డార్లింగ్స్‌..మీరూ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అవ్వొచ్చు!

వాళ్లంతా యూత్‌..ఫ్యాన్స్‌ కాదు.. డై హార్డ్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడూ సాహో ముచ్చట్లే..ట్విటర్‌.. ఎఫ్‌బీ.. వాట్సాప్‌.. దేంట్లోనైనా.. ప్రభా.. ప్రభా.. ప్రభాస్‌ ఫార్వార్డులే..సౌత్‌.. నార్త్‌.. అనే హద్దులు లేవు..దేశంలోని మిలీనియల్స్‌కి ఇప్పుడు తనో స్టైల్‌ ఐకాన్‌!!ఇదంతా కేవలం ఇరవైలోపు సినిమాలకే! అదెలా సాధ్యమైంది? తన స్టార్‌ ‘ఫార్ములా’ ఏంటి?తెలుసుకుంటే.. మీరూ మిస్టర్‌ పర్‌ఫెక్టే!!..

Updated : 24 Aug 2019 06:35 IST

‘స్టార్‌’ ఫార్ములా

వాళ్లంతా యూత్‌..ఫ్యాన్స్‌ కాదు.. డై హార్డ్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడూ సాహో ముచ్చట్లే..ట్విటర్‌.. ఎఫ్‌బీ.. వాట్సాప్‌.. దేంట్లోనైనా.. ప్రభా.. ప్రభా.. ప్రభాస్‌ ఫార్వార్డులే..సౌత్‌.. నార్త్‌.. అనే హద్దులు లేవు..దేశంలోని మిలీనియల్స్‌కి ఇప్పుడు తనో స్టైల్‌ ఐకాన్‌!!ఇదంతా కేవలం ఇరవైలోపు సినిమాలకే! అదెలా సాధ్యమైంది? తన స్టార్‌ ‘ఫార్ములా’ ఏంటి?తెలుసుకుంటే.. మీరూ మిస్టర్‌ పర్‌ఫెక్టే!!

‘కట్‌ అవుట్‌ని చూసి కొన్ని నమ్మేయాలి డూడ్‌’ అంటూ యువతని క్రేజీగా ఆకట్టుకున్న ప్రభాస్‌ ఇప్పుడో బ్రాండ్‌. ప్రతి తెలుగోడు గర్వించేలా జాతీయ స్థాయిలో గుర్తింపు. ప్రభాస్‌ ఫొటో కనబడితే లక్షల లైకులు.. చిన్న వీడియో విడుదలయితే కోట్లమంది జనాలు చూసే అంత వైరలిజం ప్రభాస్‌లో ఏముందీ? అసలేంటీ మానియా.. ఏంటీ ‘ప్రభ’ంజనం? ఇండస్ట్రీలోకి వచ్చినపుడేమో సోసో హీరోనే అన్నారంతా. గుక్కపట్టకుండా డైలాగ్స్‌ చెప్పలేడని ముద్ర వేశారు కొందరు. ఎప్పుడో 2002లో మొదటి సినిమా మొదలుకుని రాబోయే సాహో వరకూ తనని తానే చెక్కుకుని ఆరు అడుగుల మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అయ్యాడు. ఎంత ఎదిగినా.. ఒదిగే ఉంటున్నాడు. ఆ రెబల్‌ నడకతో జీవిత చక్రాన్ని ఎలా తిప్పాడు?

స్టైల్‌లో.. ‘ఆత్మవిశ్వాసం’
స్లో మోషన్‌లో.. సూట్‌తో.. ఓ గ్యాంగుని వెంటేసుకుని నడుస్తుంటే.. ఆ స్టైల్‌ ‘బిల్లా’!.. మరెవ్వరినీ ఆ లుక్‌లో చూడలేం. కేవలం మేకప్‌, క్యాస్టూమ్స్‌ ఉంటే చాలు స్టైల్‌ కొట్టొచ్చు అనుకుంటారు. కానీ, అవి కేవలం కట్‌అవుట్‌పై కనిపించే ఉపకరణాలు మాత్రమే. వాటితోనే స్టైల్‌ రాదు. నడకలో ఠీవి.. కళ్లలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే స్టైల్‌ సాధ్యం. అందుకే ప్రభ రెబల్‌ స్టార్‌..
ర్యాంప్‌పైనో.. రహదారుల్లోనో.. మీదైన స్టైల్‌ని ప్రదర్శించాలంటే.. మేకప్‌, కాస్టూమ్స్‌పై కాకుండా మీదైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించండి. మీరూ ఓ స్టైల్‌ ఐకానే!

 

తనదైన ‘కమ్యూనికేషన్‌’
‘డార్లింగ్‌’ అంటూ అందరితో బుజ్జిగాడులా కలిసిపోతాడు. అంత పెద్ద కట్‌అవుట్‌లో ఒదిగిపోయే చిన్న పిల్లాడే కనిపిస్తాడు. హగ్‌ చేసుకుంటాడు. ‘లవ్‌ యూ..’ అంటూ దిల్‌ సే చెబుతాడు. ఇలా చేస్తే విరోధులెవరుంటారు. అందుకే ఇతర హీరోల ఫ్యాన్స్‌ కూడా తనకీ ఫ్యాన్స్‌ అయ్యారు. దేశం గుర్తించేలా బాహుబలిని చేశారు.
నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అందుకే క్యాంపస్‌లలో.. ఆఫీస్‌లలో.. మీదైన కమ్యూనికేషన్‌తో ఆత్మీయంగా పలకరించండి. ఒదిగి ఉండండి.. వినండి. అప్పుడు చుట్టూ ఫ్రెండ్స్‌, ఫ్యాన్సే!

జగమంత కుటుంబం నాదీ.. అనే వైఖరి
తెలుగింటి వంటలు.. తెలుగోడి ఆతిథ్యం రుచి చూడాలంటే కేరాఫ్‌ అడ్రస్‌ ప్రభాస్‌ ఇల్లూ.. వాకిలే. నగరంలో షూటింగ్‌ అంటే.. ఇంటి నుంచి షూటింగ్‌ స్పాట్స్‌కి మెనూ వచ్చేస్తుంది. జగమంత కుటుంబం నాది!! అంటూ తనే వడ్డిస్తాడు.. సందడి చేస్తాడు. ఇది తనదైన యాటిట్యూడ్‌. అందుకే ప్రభాస్‌ అందరివాడు.
రిజర్వ్‌గా ఉండడం.. ఒంటరిగా తినడం.. లేనిపోని గాంభీర్యాన్ని ప్రదర్శించడం.. ఇవి కాదు యాటిట్యూడ్‌ అంటే. అందర్నీ కలుపుకుని వెళ్లడం.. కలిసి మెలిసి ఉండడం.

యూటర్న్‌.. తీసుకోలేదు
ఒకే ఒక్క సినిమా.. భారీ బడ్జెట్‌.. ఆరేళ్ల సమయం.. నమ్మాడు. అంకిత భావంతో పని చేశాడు. క్యారెక్టర్‌లోనే జీవించాడు. సక్సెస్‌ అవుతామని నమ్మాడు. అపనమ్మకంతో యూటర్న్‌ తీసుకోలేదు. ఇంకో సినిమాలో నటించలేదు. ఒప్పుకోలేదు. అందుకే దేశం మొత్తానికి రెబల్‌స్టార్‌లా పరిచయం అయ్యాడు. మళ్లీ అడుగు ఆలస్యం అయినా సాహోతో తన మార్కెట్‌ని మరింత పెంచుకున్నాడు.
చేస్తున్న పని.. ప్రాజెక్టు.. స్టార్టప్‌ ఏదైనా.. అంకిత భావంతో పని చేస్తే ఫలితం తప్పక వస్తుంది. ఓపికతో మన పని మనం చేసుకుపోవాలి. అప్పుడే విజయం వరిస్తుంది.

 

తన సిగ్గే తిరస్కారం..
నాకు బాగా సిగ్గు ఎక్కువ అంటూనే.. పొగడ్తల్ని ఒంట్లోకే కాదు.. ఇంట్లోకీ రానివ్వడు. క్లౌడ్‌నైన్‌లో కెమెరా ఇచ్చే ఇల్యూషన్‌కి తను బహుదూరం. సాటి మనిషికి, మనసుకి ఎప్పుడూ దగ్గరగా ఉండేందుకు ఇష్టపడతాడు. అందుకే ప్రభాస్‌ అందరి డార్లింగ్‌!
సిగ్గు పడడం తప్పేంకాదు. ఎందుకు సిగ్గు పడుతున్నామో తెలియాలి. అప్పుడే అదో పాజిటివ్‌ అలంకారంలా అందర్నీ దగ్గరికి చేరుస్తుంది.

అతనంటే ధైర్యం..
వందల కోట్ల బడ్జెట్‌ని ఎలాంటి అభద్రతా భావం లేకుండా నిర్మాతలు వెచ్చిస్తున్నారంటే.. ఆ ధైర్యం తనపైన.. తనకున్న మార్కెట్‌పైన.. అందుకే ఎంతో బాధ్యతగా పని చేస్తాడు. సినిమా విడుదల అయ్యేంత వరకూ ఓ శ్రామికుడిలా పని చేస్తాడు. అందుకేనేమో ఇండస్ట్రీలో నిర్మాతలంతా తనంటే ఓ ధైర్యం అని చెబుతారు.
బృందంతో కలిసి పని చేస్తున్నప్పుడు మిగతా సభ్యులకు మీరుంటే ధైర్యంగా అనిపించాలి. సోలోగా కంపెనీ నిర్వహిస్తున్నప్పుడు ఉద్యోగులకు మీరో భరోసాలా ఫీల్‌ అవ్వాలి. అప్పుడే అద్భుతాలు సాధ్యం అవుతాయి.
- ఇంకెందుకు ఆలస్యం.. ప్రభలా.. మీ ప్రతిభకి సానపెట్టి ‘సాహో’ అనిపించుకోండి!!


గల్లీలో సిక్స్‌ ఎవడైనా కొడతాడు. స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్‌ ఉంటది!


ఆటని గెలవడం ముఖ్యం కాదు..  ఆటని ఎంజాయ్‌ చేయడం ముఖ్యం.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని