విష్ణుమూర్తి విడిది

ఒక ఏడాదికి అధికమాసంతో కలిపి 26 ఏకాదశులు. నెలకు రెండుసార్లు వస్తాయి. ఆషాఢంలో శయనైక, కార్తికంలో ఉత్పన్న, ఫాల్గుణంలో అమలైక్య, పాపవిమోచన ఏకాదశులు శ్రేష్టమైనవి.

Updated : 14 Mar 2023 13:12 IST

ఒక ఏడాదికి అధికమాసంతో కలిపి 26 ఏకాదశులు. నెలకు రెండుసార్లు వస్తాయి. ఆషాఢంలో శయనైక, కార్తికంలో ఉత్పన్న, ఫాల్గుణంలో అమలైక్య, పాపవిమోచన ఏకాదశులు శ్రేష్టమైనవి. అమలైక్య ఏకాదశి వ్రతంతో మోక్షం లభిస్తుందంటూ.. ఆరోజు ఘనతను తెలియజేసే పురాణ కథలున్నాయి. అంబరీషుడు నిష్టగా ఏకాదశీ వ్రతం చేసేవాడు. ఒకరోజు దుర్వాసముని శిష్యులతో అంబరీషుడి రాజ్యానికి వచ్చి ద్వాదశి ఉద్వాసనకు సిద్ధమయ్యాడు. స్నానానికి వెళ్లిన దుర్వాసుడు, ఆయన శిష్యుల రాక కోసం ఎదురుచూస్తున్నాడు అంబరీషుడు. ఆలస్యమైతే ద్వాదశి ఘడియ దాటి వ్రతఫలం చేజారుతుంది. పండితుల సలహా మేరకు అంబరీషుడు తులసితీర్థం పుచ్చుకుని ఉద్వాసన చేయగా, అతిథి మర్యాద అతిక్రమించినందుకు ఆగ్రహించి అంబరీషుణ్ణి శపించబోయాడు దుర్వాసుడు. కానీ ధర్మ బద్ధంగా ఉద్వాసన చేసినందుకు శ్రీమహావిష్ణువు సంతోషించి దుర్వాసుడి అహంకారాన్ని అణచి వేసేందుకు సుదర్శనచక్రం ప్రయోగించాడు. దాంతో దుర్వాసుడు బ్రహ్మ, మహేశ్వరుల రక్షణ కోరాడు. చివరికి అంబరీషుని శరణువేడి చక్రఘాతం నుంచి తప్పించుకోగలిగాడు. చిత్రసేన మహారాజు ఏకాదశి దీక్ష వల్ల అడవి దొంగల బారి నుంచి బయటపడి సురక్షితంగా రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఉసిరిచెట్టు విష్ణు మూర్తికి ఇష్టమైన విడిది కనుక ఆ రోజు ఉసిరిని పూజించి, భక్తితో సేవిస్తే ముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు.
ఉప్పు రాఘవేంద్ర రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు