అభ్యుదయవాది దయానంద సరస్వతి

గుజరాత్‌ రాష్ట్రం టంకారాలో క్రీ.శ.1824 ఫిబ్రవరి 12న జన్మించిన దయానంద సరస్వతి అసలు పేరు మూలశంకరుడు.

Published : 08 Feb 2024 00:07 IST

ఫిబ్రవరి 12 స్వామి దయానంద సరస్వతి జయంతి

గుజరాత్‌ రాష్ట్రం టంకారాలో క్రీ.శ.1824 ఫిబ్రవరి 12న జన్మించిన దయానంద సరస్వతి అసలు పేరు మూలశంకరుడు. తండ్రి కర్షణ్‌జీ పెద్ద భూస్వామి. దయానందునికి 5వ ఏట అక్షరాభ్యాసం చేయించారు. ఆయన 14 ఏళ్లలోపే యజుర్వేదాన్ని కంఠస్థం చేశారు. తల్లిదండ్రులు శివపూజలు చేసేవారు. ఒక శివరాత్రి ఆయన జీవితాన్ని మార్చేసింది. రాత్రి వేళ జాగరణ చేస్తుండగా.. పిల్లి-ఎలుక చెలగాటం మొదలైంది. ఆ ఆగడాన్ని అరికట్టలేని రాతి శివలింగం దేవుడేంటి- అనిపించింది దయానందునికి. సృష్టికర్త ఎవరు, జీవితానికి లక్ష్యం ఏమిటి లాంటి ఆలోచనలు ఎంతగానో బాధించాయి. ఆ ప్రశ్నలకు సమాధానం అన్వేషించాలని ఇంటినుంచి బయల్దేరారు. సాయలే నగరంలో బ్రహ్మచర్య దీక్ష తీసుకుని, ‘శుద్ధ చైతన్య బ్రహ్మచారి’ పేరుతో కొన్నాళ్లు అక్కడే ఉన్నారు. ఇంటికి వెళ్లకూడదు అనుకున్న శంకరుడు మంచి గురువు కోసం వెదకసాగారు. బ్రహ్మచర్యం కంటే సన్యాసం శ్రేష్ఠమని భావించి పరమానంద సరస్వతి అనే సన్యాసి వద్ద దీక్ష పొంది దయానంద సరస్వతి అయ్యారు. జ్వాలానందపురి, శివానందగిరి అనే యోగుల వద్ద యోగ పద్ధతులు నేర్చుకున్నారు. రుషీకేశ్‌ వెళ్లి సాధువులతో సత్సంగం చేశారు. అక్కడ లభించిన తంత్రగ్రంథాల్లో మద్యం, మాంసం, మత్స్యం, ముద్రలు, మైథునం- అనే పంచ మకారాలు అనుభవిస్తేనే మోక్షం ప్రాప్తిస్తుంది అని రాసి ఉండటంతో దుఃఖం కలిగింది. అవి సరైన గ్రంథాలు కావనే కోపంతో గంగలోకి విసిరేశారు. వేదాలు, ఉపనిషత్తులు, కపిలుని సాంఖ్యశాస్త్రం, పతంజలి యోగశాస్త్రం- వీటినే ప్రమాణాలుగా తీసుకున్నారు.

ఆర్యసమాజ స్థాపన

దయానందుడు వెళ్లిన చోటల్లా పండితులు, సాధువులతో చర్చించేవారు. సత్యాసత్యాలను అన్వేషించేవారు. దయానంద జీవితంలో అపూర్వ సంఘటన విరజానందుడు గురువుగా లభించడం. ఆయన కుటీరానికి వెళ్లి తలుపు తట్టగా ‘నువ్వెవరు?’ అనడిగారు. ‘నేనెవరో తెలుసుకోవ డానికే వచ్చాను’ అనడంతో సంతోషించారాయన. వేదాల్లో లేని, రుషులు రాయని గ్రంథాలు నీ వద్ద ఉంటే గంగలో పడేసిరమ్మంటే అలాగే చేశారు. దయానంద ఆర్యసమాజాన్ని స్థాపించారు. అందులో చేరదలచుకున్నవారు.. పరమేశ్వరుని ఉపాసించాలి, అన్ని ధర్మాలకూ మూలమైన వేదం చదవాలి, చదివించాలి, సత్యాన్ని గ్రహించి అసత్యాన్ని త్యజించాలి, ఏ పనైనా ధర్మం ప్రకారం చేయాలి, అందరితో ప్రేమగా ఉంటూ చేతనైన సాయం చేయాలి, తన ఉన్నతితో తృప్తిచెందక, అందరి అభ్యుదయంలో తన ఉన్నతి ఉందని భావించాలి- మొదలైన సూత్రాలు పాటించాలనే నియమం విధించారు. వేదానికి ‘సరస్వతి’ అనే పేరుంది. వేదజ్ఞానాన్ని ఆర్జించినవాడు కనుక దయానంద సరస్వతి అనే పేరు ఆయనకు సార్థకమైంది. శాస్త్ర చర్చల్లో ఎందరో పండితులను ఓడించి, వేదధర్మమే గొప్పదని వివరించి స్వామి అయ్యారు. మూఢ నమ్మకాలను ఖండించి, సదాచారాలను చాటి సంస్కర్త అయ్యారు. వేదాల్లో విగ్రహారాధన లేదని మొదట చెప్పింది దయానందుడే. అవిద్యను రూపు మాపి, విద్యాప్రకాశం కోసం కృషి చేసిన మహాపురుషుడాయన. అంటరానితనం వేద విరుద్ధం అంటూ ఉదాహరణలతో నిరూపించిన దార్శనికుడు. మతం వ్యక్తిగతం.. కానీ ధర్మం సర్వ మానవాళికీ సంబంధించింది. కనుక మతం కంటే ధర్మం గొప్పది- అనేవారాయన. అంటరాని తనం, బాల్యవివాహాలు, మూఢాచారాలు, కుల భేదాలను రూపుమాపి, నవ్యపథంలో నడిపించాలనుకున్న యుగపురుషుడాయన. అట్టడుగు వారు కూడా సమున్నతంగా ఎదగాలనుకున్న మహనీయుడు దయానంద సరస్వతి.    

ఆచార్య మసన చెన్నప్ప


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు