జగతికి హితం భుజంగం

రాముడు, కృష్ణుడు, లక్ష్మి, పార్వతి అంటూ దేవతల్నే కాదు, పశువుల్నీ పాముల్నీ కూడా పూజించడం మన ఆచారం. అందులో ఆధ్యాత్మిక చింతనే కాదు, పర్యావరణ పరిరక్షణ దాగి ఉంది. నాగ చతుర్థి, నాగ పంచమి రోజుల్లో నాగులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. పేర్లు కూడా ‘నాగ’, ‘ఫణి’ అని పెట్టుకుంటాం..

Updated : 17 Aug 2023 00:12 IST

ఆగస్టు 20, 21 నాగ చతుర్థి, నాగ పంచమి

రాముడు, కృష్ణుడు, లక్ష్మి, పార్వతి అంటూ దేవతల్నే కాదు, పశువుల్నీ పాముల్నీ కూడా పూజించడం మన ఆచారం. అందులో ఆధ్యాత్మిక చింతనే కాదు, పర్యావరణ పరిరక్షణ దాగి ఉంది. నాగ చతుర్థి, నాగ పంచమి రోజుల్లో నాగులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. పేర్లు కూడా ‘నాగ’, ‘ఫణి’ అని పెట్టుకుంటాం..

అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా

పుట్టలో పాలు పోస్తూ.. ‘నాగయ్యా! నీకు పొట్ట నిండా పాలు పోసేమయా..’ అంటూ పాడుకోవడం మనకు తెలిసిందే. వేయి పడగల పాముగా అఖండ భూభారాన్ని అవలీలగా మోస్తున్న జగన్నాథుడికి శయ్యగా అమరింది అనంతుడనే సర్పం. అమృతపాన కాంక్షితులైన దేవాసురుల కోరిక మేరకు మహామేరు నగాన్ని తాడులా చుట్టుకుంది వాసుకి అనే భుజంగం. అలా అడుగడుగునా సృష్టి క్రమానికి తన వంతు సాయమందించింది సర్పజాతి.

పురాణ కథలను అనుసరించి క్షీరసాగర మథనంలో మూడు జగాలనూ అల్లల్లాడించిన హాలాహలాన్ని తాను స్వీకరించి అభయం ప్రసాదించాడు శంకరుడు. ఆ పరమశివుని అనుచర గణాలుగా సర్పాలు సైతం తమకు చేతనైనంతగా విషభక్షణ చేశాయి. కనుకనే అవి విషపూరితం అయ్యాయంటారు ఆధ్యాత్మికవేత్తలు.

శంకరుని సేదతీర్చిన సర్పాలు

లోకకల్యాణం కోసం గొంతులోనే విషాన్ని నిలిపాడు శివుడు. గాఢమైన ఆ గరళతాపాన్ని ఓర్వజాలని శంకరుని మెడను చుట్టుకుని తమ చల్లని శరీర స్పర్శతో సేదతీర్చే ప్రయత్నం చేసిందట సర్పజాతి. తన పట్ల వాటి ప్రేమకు ముగ్ధుడైన భోలాశంకరుడు ఆనాటి నుంచి నాగాభరణా లను ధరించాడని ప్రతీతి. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు. వినుత అమేయ బలశాలులైన గరుడపక్షులకు జన్మనివ్వగా.. దీర్ఘకాయులైన పాములను కాంక్షించింది కద్రువ. అలా కద్రువ కడుపున అంకురించిన నాగజాతి భూలోకంలోని సమస్త జీవజాలాన్ని కాటు వేసి చంపసాగాయి. ఈ విపరీతానికి ఆగ్రహించిన బ్రహ్మదేవుడు వాటిని శపించబోతే- ‘ప్రభూ! మమ్మల్ని సృజించింది తమరే కదా! మా జాతి సహజ లక్షణం తెలిసిన మీరే శపించడం సమంజసమా? కాపాడండి స్వామీ’ అని వేడుకున్నాయి. అప్పటి నుంచి బ్రహ్మ ఆజ్ఞ మేరకు భూమి కింది లోకాలైన పాతాళాది లోకాల్లో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది భుజంగజాతి.

తక్షకుడు సర్పరాజు అయ్యాడు. అతడి జన్మదినమే నాగపంచమి అనేది ఒక కథనం. తీవ్రధ్యానమగ్నుడై తన దాహార్తిని పట్టించుకోని శమీక మహర్షిపై పాము కళేబరాన్ని ఉంచి అవమానించాడు పరీక్షిత్తు. అచలిత యోగ సాధనలో ఉన్న తన తండ్రికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేని శృంగి ‘నువ్వు ఏడు రోజుల్లో పాముకాటుతో మరణిస్తావు’ అని పరీక్షిత్తును శపించాడు. దుఃఖితుడైన పరీక్షిత్తు తన నేరానికి ప్రాయశ్చిత్తం తెలియజేయమని శుకమహర్షిని వేడుకున్నాడు. తదుపరి కాలంలో పరీక్షిత్తును కాటేసినందుకు ఉదంకుని ఆధ్వర్యంలో జనమేజయుడు నిర్వహించిన సర్పయాగంలో ఇంద్రుడి సింహాసనంతో పాటు తక్షకుణ్ణి కూడా ఆవాహన చేశారు. నాగలోకానికి రాణి అయిన మానసాదేవి, ఆస్తీక మహామునుల ప్రార్థన మేరకు తక్షకుడు, ఇతర సర్పాలు రక్షణ పొందాయి. అలా సర్పసత్రం (ఒక యాగం) ఆపిన రోజును నాగ పంచమిగా చేసుకోవటం మొదలైందన్నది మరో గాథ. ఆ కృతజ్ఞతతోనే ‘ఆస్తీకాయ నమః’ అని జపిస్తే పాములు హాని చేయవంటారు. బాలభీముడికి సర్పరాజు అపార శక్తినొసగే కథ, ఉలూచి అనే నాగకన్యతో అర్జున వివాహం వంటివి నాగజాతితో నరజాతికి గల సంబంధానికి సాక్ష్యాలు.

ఆలయాల్లో నాగప్రతిమలెందుకు..

‘మహాశక్తిః కుండలినీ’ అంటూ ఆ జగదంబను స్తుతిస్తాం. కుండలిని అనే సంస్కృత పదానికి భుజంగం, శక్తి అని అర్థాలు. యోగశాస్త్రం ప్రకారం శరీరంలోని కుండలినీ శక్తి, అంతర్లీనంగా మనలో నిద్రాణమై ఉన్న అద్భుత శక్తి. ఉపనిషత్తుల్లో ఈ శక్తి చుట్టలు చుట్టుకుని ఉన్న పాముగా విశ్లేషించడం చూస్తాం. సర్పం చుట్టచుట్టుకుని నిద్రిస్తున్న స్థితిలో ఎంతో నిశ్చలంగా ఉండగలదు. అంతే స్థిరËత్వంతో కుండలినీ శక్తి మనిషి వెన్నెముక మూలం వద్ద, మూలాధార చక్రం వద్ద ఉంటుంది. ఆ కుండలినీ శక్తిని సహస్రారం వద్ద తెరచుకునేలా చేయటమే జప, తప, హఠ, యోగ సాధకులకు అంతిమ లక్ష్యం. ఒక దివ్యమైన ఆనందాన్ని, అనుభూతిని కలిగించే అనుభవమది. ప్రతీ ఆలయంలో నాగ ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేయటం మనకు తెలిసిందే. మనలో జడమై ఉన్న కుండలినీ శక్తిని వికసింప చేసుకోవడానికి ఇది సంకేతం.

ఒక్క మాట.. పాములు పాలు తాగవనీ, బలవంతంగా పాలు తాగించేందుకు ప్రయత్నిస్తే వాటి ఊపిరితిత్తులకు హాని కలుగుతుందని కొందరి భావన. మన పెద్దలు పుట్టలో పాలు పోయమన్నది పాములు ఆ పాలు తాగి జీవించాలని కాదు. తార్కికంగా ఆలోచిస్తే పాలతో తడిసిన పుట్టమన్ను చీమలకు ఆహారాన్ని ఇవ్వగలదు. ఆ చీమలను తినే కీటకాలు, వాటిని తినే కప్పలు.. అలా పుట్ట వద్దకు చేరిన జీవాలు పాములకు ఆహారంగా మార్చగలిగే పరోక్ష ప్రక్రియ కావచ్చు.  

ఈ సృష్టి సజావుగా నడిచే ప్రక్రియలో ప్రతీ ప్రాణి తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తుంది. పంటపొలాల్లో చేరిన కీటకాలు, ఎలుకల్లాంటి ప్రాణులను మింగి అన్నదాతకు గిట్టుబాటు మిగిల్చి రైతుమిత్రువయ్యింది సర్పజాతి. ఆయుర్వేదం సైతం పాము నుంచి తీసిన విషాన్ని తగిన విధంగా వినియోగించి ఔషధాలను తయారుచేయవచ్చని పేర్కొంది.

ఐహిక బంధాల కుబుసం

ఒక పాము తన జీవిత చక్రంలో కుబుసం విడిచి మరో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ కుబుసం విడవటం అనే సంక్లిష్ట ప్రక్రియ మన జననమరణ చక్రాన్ని కళ్లకు కట్టినట్టు చూపించగలదని కాబోలు.. మన పెద్దలు నాగేంద్రుడు అంటూ పాముకు దైవీతత్వాన్ని స్థిరపరచారు. భూమిపై పుట్టిన మనిషి అరిషడ్వర్గాలతో కూడిన ఐహికబంధాల నడుమ కొంత కాలం గడుపుతాడు. నెమ్మదిగా ఆ కుబుసాన్ని విడిచి తనలో దాగి ఉన్న ఒక్కో శక్తిని విశ్లేషిస్తూ, జాగృతపరుస్తూ అమృతత్వం వైపు అడుగులు వేసి మనీషిగా బతకాలన్నదే నాగపూజలో దాగున్న ఆంతర్యం.

పార్నంది అపర్ణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు