‘కార్తిక’ ప్రత్యేకం.. ఈ నవ నంది క్షేత్రాల్ని దర్శించుకున్నారా?

కార్తిక మాసంలో కార్తిక పౌర్ణమి రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు పాదయాత్ర ద్వారా ఈ ఆలయాలను సందర్శిస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

Updated : 20 Nov 2023 22:44 IST

Karthika Masam 2023| నవనంది క్షేత్రాలకు నిలయమైన ఏపీలోని నంద్యాల జిల్లా కార్తిక మాసంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మహానందితో పాటు దాని చుట్టూ 16కి.మీల పరిధిలో ఈ నవనంది క్షేత్రాలు వెలిశాయి. కార్తిక మాసంలో ప్రతి సోమవారం, కార్తిక పౌర్ణమి రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు పాదయాత్ర ద్వారా ఈ ఆలయాలను సందర్శిస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. నంద్యాల పట్టణం గుడిపాడి గడ్డలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల ఆలయంలో ఉన్న సాక్షి గణపతిని, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని యాత్ర ప్రారంభిస్తారు. ప్రథమనంది, నాగనంది, సోమనంది, శివనంది (రుద్రనంది), కృష్ణనంది (విష్ణునంది), మహానంది, వినాయకనంది, గరుడ నంది, సూర్యనంది క్షేత్రాలను దర్శించుకుని తిరిగి గుడిపాడిగడ్డలోని మల్లికార్జునస్వామిని దర్శించుకుంటేనే యాత్ర సఫలమవుతుందని ఇక్కడికి వస్తారు.

ప్రథమ నంది: నవ నందులలో మొదటిదైన ప్రథమనందీశ్వరాలయం నంద్యాల పట్టణంలోని శామకాల్వ గట్టున ఉంది. ఈ ఆలయం విజయనగర రాజుల కాలంలో విశేషమైన పూజలందుకొందని చరిత్రకారులు చెబుతారు. గర్భాలయంలో ప్రథమ నందీశ్వరుడిగా కొలువుదీరిన కేదారేశ్వర లింగం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ లింగాన్ని దర్శించుకుంటే కేదార్‌నాథ్‌లోని కేదారేశ్వరలింగ దర్శన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

మహానంది: ఈ క్షేత్రంలో పరమశివుడు గోవుపాద రూపంలో వెలశారు. అందుకే మహానందీశ్వరున్ని గోపాదలింగేశ్వరుడిగా పిలుస్తారు. ఈ స్వామివారి ఆలయం కిందిభాగం నుంచి అద్భుతమైన జల సంపద ఏడాది మొత్తం ప్రవహిస్తుంటుంది.  ఈ నీటిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీరు సుమారు రెండు వేల ఎకరాలకు సాగు నీరుగా ఉపయోగపడుతోంది.

వినాయక నంది: ఈ ఆలయం మహానంది ఆలయాల్లో అంతర్భాగంగా నిర్మితమైంది. మహానందీశ్వర స్వామివారి ఆలయానికి దక్షిణం వైపు వినాయకనందీశ్వరుడు వెలిశారు. ఇక్కడ వినాయకుడు తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించడంతోనే వినాయకనందీశ్వరాలయంగా పేరొచ్చినట్లు స్థల పురాణం వివరిస్తుంది.

గరుడ నంది: ఈ ఆలయం కూడా మహానంది క్షేత్రంలోనే ప్రధాన ఆలయానికి పడమటి దిశలో ఉంది. ఈ స్థలంలో గరుత్మంతుడు పరమశివున్ని ధ్యానించి ఆయన రూపాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ ఆలయానికి ఇటీవల విమాన గోపురం నిర్మించారు.

సూర్యనంది: చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం మహానంది క్షేత్రం- నంద్యాల ప్రధాన రహదారిలో తమడపల్లెకు దక్షిణంవైపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో పరమశివుని నుదుట ఉదయాన్నే సూర్య కిరణాలు పడుతూ స్వామివారిని అర్చించినట్లు ఉండేదని భక్తులు చెబుతారు. దోపిడీ దొంగల దుశ్చర్యల వల్ల విగ్రహం ఆ ప్రత్యేకతను కోల్పోయింది. ప్రస్తుతం నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

శివనంది (రుద్ర నంది): ఈ క్షేత్రం బండిఆత్మకూరు మండలం కడమలకాల్వ (పూర్వనామం కలువల కాల్వ) గ్రామ సమీపంలో ఉంది. దీన్ని శివనంది లేదా రుద్రనందీశ్వర ఆలయంగా పిలుస్తారు. ఇక్కడ వెలిసిన స్వామివారు అన్ని నందుల్లోకెల్లా ఎత్తయిన లింగరూపుడిగా వెలిశారు. ఈ క్షేత్రం నంద్యాల పట్టణానికి 15 కి.మీల దూరంలో ఉంది.

కృష్ణనంది (విష్ణునంది): ఈ క్షేత్రం నల్లమల అడవిలో వెలిసింది. ఇక్కడి మండపాలు, అమ్మవారి విగ్రహంతో పాటు నాగదేవతలు, స్వామివారి ఎదుట ఉన్న నంది, నవగ్రహ మూర్తులు పాలరాతితో చూడచక్కని ఆకృతుల్లో ఆకట్టుకుంటాయి. ప్రకృతి రమణీయతతో అలరారే ఈ క్షేత్రం ఇటు కడమలకాల్వ నుంచి అటు మహానంది మండల కేంద్రం తిమ్మాపురం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సోమనంది: నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండు సమీపంలో ఉన్న మరో ఆలయం సోమనందీశ్వరాలయం. ఇక్కడ చంద్రుడు మహేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ లింగానికి సోమనందీశ్వర లింగమనే పేరొచ్చింది.

నాగనంది: ఈ క్షేత్రం నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఉంది. పూర్వం గరుత్మంతుని ధాటికి తాళలేక నాగేంద్రుడు ముల్లోకాలు తిరిగిచ్చి ఇక్కడ నంది కోసం తపం ఆచరించడంతో ఈ ప్రాంతానికి నాగనంది అని పేరొచ్చినట్లు స్థల పురాణం చెబుతోంది. నాగుల తపస్సుకు మెచ్చిన నంది వాహనుడు వారికి అభయం ఇచ్చి కాపాడినట్లు ప్రతీతి.

- నంద్యాల గాంధీచౌక్‌, మహానంది న్యూస్‌టుడే


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని