అమ్మకి బోనం

తెలంగాణలో అతి పెద్ద పండుగలు బతుకమ్మ, బోనాలు. రెండూ కూడా ఒకటి రెండు దినాల పర్వాలు కావు. రోజుల తరబడి కోలాహలం చేస్తూ ఆకాశమంత ఆనందాన్ని, భూదేవంత ఉత్సాహాన్నీ కురిపిస్తూ సందడి చేసే వైభవాలు. వీధివీధిలో పూల జల్లులతో పరిమళాలు వెదజల్లే సంబరాలు.

Updated : 22 Jun 2023 01:02 IST

నేడు గోల్కొండ జగదంబిక బోనాలు ప్రారంభం

తెలంగాణలో అతి పెద్ద పండుగలు బతుకమ్మ, బోనాలు. రెండూ కూడా ఒకటి రెండు దినాల పర్వాలు కావు. రోజుల తరబడి కోలాహలం చేస్తూ ఆకాశమంత ఆనందాన్ని, భూదేవంత ఉత్సాహాన్నీ కురిపిస్తూ సందడి చేసే వైభవాలు. వీధివీధిలో పూల జల్లులతో పరిమళాలు వెదజల్లే సంబరాలు.

మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు పండుగ కేంద్ర బిందువు. ఈ పండుగలతో పాటు ఉత్సవాలు, జాతరలు, దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను మరిపించి కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. తెలంగాణ ప్రాంతంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించే బోనాలు కూడా అలాంటి తేజస్సును తెచ్చిపెట్టేవే. ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఆ సమయంలో దేవిని దర్శించుకుని తమ సొంత కూతురిగానే భావిస్తూ భక్తిశ్రద్ధలతో బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా ఆహారం అర్పించడాన్ని ‘ఊరడి’ అంటారు. ఈ ఊరడే తర్వాతి కాలంలో బోనంగా మారింది.

బోనం అంటే భోజనం అని మనందరికీ తెలిసిందే. కొత్త కుండలో అన్నం వండి మహిళలంతా ప్రదర్శనగా వెళ్లి గ్రామ దేవతకు నైవేద్యం సమర్పిస్తారు. మట్టి లేదా రాగి పాత్రల్లో అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం మొదలైన పదార్థాలతో బోనం సిద్ధమౌతుంది. పాత్రపై వేపరెమ్మలు, పసుపు కుంకుమలు అలంకరించి, దీపం వెలిగించి, తలపై పెట్టుకుని ఊరేగింపుగా బయల్దేరతారు. లయబద్ధంగా డప్పులు మోగుతుండగా ఆ బోనంతో గుడికి చేరతారు. అంతకుముందే మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ పోలేరమ్మ, మారెమ్మ, తదితర అమ్మవారి ఆలయాలను కళకళలాడేలా అలంకరిస్తారు.

ఇదీ రంగం

పండుగ రెండో రోజు ఉదయం రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. గంభీరంగా, బలశాలిగా ఉన్న వ్యక్తి అమ్మవారి సోదరుడు పోతరాజు పాత్రను పోషిస్తాడు. అతడు ఒంటికి పసుపు కుంకుమలు పూసుకుని, నడుముకు వేపరెమ్మలు చుట్టుకుని, కాలికి గజ్జలు కట్టి డప్పుల శబ్దానికి అనుగుణంగా నృత్యం చేస్తాడు. పోతరాజుకు పూనకం వచ్చి ఆగ్రహోదగ్రుడౌతాడు. ఇదంతా జాతర ఊరేగింపు తర్వాత జరుగుతుంది. పోతరాజును పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావిస్తారు. అతడు తనను తాను కొరడాతో బాదుకుంటూ సమూహం ముందు నడుస్తూ పూనకం వచ్చిన భక్తురాళ్లను ఆలయానికి తీసుకెళ్తాడు. అమ్మవారి ప్రతిగా అలంకరించిన రాగి కలశాన్ని ఘటం అంటారు. డప్పుల మేళాల మధ్య ఈ ఘటాన్ని ఊరేగిస్తారు. నిమజ్జనం రోజున ఈ ఘటాలన్నిటినీ నీళ్లలో కలిపేస్తారు.

ప్రేమానురాగాల వెల్లువ

ఆషాఢ మాసం వర్షాలు పడే కాలం. అందువల్ల జలుబూ జ్వరం లాంటి అనారోగ్యాలూ, కొన్ని అంటువ్యాధులూ విజృంభించేందుకు అవకాశముంది. వీటిని ఎదుర్కొనేందుకు క్రిములను నశింపచేసే పసుపు, వేపాకు వంటి ప్రకృతి వనరులను ఉపయోగిస్తూ పండుగ చేసుకోవడం ఆనవాయితీ. పసుపును ముఖం, కాళ్లూచేతుల మీద రాసుకోవడం వల్ల సూక్ష్మక్రిముల నుంచి రక్షణ లభిస్తుంది. అమ్మవారి పండుగలో ముఖ్య ఘట్టం ఊరేగింపు. డప్పుల చప్పుడు, పోతరాజుల విన్యాసాలు, గుగ్గిలపు పొగలు ఇందులో ఉంటాయి. పూర్వం డప్పుల ధ్వనులూ, పోతరాజు అరుపులకు చుట్టుపక్కల సంచరించే క్రూర జంతువులు దూరంగా పారిపోయేవట. గుగ్గిలపు పొగ వల్ల దోమలు మొదలైనవి చనిపోతాయి. బోనాల పండుగలో పూజ ముగిసి, అమ్మవారికి నివేదన సమర్పించిన తర్వాత విందు భోజనం చేస్తారు. కుటుంబసభ్యులూ, ఇతర బంధుమిత్రులతో కలిసి తినడం అనే ఆచారం వల్ల ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనురాగం పెంపొందడం సహజం.

సందడే సందడి

జూన్‌ 22న మొదలయ్యే బోనాలు జులై 17న ముగుస్తాయి. జానపద గీతాలు సందడి చేస్తుండగా.. అమ్మవారి ఈ బోనాల ఉత్సవాలు గోల్కొండ జగదంబిక ఆలయం, సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయం, లాల్‌ దర్వాజా సింహవాహిని, ఉప్పుగూడ, మీరాలం మండి, బల్కంపేట్‌ యల్లమ్మ ఆలయం, సుల్తాన్‌ షాహిలోని జగదంబిక ఆలయం, శాలిబండ గౌలిపురా బంగారు మైసమ్మ, చందూలాల్‌ బేలా ముత్యాలమ్మ గుడి.. ఇలా తెలంగాణ వ్యాప్తంగా వీధి వీధిలో ఘనంగా నిర్వహిస్తారు.
బోనాల ఊరేగింపులో స్త్రీలు సంప్రదాయ రీతిలో పట్టు చీరలు, నగలు ధరిస్తారు. పూనకం వచ్చిన స్త్రీలు తలపై బోనం కుండ మోస్తూ, దేవుని స్మరిస్తూ లయ బద్ధంగా నృత్యం చేస్తారు. మహంకాళి అమ్మవారి అంశ రౌద్రాన్ని ప్రతిబింబి స్తుంది. కాబట్టి ఆమెను శాంతపరచడానికి మహిళలు ఆలయం వద్దకు చేరగానే వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు పోస్తారు. పండుగ మొదటి చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు ఇంటింటిలో, వీధివీధిలో సందడి చేస్తుంది, ఆధ్యాత్మిక చింతనను పెంచిపోషిస్తుంది.
ఉషా కామేశ్‌ డొక్కా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని