పళనిలో మహోత్సవం

తమిళ నెల ‘తై’ నెలలో పుష్యమి నక్షత్రం రోజును ‘తై పూసం’ పర్వదినంగా తమిళులు వేడుక చేసుకుంటారు.

Published : 25 Jan 2024 00:03 IST

జనవరి 25న తై పూసం

మిళ నెల ‘తై’ నెలలో పుష్యమి నక్షత్రం రోజును ‘తై పూసం’ పర్వదినంగా తమిళులు వేడుక చేసుకుంటారు. ఆంగ్ల క్యాలెండరును అనుసరించి ఇది జనవరి 25న వచ్చింది. ఈ రోజు సుబ్రహ్మణ్యుడు తారకాసురుణ్ణి వధించి లోకాలకు మేలు చేకూర్చినట్లు పురాణ కథనాలున్నాయి. తమిళనాట సుబ్రహ్మణ్య స్వామిని మురుగన్‌, కందన్‌, వేలన్‌ తదితర పేర్లతో ఆరాధిస్తారు. ఆ స్వామిని దైవంగా ఆరాధించడమే కాకుండా సార్వత్రిక గురువుగా భావిస్తారు. పురాణ గాథలను అనుసరించి తారకాసురుడికి.. శివపుత్రుడి చేతిలో మాత్రమే చనిపోయేలా బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. మహా బలవంతుడైన ఆ రాక్షసుడు గర్వాతిశయంతో దేవతలను ఓడించి వారిని బానిసలుగా చేసుకున్నాడు. దేవతల మొర ఆలకించిన మహాశివుడు వారిని రక్షించేందుకు, కుమారస్వామి రూపాన్ని సృష్టించాడు. అలా కుమారస్వామి తై పూసం నాడే తారకాసురుణ్ణి వధించి, అసురులపై విజయం సాధించడంతో అది పర్వదినం అయ్యింది. ఎన్నటికైనా చెడు నశిస్తుంది, మంచే నిలుస్తుందనే దానికి ఇది నిదర్శనం. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి పాలు, పూలు, పండ్లు, ఇతర నైవేద్యాలూ కావడిలో పెట్టుకుని ‘కందనుక్కు హరో హరా, మురుగనుక్కు హరోహరా’ అని పలుకుతూ వెళ్లి స్వామికి సమర్పించుకుంటారు. మురుగన్‌ ఆరు దివ్య క్షేత్రాల్లో ఒక్కోప్రదేశం ఒక్కో వేడుకకు ప్రసిద్ధి. తిరుచెందూర్‌లో శూరసంహారం, తిరుత్తణిలో ఆడి కృత్తిక నిర్వహిస్తారు. మూడోది, ముఖ్యమైంది అయిన దిండుక్కల్‌ జిల్లాలోని పళనిలో తై పూసం పండుగను పురస్కరించుకుని పది రోజులు స్వామివారికి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ రోజున కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు తాండవ నృత్యం చేస్తారనేది ప్రాచుర్యం పొందిన ఇతిహాస కథ. ఈ రోజున భక్తులు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యుని దర్శించి, ఆ స్వామి కరుణాకటాక్షాలు పొందుతారు.

పరాశరం గోపాల కృష్ణమూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని