కృష్ణా..ముకుందా.. మురారి..
మోము అరవిందం, మనసు మకరందం. మాధవుడు సౌందర్య నిలయుడు. సకల సద్గుణశోభితుడు. నిర్మలహృదయుడు, నిత్యానంద స్వరూపుడు. నర నారాయణత్వాల మేలిమి కలయిక కృష్ణావతారం.
సెప్టెంబరు 6, 7 కృష్ణాష్టమి
యమునానదీ యశోదాదేవి.. గోవులూ గోపికలు.. వేణువూ వెన్నముద్దలు.. అనగానే తలపుల్లో తాండవకృష్ణుడే తారంగమాడతాడు. ఆ నవనీతచోరుడు ఆబాలగోపాలాన్నీ ఆనందమయం చేశాడు. భక్తుల పాలిట భవరోగ వైద్యుడు ఆ నందకిశోరుడు. బాలుడిగా చీరలు దోచినా, భగవద్గీతాచార్యుడిగా చింతలు తీర్చినా ఆయనకే చెల్లింది.
మోము అరవిందం, మనసు మకరందం. మాధవుడు సౌందర్య నిలయుడు. సకల సద్గుణశోభితుడు. నిర్మలహృదయుడు, నిత్యానంద స్వరూపుడు. నర నారాయణత్వాల మేలిమి కలయిక కృష్ణావతారం. ముకుందుడిలో గురుత్వం మరో విశేషం. సకల దేవతామూర్తుల, శక్తుల సమ్మిళితం- ఆ నందనందనుడి దివ్యమంగళస్వరూపం. అందుకే అది పరిపూర్ణ అవతారం. తాను అఖండ చైతన్య స్వరూపుడిననే స్ఫురణతో ఉన్న వంశీధరుడు- అవసరమైన వేళల్లో మానవాతీత మహిమలతో దివ్యత్వాన్ని చాటుకున్నాడు. మధురసభరిత కళలకి కాణాచి అయిన ఆ మోహన కృష్ణుణ్ణి..
అధరం మధురం,
వదనం మధురం
నయనం మధురం,
హసితం మధురం
హృదయం మధురం, గమనం మధురం
మధురాధిపతే
రఖిలం మధురం
అంటూ మధురాతి మధురంగా స్తుతించారు వల్లభాచార్యులు. ‘కృష్ణ’ శబ్దానికి నీలమోహనుడు, పరమాత్మ, సచ్చిదానంద, పాపసంహారకుడు- అనే అర్థాలున్నాయి. ఆరాధకులే కాదు ద్వేషించే కంస, దుర్యోధనాదులు కూడా ఆ ముగ్ధమోహనరూపం చూసి సంభ్రమాశ్చర్యాల్లో మునిగేవారట. సకల జీవుల ఉద్ధరణ కోసం శ్రీకృష్ణుడు ఆవిర్భవించాడని కవయిత్రి తరిగొండ వెంగమాంబ ‘శ్రీకృష్ణలీలామృతం’లో వర్ణించారు.
కర్మయోగి కృష్ణపరమాత్మ
నిరంతరం కర్మల్లో మునిగి ఉన్నా, తామరాకుపై నీటిబొట్టులా నిస్సంగత్వంగా సాగాలని నిరూపించిన కర్మయోగి కృష్ణపరమాత్ముడు. గోపాలుడిగా అలరించి అందరికీ ఆత్మబంధువైనా.. ఎవరికీ అందనివాడు, అర్థంకానివాడుగానే మిగిలాడు. రాగద్వేషాలకు తావివ్వక, నిందల్ని కూడా నవ్వుతూనే స్వీకరించిన పూర్ణపురుషుడాయన. బాలక దశ నుంచి పరిణతదశ వరకూ కృష్ణతత్త్వం అడుగడుగునా మార్గదర్శకమై నిలుస్తుంది. ఆ యోగీశ్వరుడి గుణగానం, పదధ్యానం మనకు పరమపద సోపానం. ‘మురళీధరుడు నమ్మినవారి హృదయంలో ప్రవేశించి నీటి మాలిన్యాన్ని శరదృతువు తొలగించినట్లు మనసులోని మాలిన్యాన్ని తొలగిస్తాడు..’ అంటోంది మద్భాగవతం.
ప్రతి లీలలోనూ పారమార్థికత
పుట్టకముందే మేనమామ మనసులో ప్రకంపనలు పుట్టించి.. పుట్టీపుట్టగానే తన మాయలతో మహా మాయావులనే మట్టికరిపించాడు మోహనకృష్ణుడు. అవతార కార్యాలకు ఆలస్యమెందుకని ఆది నుంచే ఆరంభించాడు. అందుకే కృష్ణలీలలు ఆదర్శ, ఆరాధ్య భావాల సమాహారం. కాళీయమర్దనమైనా, గోవర్ధన ఉద్ధారణమైనా- ఆ లీలలు ఆధ్యాత్మికంగా, తాత్వికంగా, ధార్మికంగా, సామాజికంగా స్ఫూర్తిదాయకం. కామక్రోధలోభ మోహమదమాత్సర్యాలు- అనే ఆరు శత్రువులను రూపుమాపేందుకే అన్ని లీలలు ప్రదర్శించాడు. గోపాలుడు-గోపికలది దేహ సంబంధ ఆకర్షణ కాదు, ఆత్మలు పెనవేసుకున్న ప్రేమబంధం. కన్నయ్యను విడిచి క్షణం ఉండలేని విరహవేదన గోపికలది. భగవంతుడిపై భక్తుడికి ఉండాల్సిన ఆకర్షణ అది. కనుకనే ‘కృష్ణా! నీవు నా చేయి విదుల్చుకొని పోవటం గొప్పా కాదు, అందులో ఆశ్చర్యమూ లేదు. నా మనసు నుంచి వెళ్ల గలవేమో చూడు’ అని లీలాశుకుడు గడుసుగా అంటే.. ‘నిరంతరం నా నయనాల్లోనే నువ్వు కొలువుండు ఓ యదునందనా!’ అని వేడుకుంటుంది మీరాబాయి. అది భక్తికి పరాకాష్ఠ. ఆ భావనతోనే ‘శ్రీకృష్ణుణ్ణి ధ్యానిస్తే మళ్లీ ఈ సంసారచక్రంలో చిక్కుకో నవసరంలేదు’ అంటూ చెప్పాడు- వేణుమాధవుని ప్రియమిత్రుడు ఉద్ధవుడు.
స్వామీజీ నోట శ్రీకృష్ణలీలలు విని..
స్వామి వివేకానంద అనేక సందర్భాల్లో శ్రీకృష్ణుడి దివ్యత్వాన్ని, ఆయన పంచిన గీతామృతాన్ని ప్రస్తావించేవారు. ఒకసారి అమెరికాలో స్వామీజీ దామోదరుడి మధురలీలల్లోని ఆధ్యాత్మిక అంతరార్థాల్ని కళ్లకు కట్టినట్లు మనోహరంగా వర్ణించారు. సభలో ఉన్న సంపన్నురాలైన ఓ విదేశీ యువతికి అదే మొదటిసారి కృష్ణుడి పేరు వినటం. కానీ వాసుదేవుడి లీలలు విని.. ఆమె ఆ అవతారమూర్తికి ఆకర్షితురాలైంది. తన ఆస్తులన్నీ త్యజించి ఓ ద్వీపానికి వెళ్లి పోయింది. ఏకాంతవాసం చేస్తూ జీవన పర్యంతం కృష్ణుడి ధ్యానంలో నిమగ్నమైంది.
ఆత్మజ్ఞానులకూ ఆరాధ్యమూర్తే
భక్తులు, యోగులకే కాదు ఆత్మజ్ఞానులకు కూడా ఆ శ్యామసుందరుడు ఆరాధ్యమూర్తే! రమణాశ్రమంలో కృష్ణుడి లీలలు ఎప్పుడు చదివినా మహర్షి భక్తిభావంతో పరవశించిపోయేవారు. అలాగే రమణుల పరమభక్తుడు చలం-
నీతోనే నా ఆటలు, నా మాటలు
నీ కోసమే నా కన్నీరు, నా కోపం
నువ్వే నా గర్వం, నువ్వే నా నిరాశ
నీ కోసమే ఈ గోవులు, నీ కోసమే ఈ యశోద
నీ కోసమే ఈ ఉదయాలు, ఈ అస్తమయాలు
ఈ విశ్వమే నీ హృదయంలో, నీవేమో నా హృదయంలో..
అంటూ యశోదాదేవి అంతరంగాన్ని హృద్యంగా ఆవిష్కరించారు.
అన్నమయ్య పాటల్లో ఆలకాపరి
వేంకటేశ్వర, శ్రీకృష్ణపరమాత్ముల్లో అభేదాన్ని దర్శించాడు పదకవితా పితామహుడు అన్నమయ్య. ఆ భావనతోనే శతాధికంగా శ్రీకృష్ణవైభవాన్ని చిత్రిస్తూ కీర్తనలు రచించాడు. కృష్ణాష్టమి రోజున తిరుమల ఆనంద నిలయంలో శ్రీవారికి.. శైలధరుడి రూపంలో ప్రత్యేక పూజలు చేయటానికి శ్రీకారం చుట్టింది కూడా అన్నమయ్యే. ‘చేరి యశోదకు శిశువితడు, భావయామి గోపాలబాలం, చిన్ని శిశువు చిన్ని శిశువు, ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు, ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు..’ లాంటి ఆణిముత్యాలు అన్నమాచార్యుల శ్రీకృష్ణసంకీర్తనల స్వర్ణపేటికలోవే.
శ్రీకృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమి పరమపవిత్రమైంది. ఆ రోజున కృష్ణుని అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం అమోఘ ఫలాన్ని ఇస్తుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
బి.సైదులు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
టాప్‌గేర్‌లో టూవీలర్ విక్రయాలు.. ఏ కంపెనీ ఎన్నంటే?
-
Maharashtra: అజిత్ పవార్‌కు భాజపా సుపారీ.. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి సంచలన ఆరోపణలు
-
PM Modi: భారత్‌లో కాప్-33 సదస్సు.. దుబాయ్‌లో ప్రతిపాదించిన మోదీ
-
YS Bhaskarreddy: సీబీఐ కోర్టులో లొంగిపోయిన వైఎస్ భాస్కర్‌రెడ్డి
-
Nagarjunasagar: సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణలో సాగర్ డ్యామ్: కేంద్రం హోంశాఖ నిర్ణయం
-
Review Calling Sahasra: రివ్యూ: కాలింగ్ సహస్ర.. సుధీర్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?