ఆత్మీయచందనం రక్షాబంధనం

శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి విశేషమైంది. ఆ రోజు సోదరి చేత రక్షాబంధనం కట్టించుకుంటే సకల దేవతల రక్షణ ఉంటుందని మన సంప్రదాయంలో ప్రగాఢ విశ్వాసం.

Updated : 24 Aug 2023 05:41 IST

శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి విశేషమైంది. ఆ రోజు సోదరి చేత రక్షాబంధనం కట్టించుకుంటే సకల దేవతల రక్షణ ఉంటుందని మన సంప్రదాయంలో ప్రగాఢ విశ్వాసం. సనాతన ధర్మం ప్రకారం ఇంటి ఆడపడుచు శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపం. సాక్షాత్తూ శక్తిస్వరూపిణి. ఆమె కట్టే రక్ష అన్ని అరిష్టాలనూ తొలగిస్తుందని నమ్మకం. దీనికి సంబంధించి మన పురాణాలు ఎన్నో దృష్టాంతాలను ఉటంకించాయి. ఓసారి దేవతలు, రాక్షసులకు మధ్య సాగిన పోరులో దేవేంద్రుని శక్తి సన్నగిల్లింది. అది గమనించిన ఆయన భార్య శచీదేవి గరికపోచలను దారంలా పేని, పార్వతీపరమేశ్వరులు, లక్ష్మీనారాయణు లను ప్రార్థించి, వీక్షణాది సంస్కారంతో మంత్రించి, భర్త ముంజేతికి రక్షా బంధనం కట్టింది. ఆ బంధనం ప్రభావంతో దేవేంద్రుడు విజయకేతనం ఎగురవేశాడు. ఆ నేపథ్యంలో...

యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః

తేనత్వా మభిబధ్నామి రక్ష మా చల మా చల

మహర్షులు ప్రతిపాదించిన ఈ ఈ రక్షాకవచ మంత్రానికి ‘దానశీలుడు, బలసంపన్నుడైన రాక్షసరాజు బలిచక్రవర్తిని దేవతల కోరికపై విష్ణుమూర్తి బంధించాడు. అంతటి విష్ణుశక్తిని రక్షాబంధన రూపంలో నీకు కడుతున్నాను. నీ చేతిని అంటిపెట్టుకొని ఉండే ఈ రక్షాకవచ ప్రభావంతో దేవతలందరూ నీ పక్షాన నిలిచి, ఏ ప్రమాదమూ లేకుండా నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను’ అనేది భావం. లోకంలో పరమపవిత్రమైన సంబంధాల్లో సోదర బంధం ఒకటి. సాక్షాత్తూ శ్రీకృష్ణపరమాత్ముడు కూడా చెల్లెలు ద్రౌపది ఆపద వేళ ‘అన్నా’ అని ఆర్తితో పిలవగానే అభయహస్తమిచ్చి ఆదుకున్నాడు. కంసుడు ప్రాణభయంతో కఠినాత్ముడై తమకు ముప్పు తలపెట్టి నప్పుడు, వసుదేవుడు అతనికి సోదర సోదరి బంధాన్ని గుర్తుచేశాడు. ‘బావా! నువ్వు ఈమెకి సోదరుడివి కదా! నీ చెల్లెలికి కానుకలు ఇవ్వాలి. చీరలు పెట్టాలి. ఆడపడుచు అని గౌరవించాలి. ఆత్మీయ వచనాలతో ఆదరించాలి. కానీ.. ఇదేంటి? ఏవో గాలిమాటలు విని ఆ అమాయకురాలిని వధించాలని చూస్తున్నావు? అయ్యో.. ఎంత అన్యాయం! మాకు ప్రాణభిక్ష పెట్ట్టు’ అంటూ వేడుకున్నాడు. ఆ మాటలకు అంతటి క్రూరాత్ముడు కూడా కరిగిపోయాడు. రామకృష్ణ పరమహంస విషయం తీసుకుంటే.. ఆయన దివ్యాంశ సంభూతుడని- వారి సోదరే తొలుత గుర్తించింది. ఆ ఆరాధనాభావంతో ఆమె ఆయనను బాలుడిగా ఉన్నప్పుడే పుష్ప, చందనాలతో పూజించేది. సోదరి మీది ప్రేమతో- ఆమె కాశీలో మరణించి ముక్తిని పొందే భాగ్యాన్ని కల్పించారు పరమహంస.      

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు