కోరిన కోర్కెలు తీర్చే స్వామి

సుబ్రహ్మణ్యస్వామివారి ఆరాధనలో మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి ప్రసిద్ధి. తమిళనాడులో మాత్రం ప్రతి నెలలో శుద్ధ షష్ఠిని స్కందషష్ఠిగా పాటించి, కార్తిక శుద్ధ షష్ఠిని మహా పర్వదినంగా చేసుకుంటారు. కార్తిక శుద్ధ పాడ్యమి మొదలుకుని షష్ఠి వరకూ షష్ఠీవ్రతం పాటిస్తారు. ఈ ఆరు రోజులూ రాత్రి మాత్రమే తినడం (నక్త ఉపవాసం), స్వామివారిని ఆరాధించడం ఆనవాయితీ.

Published : 16 Nov 2023 00:16 IST

నవంబర్‌ 18 శూరసంహారం

సుబ్రహ్మణ్యస్వామివారి ఆరాధనలో మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి ప్రసిద్ధి. తమిళనాడులో మాత్రం ప్రతి నెలలో శుద్ధ షష్ఠిని స్కందషష్ఠిగా పాటించి, కార్తిక శుద్ధ షష్ఠిని మహా పర్వదినంగా చేసుకుంటారు. కార్తిక శుద్ధ పాడ్యమి మొదలుకుని షష్ఠి వరకూ షష్ఠీవ్రతం పాటిస్తారు. ఈ ఆరు రోజులూ రాత్రి మాత్రమే తినడం (నక్త ఉపవాసం), స్వామివారిని ఆరాధించడం ఆనవాయితీ. కార్తికేయుడు కార్తిక శుద్ధ షష్ఠి నాడు.. శూరపద్మాసురుడనే రాక్షసుణ్ణి సంహరించినందున ఈ రోజును స్కంద షష్ఠిగా పిలుస్తారు. యుద్ధంలో స్వామి అసురుడిపై ఆయుధాన్ని ప్రయోగించగా.. అతడు వెంటనే మామిడి చెట్టుగా మారాడు. స్వామివారి దివ్యాయుధం ఆ చెట్టును చీల్చగా.. ఒక భాగం నెమలిగా, మరో భాగం కోడిపుంజుగా మారి.. శరణు వేడాయి. నెమలిని వాహనంగా, కోడిపుంజును ధ్వజంగా స్వీకరించాడు సుబ్రహ్మణ్యస్వామి. ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ.. ‘శూర సంహారం’ నిర్వహిస్తారు. స్వామి ఆలయాల్లో ప్రముఖమైన తిరుచెందూర్‌లో ఈ కార్యక్రమం విశేషంగా చేస్తారు. లక్షలాది భక్తులు స్కందుని దర్శించుకుంటారు. తర్వాతి రోజైన కార్తిక శుద్ధ సప్తమి నాడు స్వామికి ఉభయ దేవేరులతో తిరుకల్యాణం నిర్వహిస్తారు. స్కందషష్ఠి వ్రతాన్ని ఆచరించడం వల్ల వివాహం, ఉద్యోగం, సంతానం తదితర కోర్కెలన్నీ నెరవేరతాయని ప్రతీతి. సుబ్రహ్మణ్యుని నిత్యం మనసులో స్మరించడం వల్ల చేసిన పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక స్కందషష్ఠి నాటి ఆరాధన విశేష ఫలితాలను అందిస్తుంది.

గొడవర్తి శ్రీనివాసు, ఆలమూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని