సఖ్యత.. ఐక్యత..

జాతులు, మతాలు, దేశాలను ఒక తాటిపైకి తెచ్చి అభివృద్ధి పథంలో నడిపే సాధనం ఐకమత్యం. కలిసుంటే ఒనగూరే లాభాలను పురాణేతిహాసాల్లో అనేక ఉదంతాలు స్పష్టం చేశాయి. ఐకమత్యం మనకే కాదు.. సమస్త ప్రాణికోటికీ వర్తిస్తుంది.

Updated : 26 Oct 2023 06:43 IST

అక్టోబరు 31 జాతీయ ఐక్యతా దినోత్సవం

జాతులు, మతాలు, దేశాలను ఒక తాటిపైకి తెచ్చి అభివృద్ధి పథంలో నడిపే సాధనం ఐకమత్యం. కలిసుంటే ఒనగూరే లాభాలను పురాణేతిహాసాల్లో అనేక ఉదంతాలు స్పష్టం చేశాయి. ఐకమత్యం మనకే కాదు.. సమస్త ప్రాణికోటికీ వర్తిస్తుంది. చలి చీమల ఐక్యత పాములకు ప్రాణహాని. గడ్డిపరకల ఐక్యత గజరాజుకు బంధనం.

మాట, చూపు, స్పర్శ, ఆలోచన, చేతల్లో శాంతి ఉంటే.. అది పూర్ణ ఐక్యత- అంటోంది వేదం. కర్ణ-దుర్యోధనులు, రామ-సుగ్రీవుల మైత్రి అలాంటిదే. ఐక్యతను ముందుగా మన లోపలే వెతుక్కోవాలి. మన ఆలోచనలూ, ఆచరణలో అస్పష్టత, అలజడి లేనప్పుడు తోటివారితో స్నేహం సాధ్యమవుతుంది. నేను నుంచి మనం స్థాయికి ఎదగడమే విశ్వజనీన సూత్రం. ఇదే ఐకమత్యపు అఖండ తత్వం. ఏ బలహీనతలూ, అపసవ్యతలూ లేకుంటే మాత్రమే కలిసి ఉండగలమంటే.. అది సాధ్యంకాదు. సరిపెట్టుకోవడాలూ, సర్దుబాట్లూ తప్పవు. సముద్ర జీవులకు- ఉప్పునీళ్ల నుంచే ప్రాణవాయువు అందుతోంది. ఐక్యతతోనే పరిపూర్ణత సాధ్యమన్నారు యోగులు. దాన్ని సాధించేందుకు మనలోకి మనం.. అంటే అంతరంగంలోకి నిరంతరం తొంగిచూస్తూ.. అందులోని మలినాలను బయట పారబోస్తుండాలి. అప్పుడే ఐక్యత అనేది మనలో అంతర్గతంగా ఉంటుందని అవగతమౌతుంది. అదే భౌతిక ఐక్యతకు తొలి మెట్టు.
దశరథుడి ముగ్గురి భార్యలు.. సవతులమని విభేదాలతో తల్లడిల్లలేదు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల ఆత్మీయత, అనుబంధం లోకానికే ఆదర్శం. సోదరుడి కోసం ఒకరు అడవికి వెళ్తే, ఇంకొకరు ఆయన పాదుకలను సింహాసనం మీదుంచి పాలన సాగించాడు. కుటుంబసభ్యుల్లో కలయిక ఉంటే.. ఎంతటి భయానక సమస్యలనైనా తట్టుకుని నిలబడే శక్తివస్తుంది. అందుకు భిన్నంగా పరస్పరం అసూయా ద్వేషాలతో రగులుతూ బంధాలను దూరం చేసుకుంటే మిగిలేది అశాంతీ, అస్థిమితమే.

ఒకే మాటకు కట్టుబడి మెలిగారు పాండవులు. ధర్మపత్ని ద్రౌపది విషయంలో వారెన్నడూ భేదాభిప్రాయాలకు తావీయలేదు. అరణ్య, అజ్ఞాతవాసాల్లోనూ సఖ్యత, ఐక్యతలను వీడలేదు. అలా కలిసిమెలిసి ఉన్నందునే కష్టాలను అధిగమించి, సామ్రాజ్యలక్ష్మిని సాధించారు.

ఐకమత్యమే బలం అన్నాడు పరవస్తు చిన్నయసూరి. చెడుపై పోరాటానికి ఐక్యతను మించిన ఆయుధం ఉందా?! ఆ యుద్ధంలో ఓడిన చెడు.. ఐక్యతలో లీనమైపోతుంది. సఖ్యత లోపిస్తే పరుల జోక్యం, అపోహలూ, అనర్థాలూ తథ్యం. అప్పుడిక ఎదురయ్యేది అపజయాలూ, పరాభవాలే. వృద్ధినాశనాలు ఐక్యతపైనే ఆధారపడి ఉంటాయన్నది చాణక్య నీతి. ఐక్యతను సాధించే రహదారి నాలుక. అందుకే ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంద’న్న నానుడి పుట్టింది.

వానరసేనతో మైత్రి నెరపిన శ్రీరాముడు సీతను సాధించుకున్నాడు. సమష్టి కృషితోనే రామసేతు నిర్మాణం సాధ్యమైంది. సఖ్యతతోనే పార్థుడికి గాండీవం, విలువైన అస్త్ర సంపద లభించాయి. అది లేనందునే శిశుపాల, జరాసంధులు ప్రాణాలు విడిచారు. శ్రీహరితో సఖ్యత దేవతలకు విజయం కలిగించగా.. ఆయనతో వైరం పెంచుకున్న అసురగణాలు నశించాయి.
ప్రేమను పంచితే ఐక్యత సాధించవచ్చని రామతీర్థ స్వామి అంటే.. నేను- నేను కానని ఎరుక కలగడం ఐక్యతకు దగ్గరి తోవ అన్నారు ఓంకార స్వామి. విషయ వాసనలు నశింపచేసుకుంటే ఐక్యతను సాధించవచ్చు. కష్టంలో, సుఖంలో అందరం ఒకటేనన్న భావన పొందితే.. అదే స్థిత ప్రజ్ఞత. అప్పుడిక ఆరాటాలూ, పోరాటాలు ఉండవు. నలుగురితో సఖ్యత సాధించి, విజయాలను సొంతం చేసుకోగలం.

తెలుపూ నలుపే కాదు..

ఐక్యత పేరుతో అనాలోచితంగా అనుసరించడమూ అనర్థదాయకమే. అందుకు తార్కాణం కురుక్షేత్ర యుద్ధం. దుర్యోధనుడి మాటను తక్కిన సోదరులు వినకుంటే భారత సంగ్రామం జరిగేదే కాదు. వారి ఐక్యత కురు వంశ వినాశనానికి దారితీసింది. ప్రజల్లో ఐక్యత లోపించి, రాచరికాన్ని ప్రశ్నించకుంటే.. కంసుడి వంటి క్రూరులు అరాచకం సృష్టిస్తారని భాగవతం ఆనాడే చెప్పింది. క్షీర సాగర మధనంలో లభించిన అమృతం రాక్షసుల అనైక్యత వల్లే వారికి దక్కకుండాపోయింది. లోకంలో మంచిచెడులు తెలుపు, నలుపుల్లా విస్పష్టంగా ఉండటమే కాదు.. మేళనాలు, సమ్మేళనాలు ఉంటాయని రామాయణ, భారత కథలు తెలియజేస్తాయి.

ప్రకృతితో మమేకం

‘ధర్మో రక్షతి.. రక్షితః’ చందమే పర్యావరణ పరిరక్షణ. మన చుట్టూ ఉన్న చెట్టూ పుట్టా కొండా కోనలతో మమేకమై జీవించాలి. అంటే వాటికి అవరోధాలు కల్పించకుండా, అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత మనదే. ప్రకృతికి దగ్గరగా మెలగినప్పుడు మానసిక ప్రశాంతత అనుభూతికొస్తుంది. గోపాలుడు గోవర్ధనగిరిని ఎత్తి.. యాదవులను ఏడు రోజులపాటు భీకర వర్షాలనుంచి కాపాడాడు. చెట్లనూ, జీవాలనూ మనం రక్షిస్తే.. అతివృష్టీ, అనావృష్టీ, భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాలకు తావుండదు. పాడి పంటలకు కొదవుండదు.

అదీ సందేశం

వేదాల్లో ప్రతి పాఠం చివర ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే శాంతి మంత్రం పఠించడంలో ఐక్యత పరమార్థముంది. మనలో ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆధిభౌతికం అనే మూడు రకాల తాపత్రయాలుంటాయి. పూర్వ కర్మానుసారం అనుభవమయ్యే శారీరక, మానసిక తాపాలు ఆధ్యాత్మికం. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే తాపాలు ఆధిదైవికాలు. చుట్టూ ఉండే జీవుల వల్ల కలిగే బాధలు ఆధిభౌతికాలు. ఈ మూడింటినీ శాంతింపచేయాలన్నదే శాంతి మంత్ర ఉద్దేశం. ఆధ్యాత్మిక కోణంలో జీవనయాత్ర సాగించేందుకు ప్రేమ, సఖ్యత సాధనాలని, అప్పుడే శాంతి చేకూరుతుందని అంతరార్థం.

‘అందరి కోసం ఒక్కడు నిలిచి.. ఒక్కడి కోసం అందరు కలిసి..’ అన్న కవి వాక్కుకి నిలువెత్తు నిదర్శనం ఐక్యత. మనిషి మనీషిగా ఎదగడానికి  కుటుంబంతో మొదలుపెట్టి చుట్టూ ఉన్న పరిసరాలు, పర్యావరణం వరకూ ఐక్యతే మనల్ని కాపాడుతుంది. సుఖసౌఖ్యాలనిస్తుంది. ప్రశాంతత చేకూర్చి సంతోషాలను పంచుతుంది.

డాక్టర్‌ జయదేవ్‌ చల్లా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని