తారకరాముని భక్తిలో తరించిన త్యాగయ్య!

సంగీత సామ్రాజ్యానికి రారాజు అయిన త్యాగరాజస్వామి దైవాంశ సంభూతుడు. తమిళనాడు తంజావూరు జిల్లా తిరువారూర్‌లో జన్మించిన త్యాగయ్య వంశస్థులు తెలుగువారే.

Updated : 25 Jan 2024 03:29 IST

జనవరి 26-30 త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు

సంగీత సామ్రాజ్యానికి రారాజు అయిన త్యాగరాజస్వామి దైవాంశ సంభూతుడు. తమిళనాడు తంజావూరు జిల్లా తిరువారూర్‌లో జన్మించిన త్యాగయ్య వంశస్థులు తెలుగువారే. తనయుడి రాగకాంక్షకు ముచ్చటపడి తండ్రి రామబ్రహ్మం బాల త్యాగయ్యని శొంఠి వేంకట రమణయ్య అనే సంగీత విద్వాంసుడి దగ్గర చేర్చారు. ఆయన వద్ద శిష్యరికం చేస్తూ.. ఒకసారి సంగీత సభలో ‘దొరకునా ఇటువంటి సేవ’ అంటూ ఆలపించాడు త్యాగయ్య. ఆ సంగీత, సాహిత్య ప్రజ్ఞకు గురువర్యులే పులకించి, ‘దొరకునా ఇటువంటి శిష్యుడు’ అని ఆనంద బాష్పాలు రాల్చారట. త్యాగయ్యకి ఊహ తెలిసినప్పటి నుంచీ ఉదరపోషణార్థం తాపత్రయ పడటం నచ్చేది కాదు. ఆయన పూర్వీకులు రాజుల్ని ఆశ్రయించి జీవనోపాధి కల్పించుకున్నవారే. కానీ ఈయనకది సరిపడేది కాదు. చిన్నతనంలో తండ్రితో పాటు రాజ దర్బారుకు వెళ్లేటప్పుడు రాజుల దురహంకారాన్ని గమనించాడు. అప్పటి నుంచే రాజులను ఆశ్రయించటాన్ని నిరసించేవాడు. త్యాగయ్య రామనామ సంకీర్తనతో ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేయటానికైనా సిద్ధపడేవాడు. కానీ మహారాజుల వద్దకు వెళ్లడం, వారి ముందు చేయిజాపడం ఎంతమాత్రం నచ్చేది కాదు. అందుకే రాజులకు రాజు, లోకానికే మహారాజు అయిన శ్రీరామచంద్ర ప్రభువు కృపకు పాత్రుడయ్యాడు. సిరిసంపదలు లేకపోయినా ‘నీ దయతో నిత్యానందుడను అయ్యాను రామా..’ అని వినమ్రంగా ప్రకటించుకున్నాడు.

ప్రతీ కీర్తనా ప్రత్యేకమే..

తారకరాముని కీర్తించి భావగర్భితంగా సందర్భోచితంగా కీర్తనలు రచించటం త్యాగరాజు ప్రత్యేకత. ఆయన రాసిన ప్రతి కృతికీ ఓ ప్రత్యేకమైన సందర్భం, కారణం ఉన్నాయి. రాత్రీ, పగలూ అన్న తేడా లేకుండా ఎప్పుడు భక్తి భావోద్వేగం ఉప్పొంగితే.. అప్పుడు పరవశించి పాడేవాడు. ఆ కృతులను శిష్యులు స్వరపరచి జాగ్రత్తగా పరిరక్షించారు. తొలుత రచించిన ‘నమో నమో రాఘవా’ అని ఇంట్లో గోడ మీద రాసిన కీర్తన నుంచి కడపటి కీర్తన ‘పరమాత్ముడు వెలిగే’ అనే కృతి వరకూ త్యాగయ్య అనుభవించిన భావపారవశ్యమే గేయసృష్టికి ఆధారం. ఆ భక్తాగ్రేసరుడు తన ప్రతిభాపాటవాలతో కీర్తిప్రతిష్ఠలు ఆర్జించాలని ఆరాటపడలేదు. తనకు స్వరజ్ఞానాన్ని ప్రసాదించిన రామచంద్రప్రభువుకే ఆ కీర్తనలను అర్పించి తరించాడు. తిరుపతి సహా దేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలు పర్యటిస్తూ త్యాగరాజు తన స్వరసుమాలతో ఆయా దేవతామూర్తుల్ని అర్చించాడు. కంచిక్షేత్రంలోని ఏకాంబరేశ్వర స్వామిని, తిరుమల వేంకటేశ్వరుని కీర్తించి పరమానంద భరితుడయ్యాడు. అన్నమయ్యలా త్యాగరాజస్వామి కూడా అమ్మ వారిని కీర్తిస్తూ.. ఆయ్యవారికి మరింత దగ్గరయ్యాడు. ఆ పరంపరలో ‘మా జానకి చెట్టబట్టగ మహారాజువైతివి..’ అని సీతాదేవిని ప్రస్తుతిస్తూ చనువుతో ఆ శ్రీరాముణ్ణి కవ్వించాడు.

మరణం సంగతి ముందే తెలిసి..

1847 జనవరి 5న శిష్యులు, చెంతనున్న భక్తులతో తాను మరునాడు ఉదయం 11 గంటలకు శ్రీరాముని సన్నిధి చేరుకోబోతున్నట్లుగా చెప్పాడు. సంగతి తెలిసిన ఆ చుట్టుపక్కల గ్రామాల వారందరూ ఆ మహానుభావుడికి మనసారా వీడ్కోలు చెప్పడానికి తండోపతండాలుగా అక్కడికి చేరుకుని కన్నీరు పెట్టారు. త్యాగయ్య వారిని వారించి, అవిరామంగా భజన చేస్తూ ఉండమని విన్నవించుకున్నాడు. ఎంతో నిబ్బరంగా తన సమాధి కొలతలు, అందులో వేయాల్సిన ఉప్పు పరిమాణంతో సహా అన్నీ వివరించి చెప్పాడు. ఆఖరిగా తన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుణ్ణి స్మరిస్తూ ఒక కీర్తన, సదాశివుణ్ణి తలచుకుంటూ మరో కీర్తన ఆలపించాడు. కొద్ది క్షణాల్లోనే ఆ పరమభక్తుడు యోగ నిద్రలో ప్రవేశించాడు. ఆ తర్వాత ఆయన తల ఉపరిభాగం నుంచి అపూర్వమైన మధుర రవం బయటకు వినిపించిందని, ఒక కాంతివలయం ఉద్భవించి.. మెల్లమెల్లగా అంతరిక్షం వైపు పయనించిందని ప్రత్యక్ష సాక్షులు గ్రంథస్థం చేశారు. నిరంతరం సంగీత సాధనతో శ్రీరామచంద్రుడి ఆత్మీయ భక్తుడిగా జన్మను ధన్యం చేసుకున్న త్యాగరాజస్వామి ప్రాతఃస్మరణీయుడు అనటంలో సందేహం లేదు.

చైతన్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని