జగన్నాథస్వామీ నయన పథగామీ

పూరీ క్షేత్రంలోని మూలవిరాట్టే ఉత్సవమూర్తై పురవీధుల్లో ఊరేగే పవిత్ర వేడుక జగన్నాథయాత్ర. సర్వజగత్తునూ కాపాడే జగన్నాథమూర్తి, సకలజనావళిని ఆకర్షించే బలరాముని విగ్రహం, శక్తితత్త్వమైన సుభద్రలు..

Published : 15 Jun 2023 00:21 IST

జూన్‌ 20 పూరీ జగన్నాథస్వామి రథయాత్ర

పూరీ క్షేత్రంలోని మూలవిరాట్టే ఉత్సవమూర్తై పురవీధుల్లో ఊరేగే పవిత్ర వేడుక జగన్నాథయాత్ర. సర్వజగత్తునూ కాపాడే జగన్నాథమూర్తి, సకలజనావళిని ఆకర్షించే బలరాముని విగ్రహం, శక్తితత్త్వమైన సుభద్రలు.. మూడు రథాలపై దర్శనమిచ్చే దివ్యోత్సవమే జగన్నాథ రథయాత్ర.

సర్వేశ్వరుడు సతీసమేతంగా కాకుండా సోదరి, సోదరు లతో పూజలందుకోవటం ఇక్కడి విశిష్టత. ఉత్సవంలో ఆ మూర్తులతో పాటు సుదర్శన చక్రాన్ని ఊరేగిస్తూ సమీపంలోని గుండీచా మందిరానికి తీసుకెళ్లటం సంప్రదాయం. వారంరోజులు మందిరంలో పూజాదికాలు నిర్వహించి, తిరిగి ప్రధాన ఆలయంలోకి విగ్రహాలను తీసుకొస్తారు. ఏటా ఆషాఢమాసంలో జరిగే ఈ రథోత్సవం దర్శనభాగ్యంతోనే భక్తుల్లో ఆధ్యాత్మిక జాగృతిని కలిగిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. ఈ వేడుకను ఘోషయాత్ర, నవదినయాత్ర, దశావతార యాత్ర, గుండీచా యాత్ర- ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు. రథోత్సవంలో తొలుత చందనయాత్ర, స్నానయాత్ర నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 21రోజులు దేవతామూర్తులకు గంధపు నీటితో స్నానం చేయించడం ఆచారం.


దర్శనంతో ధన్యత

రథంపై ద్విగుణ తేజస్సుతో దర్శనమిచ్చే జగన్నాథుని వీక్షిస్తే జన్మరాహిత్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ‘రథేతు వామనమ్‌ దృష్ట్వా పునర్జన్మ న విద్యతే’ అన్నారు. రథంపై ఉన్న వామనమూర్తిని దర్శించటం వల్ల జనన మరణాలనే చక్రభ్రమణం నుంచి విముక్తి లభిస్తుందన్నమాట. అలాగే స్కంద పురాణం రథయాత్ర వైశిష్ట్యాన్ని..
గుండీచామండపం నామం యాత్రాహ మజనమ్‌
పురా అశ్వమేధ సహస్రస్యా మహాబేది తదద్వవత్‌

అంటూ వర్ణించింది. రథాలపై ఊరేగింపుగా వెళ్లి గుండీచా మందిరానికి చేరిన స్వామిని దర్శించినవారు ధన్యులు. వారికి వేయి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం దక్కుతుందనేది భావం. అలాగే పూరీజగన్నాథ రథయాత్రలో పాల్గొంటే సకల దేవతల ఆశీస్సులు అందుతాయని పారమార్థికుల నమ్మకం.


మూడు తేరుల్లో మూలమూర్తులు

‘నందిఘోష’ జగన్నాథుడి రథం. ఈ తేరును గరుడధ్వజ, కపిధ్వజ అని కూడా పిలుస్తారు. ఇది 45అడుగుల ఎత్తు, అంతే విస్తీర్ణం గల బృహద్రథం. 7అడుగుల వ్యాసార్థం గల 16చక్రాలను అమర్చి, ఎరుపు, పసుపు వస్త్రాలతో అలంకరిస్తారు. గరుడుడి రక్షణలో ఉన్న ఈ రథానికి సారథి దారకుడు(చీల్చేవాడని అర్థం). ధ్వజం పేరు త్రైలోక్యమోహిని. శంఖ, పలాహక, శ్వేత, హరిదశ్వ- అశ్వాల పేర్లు. శంఖుచూడుడనే నాగదేవత పగ్గాలకు అధిదేవత. వరాహ, గోవర్ధన, గోపీకృష్ణ, నృసింహ, రామ, నారాయణ, త్రివిక్రమ, హనుమ, రుద్ర- ఈ చక్రపాదాన్ని అధిష్టించి ఉండే నవ దేవతలు.
బలభద్రుడి రథం తాళధ్వజ. ఎత్తు 44అడుగులు. 14చక్రాలు అమర్చి, ఎరుపు, ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరిస్తారు. వసుదేవుడు రక్షకుడు. సారథి మాతలి. తీవ్ర, ఘోర, దీర్ఘశర్మ, స్వర్ణనవ- గుర్రాల పేర్లు. పగ్గాలను అధిష్టించే నాగదేవత వాసుకి. గణేశ, కార్తికేయ, సర్వమంగళ, ప్రలంబరి (ప్రలంబుడు అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు.. బలరాముడు), హతాయుధ, మృత్యుంజయ, ముక్తేశ్వర, శేషదేవ- అధిష్టించి ఉండే దేవతలు.
ఇక సుభద్రాదేవి రథం దర్పదళన. పద్మధ్వజ, దేవ దళన పేర్లూ ఉన్నాయి. 42అడుగుల ఎత్తు, 12చక్రాలతో ఉంటుంది. ఎరుపు, నలుపు వస్త్రాలను అలంకరిస్తారు. రథ రక్షకురాలు జయదుర్గాదేవత. సారథి అర్జునుడు. ధ్వజం నాదాంబిక. ఇక అశ్వాల పేర్లు రోచిక, మోచిక, జిత, అపరాజిత. పగ్గాలకు అధిదేవత స్వర్ణచూడ అనే నాగదేవత. చండి, చాముండి, ఉగ్రతార, వనదుర్గ, శూలిదుర్గ, వారాహి, శ్యామాకాళి, మంగళ, విమల- అధిష్టించిన నవ దేవతలు.


రామకృష్ణులు.. రథోత్సవం

రామకృష్ణ పరమహంస ప్రతి సంవత్సరం కోల్‌కతాలో బలరామ్‌ బోస్‌ అనే శిష్యుడి ఇంట్లో జగన్నాథ రథ యాత్ర నిర్వహించేవారు. పూరీలో వలెనే జగన్నాథ, సుభద్ర, బలభద్రుల ప్రతిమలను శోభాయమానంగా అలంకరించి రామకృష్ణులు స్వయంగా రథం లాగేవారు. ‘గంగాజలం, బృందావనంలోని మట్టి, జగన్నాథుడి ప్రసాదం- ఈ మూడూ పరమాత్మ స్వరూపాలు’ అంటూ చెప్పేవారు. పరమహంస ప్రతి నిత్యం అక్కడి ప్రసాదాన్ని స్వీకరించేవారు.
పూరీ జగన్నాథస్వామిని స్తుతించి తరించిన భక్తాగ్రేసరులు, వాగ్గేయకారులు ఎందరో! చైతన్య మహాప్రభు జగన్నాథ అష్టకంలో ‘జగన్నాథస్వామీ నయన పథగామీ’ అని ప్రస్తుతించాడు. పదకవితా పితామహుడు అన్నమాచార్య ‘త్వమేవ శరణం, త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథ’ అని సంకీర్తించాడు.

 బి.సైదులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని