వైకుంఠపతిం నమామి

పంచమి, సప్తమి, దశమి తిథుల్లానే ఏకాదశి చాలా పవిత్రమైంది. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అంటూ నెలకు రెండుసార్లు చొప్పున సంవత్సరకాలంలో ఏకాదశి తిథి 24సార్లు వస్తుంది.

Updated : 29 Jun 2023 02:58 IST

నేడు తొలి ఏకాదశి

పంచమి, సప్తమి, దశమి తిథుల్లానే ఏకాదశి చాలా పవిత్రమైంది. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అంటూ నెలకు రెండుసార్లు చొప్పున సంవత్సరకాలంలో ఏకాదశి తిథి 24సార్లు వస్తుంది. అధికమాసం వస్తే మరో రెండుసార్లు కలిపి 26సార్లు వస్తుంది. వీటిలో తొలి ఏకాదశి మహా విశిష్టమైంది.

పూర్వం ఆషాఢంతో సంవత్సరం మొదలయ్యేది. తిథుల్లో తాను ఏకాదశినన్నాడు గీతలో శ్రీకృష్ణపరమాత్ముడు. అందువల్ల ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణించారు. దీన్ని శయన ఏకాదశి, హరివాసరం అని కూడా పిలుస్తారు. ఆ రోజు చేసే వ్రత ప్రభావం అమోఘం. గాయత్రిని మించిన మంత్రం, తల్లిని మించిన దైవం, కాశీని మించిన పుణ్యక్షేత్రం, గంగను మించిన నదీరాజం, ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రతం లేదన్నది పురాణవాక్కు.

యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి దివ్యదేహం నుంచి ఉత్పన్నమైన, తేజోమయమైన శక్తే ఏకాదశి. యోగమాయకు ప్రతిరూపం ఆ శక్తి. అదే సాత్త్విక శక్తి. క్రూరుడైన మురాసురుని సంహరించడం కోసమే ఏకాదశి విష్ణుశక్తిగా ఆవిర్భవించింది. దశేంద్రియాలకు అతీతుడైన పరమాత్మే ఏకాదశి. శయన ఏకాదశి నాడు భాగవత పఠనం, హరిస్మరణ, జాగరణ, ఆలయ సందర్శనం వంటి పుణ్యకార్యాలు చేయటం పాపపరిహారమౌతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీహరి నిద్రకుప్రకమించి, భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు పక్కకు ఒత్తిగిలి పడుకుని, కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ నాలుగు నెలలూ సర్వులూ విష్ణుమూర్తిని దీక్షతో ఆరాధిస్తారు. ఇదే చాతుర్మాస్య వ్రతం. విష్ణువు యోగనిద్రలో ఉండటానికి ఓ కారణముంది. లక్ష్మీదేవినీ, శంఖ చక్రాలనూ ధరించినట్లే తననూ ధరించమని యోగమాయ (యోగనిద్ర) విష్ణువును కోరగా.. తన కళ్లలో దాచుకుంటానని వరమిచ్చాడు. అలా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు యోగనిద్రను తన కళ్లలో దాచి ఆమెని తృప్తిపరిచాడు.

ఆషాఢమాసానికి అధిదేవత వామనమూర్తి. ఏకాదశ రుద్రాభిషేకాలు, వ్రతాలు, పూజలకు ప్రాముఖ్యం వహించిన తిథి ఏకాదశి. ఇంతటి మహత్తర ఏకాదశీ వ్రతదీక్ష చేపట్టి, ఏకాగ్ర చిత్తంతో కన్నకొడుకునే నరికేందుకు సిద్ధపడిన రుక్మాంగద మహారాజు భక్తికి బ్రహ్మదేవుడే ప్రత్యక్షమై వరాలు కుమ్మరించాడు. ఇక అంబరీషుడి విష్ణుభక్తి, ఏకాదశీ వ్రతదీక్ష వెలకట్టలేనివి. శివావతారమైన దుర్వాసమహర్షి విష్ణుమూర్తి పంపిన సుదర్శన చక్రాగ్ని బాధకు తట్టుకోలేక అంబరీషుని కాళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. వెంటనే అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థించి దుర్వాసుని రక్షించమని వేడుకున్నాడు. భక్తుల్లో అగ్రగణ్యుడైన ఆయన మొర విన్న సుదర్శనుడు దుర్వాసుని విడిచి విష్ణువు చెంతకు వెళ్లాడు. అంబరీషునికి మోక్షం ప్రసాదించాడు.

కర్షకులు, కార్మికుల రోజు

ఏకాదశి దీక్ష అంటే మనిషి బ్రహ్మరంధ్రం నుంచి తన ప్రాణాలను పరమాత్మలో లీనంచేయటం. ఈ దీక్ష నిష్కామవ్రతం, నిరాహారవ్రతం, మోక్షవ్రతంగా ప్రసిద్ధం. ఏకాదశి ఉపవాసదీక్ష, ఆహార నియమం మనసు సుస్థిరతకు, దైవధ్యానానికి, సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఈ రోజున క్రిమి కీటకాలను హింసించక భూతదయ చూపాలి. అన్న, జల, గోదానాలు చేయడం శ్రేష్ఠం. తొలి ఏకాదశి రైతుల పండుగగానూ ప్రసిద్ధం. కర్షకులు, కార్మికులు ఈ రోజున కొత్త పనులు ఆరంభించి అతివృష్టి, అనావృష్టి సమస్యలను నివారించమని ప్రార్థిస్తారు.

ఏకాదశి విశేషాలు

ప్రతి ఏకాదశికీ- నిర్జల ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రదా ఏకాదశి అంటూ ప్రత్యేక నామం, విశిష్ట ఫలసిద్ధి ఉన్నాయి. ఆషాఢంలో శయన ఏకాదశి, కార్తికంలో చిలుకు ఏకాదశి, పుష్యంలో వైకుంఠ ఏకాదశి ప్రధానమైనవి. బ్రహ్మ, రుద్రులతో సహా దేవతలంతా వేచి ఉండగా వైకుంఠంలో ఉత్తరద్వారం తెరుచుకుంటుంది కనుక అది వైకుంఠ ఏకాదశి. ఆ పుణ్యదినాన మూడు కోట్ల దేవతలూ శ్రీమహావిష్ణువును దర్శించి, తరిస్తారు. అందుకే ముక్కోటి ఏకాదశి అన్నారు. తొలి ఏకాదశిన ఏకాదశీ వ్రతం ఆచరించడం పుణ్యప్రదం. ఏకభుక్తం, భూశయనం, బ్రహ్మచర్యపాలన, అహింసావ్రతం, నిష్ఠ, దయ, క్షమ, తపస్సు, జపం, దేవపూజ, దానధార్మాలు, ఎల్లలు దాటక పోవడం- అనేవి నియమాలు. ఈ వ్రతంతో కార్యసిద్ధి, వైకుంఠప్రాప్తి తథ్యం. స్వామి పుష్కరిణీ స్నానం ఎంత పుణ్యమో, ఉత్తముడైన గురువు పాదసేవ ఎంత విలువైందో, ఏకాదశీ వ్రతాచరణ అంత విశిష్టమైంది.        

డా.పులిగడ్డ విజయలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని