వాగ్దేవి పుట్టినరోజు వసంత పంచమి

భారతం నుంచి భాగవతం వరకు కావ్యాలన్నీ ఆ అమ్మవారిని స్తుతించాకే రచన ఆరంభించారు. నన్నయ్య నుంచి పోతన వరకు ఆ అమ్మను కీర్తించాకే కవిత్వం సాగించారు.

Published : 08 Feb 2024 00:07 IST

ఫిబ్రవరి 14 వసంత పంచమి

భారతం నుంచి భాగవతం వరకు కావ్యాలన్నీ ఆ అమ్మవారిని స్తుతించాకే రచన ఆరంభించారు. నన్నయ్య నుంచి పోతన వరకు ఆ అమ్మను కీర్తించాకే కవిత్వం సాగించారు. మాటలకందని మహిమాన్విత మూర్తి సరస్వతీదేవి. ఆ పరాశక్తి వాగ్దేవిగా ఆవిర్భవించిన మాఘశుద్ధ పంచమి చదువులతల్లి జయంతి, వసంత పంచమి. బ్రహ్మదేవునికి సృష్టి రచనకు అవసరమైన సృజనాత్మక శక్తిని ఆ అమ్మే ప్రసాదించిందని పురాణాలు చెబుతున్నాయి. వేదాలకు సైతం సరస్వతీదేవినే తల్లిగా భావిస్తారు. ‘వేదమాత’ అన్న పిలుపే అందుకు ఆధారం. ప్రతిభ, ప్రజ్ఞ, ధారణ, వాక్‌ సంపద ఆ శారదాదేవి వల్లే కలుగుతాయని శాస్త్ర వచనం. ఆమె ప్రణవ స్వరూపిణి. ఆధ్యాత్మిక, లౌకిక విద్యలకు కూడా ఆ దేవి అధిష్టాన దేవత. సంగీత సాహిత్యాలూ ఆ తల్లి ప్రసాదితాలే. అలాగే లలితాదేవి స్వరూపమైన ఆ సరస్వతి కరుణతోనే లలిత కళల్లో రాణించగలరు. జ్ఞానశక్తికి ప్రతిరూపమైన సరస్వతి మన కనుబొమ్మల మధ్య ఉంటుంది. నీటి ప్రవాహాన్ని ‘సరస్‌’ అంటారు. ప్రవహించే గుణం కలిగిన సరస్వతి తనను ఆరాధించే భక్తుల్లో జ్ఞానాన్ని ప్రవహింపచేస్తుందని ప్రగాఢ విశ్వాసం.

ఆ తల్లి జ్ఞానకాంతి ప్రసరిస్తే..

‘సరః’ అంటే కాంతి అని కూడా అర్థం. సరస్వతీదేవిది జ్ఞానకాంతి. ఆ కాంతి ప్రసరిస్తే జన్మజన్మల అజ్ఞానం అంతరిస్తుంది. మహాకవి కాళిదాసు అందుకు నిదర్శనం. తెల్లనిపద్మంలో ఆసీనురాలై ఉండే వాగ్దేవి వీణ, పుస్తకం, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. ఆమె అసురులను సంహరించే దేవి కాదు, అజ్ఞాన సంహారిణి. ఆ సంహరణ ఆయుధాలతో కాదు జ్ఞానకాంతితోనే సాధ్యమవుతుంది. అందుకే ఆ దేవి ఆయుధాలు ధరించదు. జ్ఞానకాంతి ఉంటే.. ఏ ఆయుధాలూ అవసరం లేదని సరస్వతీదేవి స్పష్టం చేస్తుంది. స్వచ్ఛతే సరస్వతీ తత్త్వం. శుద్ధ, సత్త్వ స్వభావులకు, సరళ హృదయులకు మాత్రమే జ్ఞానం ప్రాప్తిస్తుందని ఆ తల్లి ధవళవర్ణ ప్రకాశం ప్రబోధిస్తుంది. శంకరాచార్యులు, పోతన.. అలాంటి నిర్మలాత్ములు కనుకనే ఆ దేవి తన కరుణాకటాక్షాలను వారిపై కురిపించింది. వేదాల విభజన, పురాణాల క్రమబద్ధీకరణ అనే మహత్కార్యాలను ఆరంభించే ముందు.. వ్యాసుడు వాల్మీకిమహర్షి వద్దకు వెళ్లాడు. ఆయన ద్వారా సరస్వతీ మంత్రాన్ని పొంది, గోదావరి తీరంలో ఆ తల్లిని ఉపాసించాడు. ఆ పుణ్యక్షేత్రమే వ్యాసపురి. అదే జ్ఞానసరస్వతిగా అమ్మవారు కొలువైన బాసర క్షేత్రంగా ప్రసిద్ధమైంది.

అమ్మ వాహనం ఏం చెబుతుందంటే..

సరస్వతీదేవి వాహనం హంస. నీరు కలిసిన పాలలో.. నీటిని విడిచి, పాలను మాత్రమే స్వీకరిస్తుంది హంస. మనం కూడా నిత్యానిత్య విచక్షణతో మెలగాలని, పాలలాంటి పారమార్థిక జ్ఞానాన్ని గ్రహించి, నీళ్లలాంటి లౌకిక విషయాలను విడనాడమని హంస ధర్మం సూచిస్తోంది. విద్యాధిదేవత సరస్వతీ దేవిని తెల్లని పూలతో పూజించటం ఆనవాయితీ. వ్యాస విరచిత మహాభారతాన్ని నన్నయ్య, శ్రీపంచమి రోజే తెలుగులో అనువదించటానికి శ్రీకారం చుట్టినట్లు చరిత్ర చెబుతోంది. సదా విద్యాబుద్ధులను సమృద్ధిగా ప్రసాదించాలని వసంత పంచమి శుభదినాన ఆ జ్ఞానసరస్వతిని ప్రార్థిద్దాం! 

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని