Viral video: సినిమా థియేటర్‌లోనూ ఆఫీస్‌ వర్క్‌.. నెటిజన్ల కామెంట్స్‌!

Viral video: థియేటర్‌లో సినిమా ప్రారంభం కావటం కోసం అందరూ ఎదురు చూస్తుంటే ఓ వ్యక్తి మాత్రం ల్యాప్‌ట్యాప్ తీసుకొని తన పని తాను చేసుకుంటున్నాడు. బెంగుళూరు సినిమా హాలులో తీసిన ఈ వీడియా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 26 Apr 2023 23:13 IST

 

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా సమయంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్‌ ఫ్రం హోం వెసులుబాటును కల్పించాయి. దీంతో చాలామంది హాయిగా ఇంట్లో ఉంటూనే ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు గమనిస్తే.. మేనేజర్‌ దగ్గరనుంచి ఎప్పడు కాల్‌ వస్తుందో, ఏ పని చేయమంటాడో తెలియదు, గడువు ముగిసేలోగా టార్గెట్లను పూర్తిచేయాలి.. ఇలా అనేక అంశాలు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. దీంతో ఎక్కడికి వెళ్లినా పనివైపే వారికి ధ్యాసపోతోంది. దీంతో చేసేదేమీ లేక ఏ నిమిషం పనిచేయాల్సి వస్తుందో తెలియక ఎక్కడికి వెళ్లినా చేతిలో ల్యాప్‌ట్యాప్‌ పట్టుకొని వెళుతున్నారు. ఇటీవల బెంగుళూరులో జరిగిన ఓ ఘటన అలాంటి పరిస్థితికే అద్దంపడుతోంది.

బెంగుళూరులో ఓ థియేటర్‌లో సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల కేరింతలతో సినిమా థియేటర్‌ దద్దరిల్లుతోంది. ఇంకా సినిమా ప్రారంభం అవ్వటానికి సమయం ఉండటంతో ఓ ఉద్యోగి  సమయం వృథా చేయటం ఎందుకు అనుకున్నాడో ఏమోగానీ.. తన వద్ద ఉన్న ల్యాప్‌ట్యాప్‌తీసి ఆఫీసు పనిలో నిమగ్నమయ్యాడు. ఈ దృశ్యాలను సినిమా హాలులోని ఓ వ్యక్తి వీడియోలో బంధించి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోని చూసిన వారు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ‘బెంగుళూరు ఐటీ కంపెనీలో పనిచేసేవారి జీవితం ఇలాగే ఉంటుంది, బెంగుళూరులో చాలామంది ఇలాగే రోడ్ల పైన కనబడతారు’ అని కొందరంటే.. మరికొందరేమో ఈ ఏడాది బెస్ట్‌ ఎంప్లాయర్‌ అవార్డు కోసం తెగ కష్టపడిపోతున్నాడంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఏప్రిల్‌ 10న పోస్ట్‌ చేయగా.. ఇప్పటివరకు 6 లక్షలమందికి పైగా వీక్షించారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని