దేహానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు

ఎందరో నిస్స్వార్థ సమరయోధులు ప్రాణాలకు తెగించి చేసిన పోరాట ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు. ఆ అమరవీరులను స్మరించుకుని వందనాలు సమర్పిద్దాం. మన స్వేచ్ఛకు ఎవరి నుంచీ ముప్పు వాటిల్లకుండా, ఏ రూపంలో సంకెళ్లు పడకుండా స్వేచ్ఛా విహంగాల్లా సంతోషంగా జీవిద్దాం..

Updated : 10 Aug 2023 07:05 IST

(ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం)

ఎందరో నిస్స్వార్థ సమరయోధులు ప్రాణాలకు తెగించి చేసిన పోరాట ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు. ఆ అమరవీరులను స్మరించుకుని వందనాలు సమర్పిద్దాం. మన స్వేచ్ఛకు ఎవరి నుంచీ ముప్పు వాటిల్లకుండా, ఏ రూపంలో సంకెళ్లు పడకుండా స్వేచ్ఛా విహంగాల్లా సంతోషంగా జీవిద్దాం..

స్వాతంత్య్రమె నా జన్మహక్కని ఊరికే అనలేదు. జన్మించాక మనిషికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎంత అవసరమో ఈ దేశం నాదని సగర్వంగా తిరిగేటప్పుడు స్వేచ్ఛా స్వాతంత్య్రాలూ అంతే అవసరం. భావప్రకటన స్వేచ్ఛ లేకపోతే ఆ దేహికి ఆ దేశంలో పారతంత్య్రమే తప్ప స్వాతంత్య్రం లేనట్టే లెక్క. ‘ఇది తప్పు, ఇది ఒప్పు’ అని నిజాయితీగా, నిర్మొహమాటంగా చెప్పటానికి కూడా ఉచ్ఛ్వాసనిశ్వాసల లాంటి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అత్యవసర విషయాలే. ఇలాంటి అంశాలన్నీ సన్మార్గ దర్శకాలైన పురాణేతిహాసాల్లోనూ కనిపిస్తాయి.

విచ్చలవిడితనం స్వేచ్ఛ కాదు

స్వాతంత్య్రం అన్నారు కదాని విచ్చలవిడితనంతో ప్రవర్తించటం ఎన్నడూ సమర్థనీయం కాదు. ‘అంతా నా ఇష్టం’ అనుకునే బరితెగింపు అసలు స్వాతంత్య్రమే అనిపించుకోదు. ఈ విషయం చిన్నతనంలోనే అర్థమయ్యేలా చెప్పి పాటించేలా చూడాల్సిన బాధ్యత పెద్దలది. లేదంటే అది విశృంఖలత్వం దిశగా దారి మళ్లుతుంది. ఇక్కడే ఓ విషయం బాగా అర్థం కావాలి. నీతీ నియమం అనేవి మనసును అదుపు చేసి, మనని సక్రమంగా నిలబెట్టే నియంత్రణ సూత్రాలే కానీ బానిస సంకెళ్లు ఎంత మాత్రం కావు. ఈ సున్నిత విషయాన్ని మన సంస్కృతీ సంప్రదాయాలకు పట్టుగొమ్మలు అయిన రామాయణం, మహా భారతం, భాగవతం తదితర మహా గ్రంథాల్లో గమనించవచ్చు.

అష్టవసువులు.. ఓ ఉదాహరణ

సద్బుద్ధి, సదాచారాలకు చైతన్య దీపికలు అనదగ్గ ఇతిహాస కథల్లో అష్టవసువుల కథ ఒకటి. ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు- ఇవీ వారి పేర్లు. కురువృద్ధు డైన భీష్మాచార్యుడు గత జన్మలో అష్టవసువుల్లో ఆఖరివాడైన ప్రభాసుడు. ఒకసారి వాళ్లు లోకవిహారం చేస్తూ వశిష్ఠుడి ఆశ్రమాన్ని దర్శించుకోవాలని వచ్చారు. ఆ సమయంలో మహర్షి ఆశ్రమంలో లేడు. అక్కడ ఆయన పెంచుకునే నందినీ ధేనువు ఉంది. ప్రభాసుడి భార్యకు ఆవు బాగా నచ్చింది. ఆమె ప్రేరేపించటంతో సోదరులంతా కలిసి నందినిని బలవంతంగా లాక్కెళ్లారు. వశిష్ఠుడు తిరిగొచ్చాక వాళ్లు చేసిన పని తెలుసుకుని ఆ ఎనిమిది మందీ దైవత్వాన్ని కోల్పోయి మానవ జన్మ ఎత్తుతారని శపించాడు. అప్పుడు వారంతా తమ తప్పు తెలుసుకున్నారు. తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను దుర్వినియోగం చేసుకున్నట్టు గ్రహించి, అపరాధాన్ని క్షమించమని ఆ మునిని ప్రాధేయపడ్డారు. శాంతించిన మహర్షి వారంతా మనుషులుగా పుట్టగానే శాపవిమోచనమౌతుందని, ఎనిమిదోవాడు మాత్రం చాలా కాలం కఠినతరమైన మానవ జీవితం గడపవలసి ఉంటుందంటూ శాపవిమోచన మార్గం చెప్పాడు. ఆ ఎనిమిదో వాడే భీష్ముడు. జన్మాంతం బ్రహ్మచారిగా అతడెన్ని కష్టాలు పడిందీ అందరికీ తెలిసిందే. అష్టవసువులు వశిష్ఠుడి కామధేనువును దొంగిలించారు. అప్పటికది వారికి తమ ఇచ్ఛ, స్వాతంత్య్రం అనిపించింది. వాళ్లంతా ప్రభాసుణ్ణి సమర్థించి అనైతిక కార్యం నెరవేర్చారు.. ఒకరి సొమ్మును వారి అనుమతి లేకుండా ముట్టుకోవటం కూడా దోషమే. అలాంటిది వాళ్లు.. తమ ఇష్టప్రకారం దేన్నయినా తీసుకోవచ్చనే అహంకారం చూపారు. ఆ దోష ప్రభావంతోనే వసువులు దైవత్వాన్ని కోల్పోయి జన్మాంతర పాపాన్ని అనుభవించాల్సి వచ్చింది.

అనుకున్నది చెప్పగలగాలి..

కొన్ని సందర్భాల్లో అవతలి వ్యక్తుల అధికారానికో, బలానికో భయపడి కళ్లెదుట జరుగుతున్న అవినీతిని చూస్తూ ఉండిపోవలసి వస్తుంది. అలాంటి పరిస్థితులు బానిసత్వాన్ని సూచిస్తాయి. నీతి తప్పడమే కాదు, అవినీతిని ప్రోత్సహించడమూ నేరమే. అలాంటి బానిస బతుకులు కూడదంటూ హెచ్చరించే అంశాలనేకం రామాయణంలో ఉన్నాయి. రావణాసురుడికి అతడి అనుచరులు కొందరు సీతాపహరణం మంచిది కాదని చూచాయగా చెప్పి చూశారు. కానీ అతడు రాజు కనుక పూర్తిగా విభేదిస్తున్నామని గట్టిగా చెప్పేందుకు సందేహించారు. ప్రాణభయంతో వెనకాడారు. ఫలితంగా రావణుడే కాదు, వారు కూడా ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది. కానీ విభీషణుడు అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. యుద్ధానంతరం కూడా హాయిగా బతకగలిగాడు. ఇక్కడ స్వాతంత్య్రం అనేదాన్ని విభీషణుడు పోరాడి సాధించుకున్నాడు. బానిసత్వాన్ని బద్దలుకొట్ట గలగడంలోనే స్వాతంత్య్రం ప్రకటితమవుతుంది. అదే నైతికతను పెంచి, ఉన్నత స్థానంలో నిలుపుతుందని ఇలాంటి అంశాలు నిరూపిస్తాయి.


ఇలా ఉండాలి..

రామాయణంలో విభీషణుడిలాగానే మహాభారతంలో విదురుడు కనిపిస్తాడు. దుర్యోధన, ధృతరాష్ట్రాదులను విభేదించి ధర్మం పక్షానే నిలిచాడు. తను చెప్పదలచుకున్నది గొప్ప నీతిమార్గమని దృఢంగా నమ్మాడు కనుక ధైర్యంగా ఉన్నాడు. స్వాతంత్య్రం ఇలాంటి ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే దేహికైనా దేశానికైనా ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవటానికి.. వృద్ధి సాధించి, ఉన్నత స్థితిలో నిలవడానికి స్వాతంత్య్రం అంత అవసరం అన్నారు పెద్దలు.

ధర్మం విషయంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లేకపోతే దుర్మార్గం పెరుగుతుంది. దౌర్జన్యాలు పెచ్చుమీరుతాయి. స్వేచ్ఛా స్వాతంత్య్రాల పరిధి, పరిమితులను గ్రహించక అంతా నాదే.. అన్నీ నా ఇష్టమే.. అనుకుంటే అనర్థం తప్పదు. ఒక్కరిదే పెడబుద్ధి అయినా.. వారిని నిరోధించక సమర్థించినా శిక్ష తప్పదు. కనుక స్వేచ్ఛా స్వాతంత్య్రాల పరిధులను గమనించుకుంటూ ఉన్నతంగా ఎదగాలి. నీతి నియమాలను పాటిస్తూ ఉత్తమంగా నిలవాలి. అదే ఆర్షవాఙ్మయ ప్రబోధ.

డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు, గుంటూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు