Maha shivaratri: పవిత్ర లింగాలు... పంచారామాలు..!

శివకేశవులకి భేదం లేదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుడు ఎక్కడ ఉంటాడో విష్ణువు అక్కడే ఉంటాడు. విష్ణువు ఉన్నచోటే శివుడూ కొలువవుతాడు. శివకేశవుల్లోని ఆ ఏకత్వాన్ని తెలిపే

Updated : 14 Mar 2023 16:03 IST

శివకేశవులకి భేదం లేదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుడు ఎక్కడ ఉంటాడో విష్ణువు అక్కడే ఉంటాడు. విష్ణువు ఉన్నచోటే శివుడూ కొలువవుతాడు. శివకేశవుల్లోని ఆ ఏకత్వాన్ని తెలిపే పవిత్ర క్షేత్రాలే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వెలసిన పంచారామాలు...

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే  శివస్య హృదయం విష్ణుర్విర్ణోశ్చ హృదయం శివః’... అంటే, శివుని రూపమే విష్ణువు. విష్ణువు రూపమే శివుడు. శివుడి గుండెల్లో కొలువైనది విష్ణువే. విష్ణువు హృదయమే శివుడి ఆవాసం... అన్న అర్థాన్ని చాటే ఈ శ్లోకం యజుర్వేదంలోనిది. పంచారామాలుగా మనం పిలిచే ఆ ఐదు క్షేత్రాల్లోనూ కొలువున్నది శివుడే. క్షేత్రపాలకుడు విష్ణువు. పైగా ఆ శివలింగాలన్నీ ఒకే లింగం నుంచి ఉద్భవించినవే. తారకాసురుడు పరమశివభక్తుడు. తపస్సు చేసి శివుడి ప్రాణలింగాన్ని వరంగా పొందిన గర్వంతో దేవలోకంపైకి దండెత్తి, ఇంద్రుణ్ణి ఓడిస్తాడు. దాంతో దేవతలంతా తారకాసురుణ్ణి సంహరించమని ఆ శ్రీమహావిష్ణువుని కోరగా, ఆ శ్రీహరి ‘తారకుడు శివభక్తుడు. శివుడి ప్రాణలింగాన్ని పొందినవాడు. నేను వధించలేను. శివుణ్నే ఆశ్రయించండి’ అని చెప్పాడు. అప్పుడు దేవతలు శివుణ్ణి శరణు కోరగా ‘నా ప్రియభక్తుడైన తారకుణ్ణి నేను చంపలేను. మిమ్మల్నీ కాదనలేను. కుమారస్వామి వధిస్తాడు’ అని చెబుతాడు. అంతట ఆ షణ్ముకుడు దేవసేనకు సారధ్యం వహించి తారకుడితో యుద్ధం చేశాడు. శక్తి ఆయుధంతో ఎన్నిసార్లు ఆ అసురుడి శరీరాన్ని ముక్కలుగా చేసినా మళ్లీ అతుక్కుపోతున్నాయి. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న కుమారస్వామికి శివుడు ప్రత్యక్షమై, ‘కుమారా ఆందోళన చెందకు. తారకుడి కంఠంలో నా ప్రాణలింగం ఉన్నంతవరకూ అతను చనిపోడు. దాన్ని ముక్కలుచేయాలి’ అని చెబుతాడు. అప్పుడు కుమారస్వామి ఆగ్నేయాస్త్రంతో ఆ లింగాన్ని ఐదు ముక్కలు చేయగా అవి కృష్ణా, గోదావరీ తీరాల్లో పడ్డాయి. ఓంకార నాదంతో అవి మళ్లీ ఏకమవబోతుండగా విష్ణుమూర్తి ఆదేశం మేరకు పడ్డ చోటే ఆ లింగ శకలాలను దేవతలు వెంటనే ప్రతిష్ఠించి ఆలయాలు నిర్మించార¿న్నది పౌరాణిక కథనం. అవే ద్రాక్షారామం, అమరారామం, క్షీరారామం, సోమారామం, కుమారారామాలు.


క్షీరారామం!

క్షీర రామలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటోన్న ఈ క్షేత్రం పశ్చిమగోదావరిజిల్లాలోని పాలకొల్లులో ఉంది. పంచారామాల్లోని మిగిలిన నాలుగు క్షేత్రాల్లో లింగశకలాలను దేవతలు ఒకేసారి ప్రతిష్ఠించగా, క్షీరారామంలో మాత్రం త్రేతాయుగంలో రాముడు ప్రతిష్ఠించాడట. ఇక్కడి శివలింగం రెండున్నర అడుగుల ఎత్తులో తెల్లగా ఉంటుంది. అందుకే దీనికా పేరు. ఉత్తరాయణ, దక్షిణాయన ప్రారంభంలో ఉదయంవేళలో సూర్యకిరణాలు గోపురం రెండో అంతస్తు నుంచి లింగంమీద పడతాయి. గర్భగుడిలోని మూలవిరాట్టును నలువైపులా ఉన్న కిటికీలనుంచి చూడవచ్చు. తొమ్మిదో శతాబ్దంనాటి చాళుక్యులే ఈ ఆలయాన్నీ కట్టించినట్లు చెబుతారు. 120 అడుగుల ఎత్తులో తొమ్మిది అంతస్తుల్లో నిర్మించిన గోపురం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయ క్షేత్రపాలకుడు జనార్థనుడు. ఇక్కడ ఒక్కరోజు ఉంటే ఏడాదిపాటు కాశీలో ఉన్న పుణ్యం దక్కుతుందట. సూర్యభగవానుడు, సప్తమాతృక, పార్వతీదేవి, బ్రహ్మ, సరస్వతి, కనకదుర్గ, కాలభైరవ, నటరాజు, దత్తాత్రేయ... ఇలా పలు దేవతలూ కొలువయ్యారిక్కడ. ఏలూరుకి సుమారు 110 కి.మీ.దూరంలో ఉందీ ఆలయం.


ద్రాక్షారామం..!

శివ, కేశవుల ఆలయాలతోబాటు శక్తిపీఠం కూడా కొలువైన క్షేత్రం ఇది. దక్షప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం ఇదేనట. ఇక్కడ కొలువుదీరిన ముక్కంటిని శ్రీరాముడు, సూర్యుడు, ఇంద్రుడు పూజించారన్నది పౌరాణిక కథనం. తారకుడి సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడిందన్న విషయాన్ని తెలుసుకున్న సప్తర్షులు, సప్తగోదావరీపాయలతో వచ్చి ఆ భీమేశ్వరుడికి అభిషేకం చేయాలనుకున్నారు. మార్గమధ్యంలో సప్తర్షులు తెస్తోన్న గోదావరులు తన యజ్ఞాన్ని ఎక్కడ ముంచేస్తాయోనన్న భయంతో తుల్య రుషి వారించబోయాడట. ఇరువర్గాలమధ్యా వాదోపవాదనలు జరగడంతో తెల్లారిపోయింది. ఈలోగా శివలింగానికి సూర్యభగవానుడు ప్రథమ సుప్రభాత అభిషేకం చేసేశాడు. అప్పుడు వ్యాసమహర్షి రుషులను శాంతపరిచి, ఆ పాయల్లో కొన్నింటిని అంతర్వాహినిగా మార్చి, ఆలయ సమీపంలోని పుష్కరిణిలో కలిసేలా చేశాడు. అందుకే ఇక్కడి పుష్కరిణిని ‘సప్తగోదావరి’ అని పిలుస్తారు. ఈ నీటితోనే స్వామికి నిత్యాభిషేకం చేస్తుంటారు. రెండు ప్రాకారాలతో రెండంతస్తులుగా ఉండే ఈ ఆలయాన్ని క్రీ.శ. 892-922 మధ్య కాలంలో తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీమ కట్టించినట్లు శాసనాల్లో ఉంది. భీమేశ్వరస్వామిగా ఆరాధించే ఇక్కడి శివలింగం ఎత్తు 9 అడుగులు. రెండు అంతస్తుల్లోనూ కనిపించే ఈ లింగానికి అభిషేకాదుల్ని పై అంతస్తునుంచే చేస్తారు. భానుడి తొలికిరణాలు నేరుగా ఈ లింగంమీదపడటం ఆలయ ప్రత్యేకత. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఇక్కడి అమ్మవారిని మాణిక్యాలదేవిగా కొలుస్తారు. ఆలయ ప్రాంగణంలో భైరవుడు, విరూప, వామన... ఇలా పలు దేవతలూ కొలువై ఉన్నారు. రాజమండ్రి, కాకినాడ వరకూ రైల్లో వెళితే అక్కడ నుంచి బస్సులో వెళ్లవచ్చు.


అమరారామం

 కృష్ణాతీరంలో అమరావతి పట్టణంలో కొలువైనదే అమరలింగేశ్వరాలయం. శివుడి ఆదేశం మేరకు శివలింగ శకలం పడిన చోటుకి చేరుకుని పెరిగిపోతున్న లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఇక్కడి స్ఫటికలింగం ఎత్తు 16 అడుగులు. లింగం చుట్టూ రెండు అంతస్తులుగా గుడిని నిర్మించారు. అభిషేకాదుల్ని పై అంతస్తు నుంచే చేస్తారు. ఈ శివలింగం మీద ఎరుపురంగు మరక కనిపిస్తుంది. లింగం ఎత్తు ఆగకుండా పెరిగిపోతుండటంతో దాన్ని ఆపేందుకు మేకు కొట్టడంతో లింగంలోంచి రక్తం వచ్చి అలా మరకలా పడిందని చెబుతారు. మూడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్థివేశ్వరుడు, కోసలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపురసుందరీ దేవి, కాల భైరవుడు, కుమారస్వామి, శ్రీశైల మల్లేశ్వరుడు, పలు దేవతలూ కొలువై ఉన్నారు. క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి. గుంటూరుకి సుమారు 35 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయానికి మంగళగిరి, విజయవాడ, సత్తెనపల్లి నుంచి వెళ్లవచ్చు.


కుమారారామం

సామర్లకోటలోని భీమేశ్వరుడిని కుమారస్వామి ప్రతిష్ఠించడంవల్లే దీనికి కుమారారామం అని పేరు. ఇక్కడ బాలా త్రిపురసుందరీదేవి సహిత భీమేశ్వరుడు కొలువై ఉన్నాడు. శ్రీదేవీ భూదేవీ సమేత జనార్దనుడు ఇక్కడి క్షేత్రపాలకుడు. చాళుక్య భీముడే ఈ ఆలయాన్నీ నిర్మించాడు. కాకతీయులు పునర్నిర్మించారు. దాదాపుగా ద్రాక్షారామ ఆలయాన్నే పోలినట్లు ఉండే ఈ ఆలయంలోని లింగం ఎత్తు 14 అడుగులు. సున్నపురాయితో తయారైన ఈ లింగం కింద నుంచి రెండో అంతస్తుపైభాగంలోకి చొచ్చుకుపోయినట్లుగా ఉంటుంది. పురాణాలు ఈ ఆలయాన్ని యోగక్ష్రేతంగా పేర్కొంటున్నాయి. అంటే భగవంతుని అనుగ్రహం ఉన్నవాళ్లే ఈ స్వామిని దర్శించుకుంటారట. వంద స్తంభాల మండపం, ఏకశిలా నంది... ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రధాన ద్వారాన్ని సూర్య ద్వారంగా పిలుస్తారు. కాకినాడకు 15కి.మీ దూరం ఉందీ ఆలయం.


సోమారామం!

క్కడి సోమేశ్వర జనార్దన స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి దీనికి సోమారామం అని పేరు. తూర్పుచాళుక్యరాజైన చాళుక్యభీముడే ఈ ఆలయాన్నీ నిర్మించాడు. ఈ శివలింగానికో ప్రత్యేకత ఉంది. పౌర్ణమి సమయంలో తెలుపు రంగులో ఉండే శివలింగం, అమావాస్య వచ్చేసరికి గోధుమరంగులోకి మారుతుంది. తిరిగి పౌర్ణమినాటికి మళ్లీ తెలుపురంగులోకి వస్తుంది. రెండు అంతస్తులుగా ఉన్న ఆలయంలో సోమేశ్వరుడు కింది అంతస్తులోనూ అన్నపూర్ణాదేవి పై అంతస్తులోనూ కొలువయ్యారు. ఇలా శివుడి తలమీద అమ్మవారు ఉన్న ఆలయం ఇదేనట. ఇక్కడి పుష్కరిణిని సోమగుండం అంటారు. ప్రాంగణంలో శ్రీరాముడు, కుమారస్వామి... ఇలా ఇతర దేవతల్నీ పూజించవచ్చు. భీమవరానికి రెండు కి.మీ. దూరంలోని గునిపూడిలో ఉన్న ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్దనస్వామి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని