగకుండా నిలబెడుతుంది.

Updated : 09 Nov 2023 00:47 IST

దేవుడిచ్చిన వరం స్నేహం. కాలం గడిచేకొద్దీ గాఢత పెరుగుతుంది. మన బలహీనలతలను గుర్తుచేసి, వాటికి లొంగకుండా నిలబెడుతుంది. పెను సమస్యలను చిన్నవిగా మార్చే శక్తి దానికుంది. కష్టసుఖాల్లో వెన్నంటి నడిపిస్తుంది. మనలో మంచిని ప్రశంసలతో పెంచుతూ, చెడును విమర్శలతో అరికడుతుంది. దుర్యోధన, కర్ణుల స్నేహం అవసరార్థంగా ప్రారంభ మైంది. అర్జునుడికి పోటీగా కర్ణుణ్ణి చేరదీశాడు దుర్యోధనుడు. విజయం సాధిస్తాడని చివరి వరకూ ధీమాగా ఉన్నాడు. దుర్యోధనుడు చెడు దోవలో నడుస్తున్నాడని తెలిసినా.. స్నేహధర్మానికి కట్టుబడి ప్రాణత్యాగం చేశాడు కర్ణుడు. పాండవులతో సఖ్యంగా ఉండమని కన్నతల్లి కుంతి ఎంత నచ్చ జెప్పబోయినా వినలేదు.

రామాయణంలో రామ, సుగ్రీవుల స్నేహం పవిత్రమైంది. సుగ్రీవుడి అర్ధాంగిని అపహరించి, అధర్మం చేస్తున్న వాలిని చంపి- సుగ్రీవుణ్ణి రాజును చేశాడు. ఆంజనేయుడి ద్వారా సీత జాడ తేలియజేసి- స్నేహధర్మం పాటించాడు సుగ్రీవుడు. ధర్మానికి మరో రూపమైన రాముడు స్నేహాన్ని పాటించి ఆదర్శమూర్తిగా నిలిచాడు. కృష్ణార్జునుల మధ్య స్నేహంతో కూడిన భక్తి ఉంది. భగవంతుడికి- భక్తుడు స్నేహితుడి వంటివాడే. భక్తుడు దేవుణ్ణి ఆర్తిగా మిత్రుణ్ణి పిలిచినట్లు పిలుస్తాడు. తన బాధలు, ఆనందాలు.. ఏవైనా దేవుడికి స్నేహితుడిలా చెబుతాడు. కోపం వచ్చినా, కోరికలు తీరకపోయినా.. దూషిస్తూ కూడా భగవంతుడికి మొరపెట్టుకుంటాడు. ఆనందాన్ని పారవశ్యంతో వ్యక్తం చేస్తే సఖ్యభక్తి అంటారు. నవవిధ భక్తి మార్గాల్లో ఇదొకటి. అన్నమయ్య, రామదాసుల కీర్తనల్లో భగవంతుడితో స్నేహమాధుర్యం కనిపిస్తుంది. భక్తుడు భగవంతుని అర్చించే సమయంలో భక్తిలో రమించడంలోనూ అదే భావం కనిపిస్తుంది. అలా సఖ్యభక్తితో తనలో ఉన్న ఆత్మస్వరూపం గుర్తిస్తాడు భక్తుడు. తుదకు ఆత్మసాక్షాత్కారం పొంది ఆయనను చేరతాడు.

యం.వి.రామారావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని