అల్లాహ్‌కు కృతజ్ఞతలు

ఒకసారి ఖలీఫా హారూన్‌ రషీద్‌ తన దర్బారులో పరిపాలనా వ్యవహారాలు చూస్తుండగా బాగా దాహం వేసింది. ఆయన ఆజ్ఞ మేరకు సేవకులు నీళ్ల గ్లాసుతో ప్రత్యక్షమయ్యారు. ఆయన పక్కనే ఉన్న హజ్రత్‌ సమాక్‌ అనే ఒక పండిత మహాశయుడు ‘ఖలీఫా! నీళ్లు తాగే ముందు నాదో విన్నపం’ అన్నాడు.

Published : 16 Nov 2023 00:16 IST

ఇస్లాం సందేశం

కసారి ఖలీఫా హారూన్‌ రషీద్‌ తన దర్బారులో పరిపాలనా వ్యవహారాలు చూస్తుండగా బాగా దాహం వేసింది. ఆయన ఆజ్ఞ మేరకు సేవకులు నీళ్ల గ్లాసుతో ప్రత్యక్షమయ్యారు. ఆయన పక్కనే ఉన్న హజ్రత్‌ సమాక్‌ అనే ఒక పండిత మహాశయుడు ‘ఖలీఫా! నీళ్లు తాగే ముందు నాదో విన్నపం’ అన్నాడు. బదులుగా ‘విన్నవించండి’ అన్నారు ఖలీఫా. ‘మన రాజ్యంలో ఎక్కడా చుక్క మంచినీరు దొరకలేదు అనుకోండి.. అప్పుడు మీ చేతిలో ఉన్న గ్లాసు మంచినీళ్లకు ఎంత మూల్యం చెల్లిస్తారు?’ అనడిగారు. అది విన్న ఖలీఫా ఆశ్చర్యానికి లోనై, ఆలోచనలో మునిగారు. కాసేపటికి తేరుకొని ‘అవసరమైతే రాజ్యంలోని సగ భూభాగాన్ని అమ్మేసి.. నీళ్లను కొంటాను’ అన్నారు. తిరిగి పండితుడు ‘తమరు నీళ్లు తాగిన తర్వాత, ఆ నీరు మూత్రం రూపంలో బయటకు రాకుండా మీరు ఇబ్బంది పడితే.. అప్పుడెంత ఖర్చుపెడతారు?’ అనడిగాడు. అప్పుడు ఖలీఫా ‘ఆ బాధ నుంచి విముక్తి పొందేందుకు నా రాజరికాన్ని వదులుకోవడానికైనా, యావదాస్తినీ తాకట్టు పెట్టేందుకైనా వెనుకాడను. ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎన్ని ఆస్తులున్నా, ఎంత అధికారం ఉన్నా ఏం ప్రయోజనం?!’ అన్నారు.

అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే.. మనకు దైవం అందించిన సంపదలకు, మనం సాధించిన ఉన్నతికి అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలియజేయాలి. నిత్యం ‘అల్‌ హందులిల్లాహ్‌’ అని పఠిస్తుండాలి. అది దైవానికి కృతజ్ఞతలు చెప్పే ఒక మార్గం. అప్పుడు అల్లాహ్‌ సంతుష్టుడవుతాడు. ‘మీరు కృతజ్ఞులై ఉండేట్లయితే.. నేను మరింత ఎక్కువ అనుగ్రహిస్తాను. అందుకు భిన్నంగా ఉంటే.. నా శిక్ష చాలా కఠినంగా ఉంటుంది’ అనేది ఖురాన్‌ వాక్యం. అందువల్ల అల్లాహ్‌ అనుగ్రహం అనే వర్షం మనపై కురవాలంటే.. ఆయనకు దాసులుగా మారి కృతజ్ఞతలు తెలియజేద్దాం.  

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని