బాల మేధావి స్కందుడు

ఆషాఢ శుక్లపంచమి స్కందపంచమి. ఇది విశేష పర్వదినం. కుమారస్వామికి స్కందుడనే పేరొచ్చింది ఈరోజే. స్కందుడంటే సంసారమనే శాఖలు లేనివాడు. సనత్కుమారుడు తమ పుత్రుడిగా పుట్టాలని ఆశించారు పార్వతీపరమేశ్వరులు. వారి కోరిక ఫలించి అతడు కుమారస్వామిగా అవతరించిన రోజిది.

Updated : 22 Jun 2023 00:52 IST

ఆషాఢ శుక్లపంచమి స్కందపంచమి. ఇది విశేష పర్వదినం. కుమారస్వామికి స్కందుడనే పేరొచ్చింది ఈరోజే. స్కందుడంటే సంసారమనే శాఖలు లేనివాడు. సనత్కుమారుడు తమ పుత్రుడిగా పుట్టాలని ఆశించారు పార్వతీపరమేశ్వరులు. వారి కోరిక ఫలించి అతడు కుమారస్వామిగా అవతరించిన రోజిది. ఓంకార శబ్దాన్ని సరిగా స్మరించని బ్మ్రహ్మదేవుడి తలమీద కుమార స్వామి మొట్టిన రోజు ఇదే. ఓంకారానికి నిర్వచనం చెప్పలేకపోయిన శివుడికి ఐదేళ్ల కుమారస్వామి జ్ఞానబోధ చేసిన రోజు కూడా ఇదే. జ్ఞానం ఎవరి వద్ద ఉన్నా వయసుతో పనిలేకుండా పొందాలని సూచించే దినమిది. శూరపద్ముడనే రాక్షసరాజు చక్రవాకపక్షి రూపంలో విసిగించగా కుమారస్వామి అగ్ని, వాయు, వరుణ దేవుళ్లను ఆ పక్షిలో ప్రవేశించమన్నాడు. ఆపైన తన శక్తి ఆయుధంతో ఆ పక్షిని రెండుగా చీల్చాడు. ఒకభాగం నుంచి కోడి, రెండో దాన్నుంచి నెమలి ఉద్భవించాయి. కోడి సుబ్రహ్మణ్యుడి రథంమీది జెండాలో ప్రవేశించగా నెమలి వాహనంగా మారింది.
మహావిష్ణువు ఆరుముఖాలతో పుట్టిన కార్తికేయుని పెంచడానికి కృత్తికలను ఏర్పాటుచేశాడు. కృత్తికల పాలు తాగి పెరిగాడు కనుక కార్తికేయుడనే పేరొచ్చింది. ‘ఓం శరవణ భవ’ మంత్రానికి జీవం పోశాడు మురుగన్‌. ఈ సుబ్రహ్మణ్య మంత్రానికి లోతైన అర్థముంది. ఈ మంత్రంలోని బీజాక్షరాలను ‘ఏకములు’ అంటారు. ఓం- అంటే పరబ్రహ్మను ఆహ్వానించడం. శ- అంటే సుఖం, శ్రేయస్సు, శుభాలను ఇవ్వమనడం. ర- అంటే శక్తిని, ధృడమైన ఆశయ సంకల్పాలను, తేజస్సును ఇవ్వమనడం. వ- అంటే జల కొరత లేకుండా చూడాలని, ణ- అంటే జ్ఞానాన్ని, నిర్ణయం తీసుకునే శక్తిని కోరడం. భ- అంటే దైవ కటాక్షం ఎల్లవేళలా ఉండేటట్లు చూడమనడం. వ- అంటే సర్వకాలసర్వావస్థల్లో మానసిక ప్రశాంతత, నిగ్రహాలను ప్రసాదించమనడం. స్కందపంచమి నాడు ఈ మంత్రాన్ని పఠిస్తే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే జన్మనిచ్చిన తల్లి, అక్క, గురుపత్ని, మేనత్త, అత్తగారు (భార్య తల్లి), వదిన- ఈ ఆరుగురు తల్లులను ఏకకాలంలో పూజించిన ఫలం కలుగుతుంది.
సిహెచ్‌.పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని