చిట్టి బుర్రలో ఎన్ని ఎత్తులో..

పన్నెండేళ్ల వయసులో ఏ పిల్లాడైనా ఆటల్లో ఏం సాధిస్తాడు! బాగా ఆడితే స్కూల్లో ఫస్టొస్తాడు. కానీ తమిళనాడు కుర్రాడు మాత్రం మేధో క్రీడగా పేరున్న చదరంగంలో అపార నైపుణ్యంతో అబ్బురపరుస్తున్నాడు. సంచలన విజయాలతో ప్రకంపనలు...

Updated : 29 Nov 2022 13:15 IST

పన్నెండేళ్ల వయసులో ఏ పిల్లాడైనా ఆటల్లో ఏం సాధిస్తాడు! బాగా ఆడితే స్కూల్లో ఫస్టొస్తాడు. కానీ తమిళనాడు కుర్రాడు మాత్రం మేధో క్రీడగా పేరున్న చదరంగంలో అపార నైపుణ్యంతో అబ్బురపరుస్తున్నాడు. సంచలన విజయాలతో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. అత్యంత పిన్న వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగిన భారతీయుడిగా రికార్డు సృష్టించిన ఈ తమిళనాడు ఆణిముత్యం పేరు గుకేశ్‌. చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే గ్రాండ్‌మాస్టర్‌ ఘనతను సొంతం చేసుకునే సమయానికి అతడి వయసు 12 సంవత్సరాల 7 నెలల 17 రోజులు మాత్రమే. మరి మరో విశ్వనాథన్‌ ఆనంద్‌గా మన్ననలు అందుకుంటున్న ఈ చిన్నోడి నేపథ్యమేంటి? ఆటలోకి ఎలా వచ్చాడు. ఇంత చిన్నవయసులో 64 గడులపై అంత పట్టు ఎలా సంపాదించాడు? తెలుసుకుందాం పదండి!

అలా మొదలైంది..
గుకేశ్‌ తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే. వాళ్లు చెస్‌ క్రీడాకారులేమీ కాదు కానీ ఆటవిడుపు కోసం ఇంట్లో సరదాగా చెస్‌ ఆడుతుంటారు. అ పక్కనే కూర్చుని చూస్తుండేవాడు గుకేశ్‌. అతను ఆసక్తిగా ఆటను చూడ్డాన్ని గమనించిన అన్నయ్య  దినేశ్‌ ఆటకు సంబంధించి నిబంధనలు అర్థమయ్యేలా చెప్పాడు. ఆ తర్వాత గుకేశ్‌ వాళ్లతోనే కలిసి ఇంట్లో ఆడుతుండేవాడు. దీంతో ఆటపై మరింత ఇష్టం పెరిగింది. ఐతే చదరంగంలో అతడు సీరియస్‌ అడుగుపెట్టడానికి కారణం మాత్రం పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరమే. బడిలో కోచ్‌లు పిల్లలకు చిన్న చిన్న చెస్‌ పజిల్‌లు ఇచ్చేవాళ్లు. వాటిని అందరికంటే ముందు పూర్తి చేసిన వారికి పెన్నును బహుమతిగా ఇచ్చేవారు. ఆ పెన్నును గెలుచుకోవాలన్న ఉత్సాహంతో అందరికన్నా ముందు గుకేశ్‌ పజిల్‌ను పూర్తి చేసేవాడు. అలా గెలిచిన పెన్నులు ఎన్నో!  స్కూల్లో కోచ్‌ భాస్కర్‌.. అతడి ఆటను చూసి ముగ్దుడవడం అతడి కెరీర్‌కే మలుపు. ఆటలో ఉన్నత శిఖరాలకు ఎదగగలిగే సత్తా ఆరున్నరేళ్ల గుకేశ్‌లో ఉందని కనిపెట్టిన అతడు.. ఓ చెస్‌ క్లబ్‌లో చేర్పించాడు. క్లబ్‌లో ఆడడం ద్వారా మరింత నైపుణ్య సంపాదించిన గుకేశ్‌.. 2300 ఎలో రేటింగ్‌ వచ్చేంత వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రీడాకారుడు విష్ణు ప్రసాద్‌ శిక్షణలో రాటుదేలాడు. అతడికి ఎదురేలేకుండా పోయింది. తనకన్నా వయసులో చాలా పెద్ద వాళ్లను కూడా అలవోకగా ఓడిస్తూ సాగుతున్న గుకేశ్‌ కెరీర్‌లో.. అత్యంత చిన్నవయసు భారత గ్రాండ్‌మాస్టర్‌గా నిలవడం ఆరంభం మాత్రమేనన్నది చెస్‌ విశ్లేషకుల అంచనా!

ప్రపంచ ఛాంపియన్‌షిప్పే లక్ష్యం
చదరంగం విషయంలో గుకేశ్‌ చాలా సీరియస్‌గా ఉంటాడు. కానీ పాఠశాల ప్రస్తావన వస్తే మాత్రం అతడిలో చిన్నపిల్లాడు బయటికివస్తాడు. స్నేహితులతో చాలా సరదాగా ఉంటాడట. వాళ్లను ఎప్పుడూ ఆట పట్టిస్తుంటాడట. కానీ నీ ఫేవరెట్‌ సబ్టెక్ట్‌ ఏంటంటే మాత్రం.. ‘‘ఏదీ కాదు’’ అంటాడు. ఏది కఠినంగా అనిపిస్తుంది అని అడిగినా ‘‘ఏదీ లేదు’’ అంటాడు. గుకేశ్‌ మది నిండా, మనసు నిండా చెస్సే. ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడమే అతడి లక్ష్యం. ‘‘చదరంగమే నాకు సర్వస్వం. చెస్‌ను తప్ప దేన్నీ నేను సీరియస్‌గా తీసుకోను’’ అని చెబుతాడు గుకేశ్‌. నిరంతరం ఆటను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నించే గుకేశ్‌..‘ఫాలో చెస్‌’ యాప్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్ల గేమ్‌లను చూస్తుంటాడు. అలాగే చెస్‌ డాట్‌కామ్‌లో రోజూ పది గేమ్‌లు ఆడతాడు. స్కూలు, చెస్‌ తప్ప అతడికి మరో ప్రపంచం లేదు. ఎప్పుడైనా చెస్‌ నుంచి విరామం తీసుకున్నాడు అంటే.. అది మరిన్ని క్రీడలు ఆడేందుకే. క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ అంటే అతడికి ఇష్టమట. గుకేశ్‌ ఇప్పుడు ఆరో తరగతి చదువుతున్నాడు.

16 నెలల్లోనే..

2017 అక్టోబరు నాటికి గుకేశ్‌ ఎలో రేటింగ్‌ 2322. ఎలాంటి నార్మ్‌లూ లేవు. ఒక ప్రతిభావంతుడైన కుర్రాడిగానే అతడు అందరికీ తెలుసు. కానీ అద్భుత ప్రదర్శన చేసిన గుకేశ్‌ 16 నెలల్లోనే మూడు ఐఎం నార్మ్‌లు, మూడు గ్రాండ్‌మాస్టర్‌ నార్మ్‌లు సాధించాడు. రేటింగ్‌ను 2500కు పెంచుకుని అత్యంత పిన్న వయస్కుడైన భారత గ్రాండ్‌మాస్టర్‌గా ఘనత సాధించాడు. గుకేశ్‌.. కర్జాకిన్‌ తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత పిన్న వయసు గ్రాండ్‌మాస్టర్‌. గుకేశ్‌ మరో 18 రోజుల ముందు గ్రాండ్‌మాస్టర్‌ హోదాను దక్కించుకుని ఉంటే కర్జాకిన్‌ రికార్డును బద్దలు కొట్టేవాడు. ఆ 16 నెలల కాలంలో అతడు ఏకంగా 276 రేటెడ్‌ గేమ్స్‌ ఆడాడు. అగ్రశ్రేణి క్రీడాకారులే ఏడాదిలో 100 గేమ్‌లు ఆడితే అలసిపోతారు. కానీ గుకేశ్‌ ఒక్క ఏడాదిలోనే 207 గేమ్స్‌ ఆడడం అతడి దృఢ సంకల్పానికి నిదర్శనం. 16 నెలల్లో ఆడిన 30 ఈవెంట్లలో అతడు పది టోర్నీల్లో రేటింగ్‌ పాయింట్లు కోల్పోయాడు. అయినా అతడు ఏకాగ్రత కోల్పోలేదు. మరింతగా కసరత్తు చేసి వేగంగా పురోగతి సాధించాడు. నిరుడు నవంబరులో అతడు ప్రపంచ అండర్‌-12 ఛాంపియన్‌గా నిలిచాడు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని