నిశ్శబ్దచైతన్యం

ఈ మాట గాలిమోటార్‌ బొమ్మతో ఆడుకునే పిల్లాడు వింటాడేమో!! గాల్లో ఎగిరే విమానం వింటుందా? కానీ, ఈ యువకుడు విమానాలనే సైలెన్స్‌ ప్లీజ్‌ అంటున్నాడు. భారీ ధ్వనులు చేసే యంత్రాలను నిశ్శబ్దంగా ఉండమంటున్నాడు.వాయు కాలుష్యంతో సతమతమవుతున్న ఈ భూమిని ధ్వని కాలుష్యమూ ముంచెత్తనుందనీ.. అందుకే ఈ నిశ్శబ్ద విప్లవమని చెబుతున్నాడు. తన ప్రయోగాలతో ఆ దిశగా సఫలీకృతుడు అవుతున్నాడు. ఈ ప్రయత్నంలో ప్రతిష్ఠాత్మక రాయల్‌ అకాడమీ ఫెలోషిప్‌ అందుకున్న తెలుగు తేజం పరుచూరి చైతన్య ‘ఈ తరం’తో పంచుకున్న అనుభవాలివి..

Published : 16 Nov 2019 00:48 IST

‘ష్‌.. సైలెన్స్‌!!’

ఈ మాట గాలిమోటార్‌ బొమ్మతో ఆడుకునే పిల్లాడు వింటాడేమో!! గాల్లో ఎగిరే విమానం వింటుందా? కానీ, ఈ యువకుడు విమానాలనే సైలెన్స్‌ ప్లీజ్‌ అంటున్నాడు. భారీ ధ్వనులు చేసే యంత్రాలను నిశ్శబ్దంగా ఉండమంటున్నాడు.
వాయు కాలుష్యంతో సతమతమవుతున్న ఈ భూమిని ధ్వని కాలుష్యమూ ముంచెత్తనుందనీ.. అందుకే ఈ నిశ్శబ్ద విప్లవమని చెబుతున్నాడు. తన ప్రయోగాలతో ఆ దిశగా సఫలీకృతుడు అవుతున్నాడు. ఈ ప్రయత్నంలో ప్రతిష్ఠాత్మక రాయల్‌ అకాడమీ ఫెలోషిప్‌ అందుకున్న తెలుగు తేజం పరుచూరి చైతన్య ‘ఈ తరం’తో పంచుకున్న అనుభవాలివి..

అమెజాన్‌, ఫ్లిప్‌కార్టుల్లో మనం ఆర్డరు చేసిన మందులు, పచారీ సరుకులని ఇకపై డ్రోన్లే మన ఇంటికి తీసుకొస్తాయి. పంటచేలో విత్తనాలు చల్లే పని కూడా అవే చేస్తాయి. మనమెక్కడికన్నా వెళ్లాలంటే గంటలు గంటలు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెర్టికల్‌ టేకాఫ్‌ తీసుకునే ఎయిర్‌ ట్యాక్సీలు మన గుమ్మంలోకి వస్తాయి. వీటితో కాలుష్యం బాధ కూడా ఉండదు. ఇదంతా బాగానే ఉంటుంది కానీ వాటి నుంచి ఉత్పన్నమయ్యే ధ్వని కాలుష్యమే.. మనం ఊహించనంతగా ఉంటుంది. ఇప్పటికే మనల్ని ఇబ్బంది పెడుతున్న విమానాలు, రైళ్లు, కార్లు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న ధ్వని కాలుష్యానికి ఇక ఈ డ్రోన్‌లు, ఎయిర్‌ట్యాక్సీలు కూడా తోడయితే? ప్రతి పదిమందిలో ఒకరు బీపీ, వినికిడి, నాడీ సంబంధ, మానసిక సమస్యలతో బాధపడతారు. దీనికి పరిష్కారంగా ధ్వని కాలుష్యంపై అవగాహన కల్పించడం, విమానాలు, జెట్లు, డ్రోన్లు వంటి వాటి నుంచి వెలువడే ధ్వని కాలుష్యాన్ని తగ్గించడమే తన పరిశోధనల లక్ష్యం అంటున్నారు చైతన్య. ‘మన దేశంలో రాత్రిపూట విమానాల ల్యాండింగ్‌ సహజమైన విషయం. కానీ చాలా దేశాల్లో రాత్రి పదకొండు నుంచి తెల్లవారుజామున ఐదింటి మధ్యలో విమానాల ల్యాండింగ్‌ నిషేధం. వాటి శబ్దానికి చుట్టుపక్కల వాళ్ల నిద్ర చెడుతోంది కాబట్టి. మనమిప్పటివరకూ గాలి కాలుష్యం, నీటి కాలుష్యం గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ రానున్న కాలంలో ధ్వనికాలుష్యం ఆరోగ్యానికి అతిపెద్ద సవాల్‌ విసురుతుంది. ఇప్పటివరకూ ప్రతి ఇరవై మందిలో ఒక్కరు మాత్రమే శబ్ద కాలుష్యం కారణంగా ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి పది మందిలో ఒక్కరు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటారు..’ అనే చైతన్య.. విమానాలు, జెట్లలో వాడే ఫ్యాన్స్‌ నుంచి వెలువడే శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంపై సౌతాంప్టన్‌ యూనివర్సిటీ వేదికగా పరిశోధనలు సాగిస్తున్నారు.

విద్యార్థులకు అవగాహన...
ఎక్కువ శబ్దంతో ఇయర్‌ ఫోన్స్‌ వాడడం.. రోడ్డుమీద విచ్చలవిడిగా హారన్లు మోగించడం.. శబ్దకాలుష్యంపై మనకి అవగాహన లేదనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. మరి అవగాహన పెంచుకునేదెలా? ధ్వని కాలుష్యంపై విద్యార్థుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. అందుకే సైన్స్‌ పట్ల ఆసక్తిని కలిగించేందుకు ప్రతి నెలా ‘మీట్‌ ది సైంటిస్ట్‌’ పేరుతో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నా అంటారు చైతన్య. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ విషయంపై ఇంకా ఎక్కువ అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందనే  చైతన్య  ఐఐటీల్లో టాక్స్‌ ఇస్తున్నారు. యూనివర్సిటీల్లో చిన్నచిన్న కోర్సులని ప్రవేశపెట్టి ఇందులోని పరిశోధనా అవకాశాలని గురించి తెలియచెప్పాలనుకుంటున్నారు.


ఐదుకోట్ల రూపాయల ప్రాజెక్టు ఇది...

విమానాలు, డ్రోన్స్‌, ఎయిర్‌ట్యాక్సీలు, ఓడల్లో ఉపయోగించేవి ప్రొఫెల్లెంట్స్‌...  వీటిల్లో ఫ్యాన్స్‌ని వాడతారు. వీటి కారణంగా వాహనాలు నడిచినప్పుడు వెలువడే శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫ్యాన్లు చేసే శబ్దాన్ని ఎంతగా తగ్గిస్తే అంతగా వాహనాల సామర్థ్యం పెరగడంతో పాటు, అవి వెలువరించే కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. పక్షులు, సముద్ర జీవజాలం హాయిగా మనుగడ సాగిస్తాయి. ప్రస్తుతం చైతన్య చేస్తున్న పరిశోధన కూడా ఇదే. ‘ధ్వనికి సంబంధించిన పరిశోధనలని అకాస్టిక్స్‌ అని అంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన తర్వాత బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో అకాస్టిక్స్‌పై పరిశోధనలు చేశాను. లండన్‌లోని సౌతాంప్టన్‌ యూనివర్సిటీ ఈ అకాస్టిక్స్‌ పరిశోధనలకు పెట్టింది పేరు. అందుకే కేంబ్రిడ్జ్‌లో వచ్చిన అవకాశాన్ని కాదనుకుని సౌతాంప్టన్‌లో ఫ్యాన్స్‌ వెలువరించే ధ్వని కాలుష్యంపై పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధనలు చేశా. అంతకుముందు కొంతకాలం పాటు జీఈలో ఉద్యోగం చేశాను. మోటార్‌ వెహికిల్స్‌లో ఒక మార్పు జరిగి అవి రోడ్డు మీదకి రావడానికి రెండేళ్లు పడుతుంది. అదే విమాన ఇంజిన్లలో మార్పులు జరిగి బయటకు రావాలంటే పదిహేను సంవత్సరాలు పడుతుంది. నేను మార్పులు చేసిన ఇంజిన్లు మరికొంతకాలంలో  అందుబాటులోకి వస్తాయి. ఇంత వరకూ నేను చేసిన పరిశోధనల్లో ఏడింటికి పేటెంట్‌ హక్కులు లభించాయి. అందులోని కొన్నింటిని రోల్స్‌ రాయిస్‌ సంస్థ అమలు పరిచే ఆలోచనలో ఉంది. ఇక రాయల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ విషయానికి వస్తే... ప్రతి యూనివర్సిటీ నుంచి మూడు దరఖాస్తులు మాత్రమే రాయల్‌ అకాడమీ స్వీకరిస్తుంది. కఠినమైన వడపోతల తర్వాత నాకు రాయల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ లభించింది. దాంతోపాటే నేను చదువుకున్న సౌతాంప్టన్‌లోనే లెక్చరర్‌ ఉద్యోగం కూడా. ఫెలోషిప్‌ విలువ ఐదుకోట్ల రూపాయలు. రాయల్‌ అకాడమీ, యూకే ప్రభుత్వాల సహకారంతో ఈ ప్రాజెక్టు నడుస్తుంది. ఐదేళ్ల పాటు ఈ పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. ఇవి విజయవంతం అయితే ఫ్యాన్లు ఉపయోగించే వాహనాలు వెలువరించే కాలుష్యం బాగా తగ్గుతుంది. డ్రోన్లు, ఎయిర్‌ ట్యాక్సీలు వంటివి తక్కువ శబ్దాలని వెలువరిస్తాయి. పరిశ్రమల్లో వాడే ఫ్యాన్ల కారణంగా కార్మికులకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. పవన విద్యుత్‌ తయారీలో ఉండే శబ్ద కాలుష్యం తగ్గుతుంది. ఒత్తిడి, మానసిక సమస్యలు, బీపీ, నిద్రలేమి, గర్భస్రావాలు తగ్గుతాయి’ అని చెప్పుకొచ్చారు చైతన్య.

- శ్రీసత్యవాణి గొర్లె


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని