మనోలయమే మహాలయం

ప్రతి నెలా కృష్ణపక్షంలో ఆఖరి రోజు అమావాస్య. ఏడాదికి ఒకసారి వచ్చే మహాలయ అమావాస్య పితృదేవతలకు ప్రీతికరమైంది. ఈ రోజు పిండ ప్రదానం చేస్తే.. పితృదేవతలకు మోక్షం కలుగుతుంది.

Updated : 12 Oct 2023 03:31 IST

అక్టోబరు 14 మహాలయ అమావాస్య

ప్రతి నెలా కృష్ణపక్షంలో ఆఖరి రోజు అమావాస్య. ఏడాదికి ఒకసారి వచ్చే మహాలయ అమావాస్య పితృదేవతలకు ప్రీతికరమైంది. ఈ రోజు పిండ ప్రదానం చేస్తే.. పితృదేవతలకు మోక్షం కలుగుతుంది. అంచేత ఈ రోజు మంచిదే. అమావాస్య అంటే సూర్యచంద్రులు ఇద్దరూ కలిసి ఒకేచోట ఉండటం.

మనకు చీకటంటే భయం. అది అజ్ఞానానికి చిహ్నం. సూర్యుడు జ్ఞానానికి, చంద్రుడు మనసుకు అధిపతులు. చీకట్లోంచి వెలుగు పుడుతుందని, చీకటి నుంచి వెలుతురులోకి వెళ్లమని ఉపనిషత్తులు తెలియ జేస్తున్నాయి. అమావాస్య శక్తిమంతమైన సమయం. మంత్రాలతో మహా శక్తులు సాధించవచ్చునంటారు. లయం అంటే ఆలింగనం. ఒకరిలో ఒకరు లీనం కావడం. ఒకేచోట విశ్రమించడం అన్నమాట. ఇది జీవాత్మ, పరమాత్మల సంయోగంగా పరిగణిస్తారు. అమావాస్య తర్వాత శుక్ల పాడ్యమి నుంచి చంద్రుడు దినదినం వృద్ధి చెందుతూ.. పౌర్ణమినాడు పదహారు కళలతో ప్రకాశిస్తాడు.

చైత్రమాసంలో శుక్ల పాడ్యమితో కొత్త ఏడాది ఆరంభమవుతుంది. ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే, ఆత్మకారకుడైన సూర్యుడి వల్ల జ్ఞానాన్ని.. మనోకారకు డైన చంద్రుడిపైన నియంత్రణను సాధించుకోగల సదవకాశం అమావాస్య అందిస్తోంది. ఈ కలయిక యోగ సాధన ద్వారా సుస్థిరమైనప్పుడు సాధకులు స్థితప్రజ్ఞత పొందుతారు. ధ్యానావస్థలో యోగి సమాధి స్థితికి చేరగానే మనసు ఆత్మ రతిలో నిరతిశయ ఆనందం పొందుతుంది. సుషుప్తిలో సామాన్యులు ఈ అనుభూతి తాత్కాలికంగా పొందితే.. ధ్యానయోగులు ఈ అనుభూతిని శాశ్వతంగా పొందుతారు. పితృ దేవతలకు తర్పణం వదలడం ద్వారా వారికి ముక్తి లభిస్తుంది. భక్తిశ్రద్ధలతో మనసును మౌనపరిచి, పితరులను పుణ్యలోకాలకు చేర్చడం పుత్రధర్మం. మనోలయమే మహాలయం.

ఉప్పు రాఘవేంద్ర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు