మహాలయ పక్షంలో ఏం చేయాలి? దీని పూర్వ గాథ ఏమిటి?

భాద్రపదమాసం కృష్ణపక్ష పాడ్యమి నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న కాలాన్ని మహాలయ పక్షం లేదా పితృపక్షమని అంటారు. సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌........

Updated : 14 Mar 2023 15:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భాద్రపదమాసం కృష్ణపక్ష పాడ్యమి నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న కాలాన్ని మహాలయ పక్షం లేదా పితృపక్షం అంటారు. సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 6 వరకు ఈ పితృపక్ష దినాలు అని పంచాంగాలు పేర్కొంటున్నాయి. ఇది పితృ దేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. పితృ దేవతలు అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు.. గతించిన వారంతా పితృ దేవతలుగానే పరిగణిస్తారు. ప్రతి నెలా అమావాస్య నాడు పితృ దేవతలను స్మరించుకొని తర్పణాలు వదలాలి. అయితే, కరోనా మహమ్మారిలాంటి విపత్తుల్లో మరణించినవారో, ఏ తిథినందు చనిపోయారో తెలియని వాళ్లు ఈ మహాలయ పక్షంలో తమ పితృదేవతలకు తర్పణాలు వదిలితే వారిని తృప్తి పరిచి ఆశీస్సులు పొందిన వారవుతారు. ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టే శ్రాద్ధ కర్మలకు, పితృదేవతలకు వదిలే తర్పణాల వల్ల గొప్ప పుణ్యఫలం లభిస్తుందని, వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

స్వర్గస్తులైనవారు ఏ మాసం, ఏ తిథిలో చనిపోయారో అదే మాసం అదే తిథినందు శ్రాద్ధకర్మలను ఏటా నిర్వర్తించాలి. అలా చేయలేని పక్షంలో భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో వారి తిథి రోజు జరిపితే ఆ సంవత్సరం జరిపిన ఫలం దక్కుతుందని శాస్త్రం పేర్కొంటోంది. ఏ తిథినందు గతించారో తెలియనటువంటి వారు మహాలయ పక్షంలోని అమావాస్య రోజున శ్రాద్ధకర్మలు ఆచరిస్తే వారికి సంవత్సరమంతా శ్రాద్ధంపెట్టిన పుణ్య ఫలం దక్కుతుంది. 100 యజ్ఞాలు చేసిన దానికన్నా పితృదేవతలకు తర్పణాలు అందించడం ఎంతో ముఖ్యమని మన మహర్షులూ తెలియజేశారు. గతించిన తల్లిదండ్రులకు, ఇతరులకు తర్పణాలు, పిండ ప్రదానాలు, దానధర్మాలను ఏటా వారి వర్ధంతి రోజున గానీ, మహాలయ పక్షాల్లో గానీ, మహాలయ అమావాస్య రోజు గానీ చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.

మహాలయ పక్షం ప్రాశస్త్యంపై మహాభారత కథాంశం..

దానశీలి అయిన కర్ణుడు మరణానంతరం స్వర్గానికి వెళుతుండగా.. మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలుగుతుంది. దీంతో అక్కడ కనిపించిన ఓ పండ్ల చెట్టు వద్దకు వెళ్లి ఫలం కోసుకొని తినాలనుకున్నాడు. అది కోసి తిందామని ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది. అలా అక్కడ ఏ పండును ముట్టుకున్నా అలాగే జరిగింది. కనీసం దాహమైనా తీర్చుకుందామని ఓ సెలయేరు వద్దకు వెళ్లి నీటిని దోసెళ్లలోకి తీసుకోగా అదీ బంగారం రంగులోకి మారిపోతుంది. స్వర్గానికి వెళ్లినా అదే పరిస్థితి. దీంతో ఆశ్చర్యానికి గురైన కర్ణుడు.. బాధతో తన తండ్రి సూర్య భగవానుడిని ప్రార్థించాడు. ‘కర్ణా.. నీ జీవితమంతా బంగారాన్ని దానం చేశావే తప్ప.. ఎప్పుడూ పితృతర్పణాలు, అన్నదానం వంటివి చేయలేదు. అందుకే ఈ రోజు నీకు ఆకలి, దాహం తీర్చుకొనేందుకు ఆహారం, నీరు దొరకడంలేదు’’ అని సూర్య భగవానుడు అసలు కారణం చెప్పాడు. ఆ కారణం విన్న కర్ణుడు సూర్యుడిని ప్రార్థించగా.. ఇంద్రుడి ద్వారా సూర్యభగవానుడు ఓ వరాన్ని ప్రసాదించాడు. భూలోకానికి వెళ్లి అన్నదానం, పితృదేవతలందరికీ తర్పణాలు వదిలి స్వర్గానికి వచ్చేలా వరమిచ్చాడు. ఇంద్రుడు ఇచ్చిన వరంతో కర్ణుడు భూమిపైకి వచ్చిన రోజు భాద్రపద బహుళపక్ష పాడ్యమి. అలా వచ్చి 15 రోజుల వరకు (అమావాస్య వరకు) రోజూ పితృదేవతలకు తర్పణాలు వదిలి గతించిన తల్లిదండ్రులకు పిండ ప్రదానాలు, శ్రాద్ధకర్మలు చేసి మహాలయ పక్షంలో చివరి రోజైన మహాలయ అమావాస్య రోజు తిరిగి కర్ణుడు స్వర్గానికి చేరుకొన్నాడు. కర్ణుడు అన్నదానం, పితృతర్పణం చేశాక ఆయన కడుపు నిండి.. ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్లిన ఈ కాలమే మహాలయ పక్షం అంటారు.

- చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మందపల్లి, ఉజ్జయిని, అన్నవరం దేవస్థానాల పంచాంగకర్త


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని