సకలం ప్రసాదించే స్కందుడు

తమిళనాట ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ప్రసిద్ధం. వాటిలో ఐదోదైన తిరుత్తణిని శాంతిపర్వతం అంటారు. తారకాసుర, శూరపద్మాసుర వంటి అసురులను సంహరించిన తర్వాత కుమారస్వామి ఈ క్షేత్రంలో తపస్సుచేసి మనోశాంతి పొందాడని, ఇక్కడే వల్లీ అమ్మను వివాహం చేసుకున్నాడని, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించారని స్థలపురాణం తెలియజేస్తోంది.

Updated : 28 Dec 2023 06:32 IST

డిసెంబరు 31 తిరుత్తణి పడిపూజ ఉత్సవం

తమిళనాట ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ప్రసిద్ధం. వాటిలో ఐదోదైన తిరుత్తణిని శాంతిపర్వతం అంటారు. తారకాసుర, శూరపద్మాసుర వంటి అసురులను సంహరించిన తర్వాత కుమారస్వామి ఈ క్షేత్రంలో తపస్సుచేసి మనోశాంతి పొందాడని, ఇక్కడే వల్లీ అమ్మను వివాహం చేసుకున్నాడని, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించారని స్థలపురాణం తెలియజేస్తోంది. ఈ క్షేత్రంలో స్కందుని అర్చించినవారికి శాంతి సౌఖ్యాలు, సకల సౌభాగ్యాలు లభిస్తాయని, కోరిన కోర్కెలు నెరవేరతాయని చెబుతారు. ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ పర్వతాన్ని తమిళులు ‘తనిగమలై’ అని పిలుస్తారు. కొండపైన ఉన్న ఆలయంలో సుబ్రహ్మణ్యుడు వల్లీదేవసేనా సమేతంగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కొండపైకి చేరేందుకు 365 మెట్లు ఉంటాయి. ఇవి సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీక. ఈ మెట్ల మార్గాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. రెండు శతాబ్దాల క్రితం ముత్తుస్వామి దీక్షితార్‌కు ఈ మెట్లపైనే సుబ్రహ్మణ్యస్వామి వృద్ధుని రూపంలో వచ్చి, కండచక్కెర తినిపించి అపార జ్ఞానాన్ని ప్రసాదించాడు. మరెందరో భక్తుల ఆర్తిని ఈ క్షేత్రంలో మురుగన్‌ తీర్చాడు. ఏటా డిసెంబర్‌ 31న భక్తులు వేలాదిగా తరలివచ్చి ఈ మెట్లను అర్చిస్తూ కొండపైకి వెళ్లడం ఆనవాయితీ. 1917లో వల్లిమలై స్వాముల పర్యవేక్షణలో ప్రారంభమైన పడిపూజ ఉత్సవం నేటికీ కొనసాగుతోంది. స్కందుని భక్తుల్లో అగ్రగణ్యుడైన అరుణగిరినాథర్‌ ఈ క్షేత్ర విశిష్టతను కీర్తనలుగా ఆలపించాడు. ఆయన రాసిన తిరుప్పుగళ్‌ చదువుతూ భక్తులు ఒక్కో మెట్టునూ అర్చిస్తూ పడిపూజను నిర్వహిస్తారు. కొండపైకి చేరుకుని జనవరి 1న స్వామిని దర్శించుకుంటారు. ఈ ఉత్సవంలో పాల్గొన్నవారికి ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

గొడవర్తి శ్రీనివాసు, ఆలమూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని