ర్యాపాడితే... లోకమే ఆడదా!

ఏడుగురు యువకులు.. భిన్న నేపథ్యాలు... అభిరుచి, ఆసక్తి సంగీతమే... ఉదయం ఉద్యోగాలు.. సాయంత్రాలు సరిగమల సాధన... మ్యూజిక్‌తో జట్టు కట్టారు.. ది రైవల్‌ మాబ్‌ ట్రూప్‌తో ర్యాపాడేస్తున్నారు... సామాజిక వేదికలే వారికి ప్రమోషన్‌ టూల్స్‌. తెలుగు రాష్ట్రాల్లో వందలకొద్దీ ప్రదర్శనలిచ్చి కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్నారు.....

Updated : 20 Mar 2021 06:28 IST

ఏడుగురు యువకులు.. భిన్న నేపథ్యాలు... అభిరుచి, ఆసక్తి సంగీతమే... ఉదయం ఉద్యోగాలు.. సాయంత్రాలు సరిగమల సాధన... మ్యూజిక్‌తో జట్టు కట్టారు.. ది రైవల్‌ మాబ్‌ ట్రూప్‌తో ర్యాపాడేస్తున్నారు... సామాజిక వేదికలే వారికి ప్రమోషన్‌ టూల్స్‌. తెలుగు రాష్ట్రాల్లో వందలకొద్దీ ప్రదర్శనలిచ్చి కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్నారు.  

మ్యూజిక్‌ అంటేనే మ్యాజిక్‌. మంత్రం వేసినట్టు మనసును మీటుతుంటే ఎవరైనా ఆ సరిగమల సంద్రంలో ఈదులాడాల్సిందే. అందులోనూ ర్యాప్‌ అంటే కుర్రకారు కాలి మునివేళ్లపై నిల్చుంటారు. పాశ్చాత్య ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ క్రేజీ జోనర్‌తో యువత నాడి పట్టేస్తున్నారు మన తెలుగు ర్యాపర్స్‌.
మొదలైందిలా
హైదరాబాదీ అరుణ్‌ ఐటీ ఉద్యోగి. బడికెళ్లే రోజుల నుంచే వెస్ట్రన్‌ మ్యూజిక్‌, ర్యాప్‌ కల్చర్‌పై అమితాసక్తి. దాన్నే కెరీర్‌గా మలుచుకోవాలనుకున్నాడు. దీంట్లో భవిష్యత్తు ఉండదని తల్లిదండ్రులు వద్దన్నారు. ముందు ఏదైనా ఉద్యోగంలో స్థిరపడ్డాకే మ్యూజిక్‌ వైపు వెళ్లమన్నారు. ఇష్టమైన ర్యాప్‌ కోసం కష్టపడి ఉద్యోగం సంపాదించి ఆపై తన ప్యాషన్‌ని కొనసాగిస్తున్నాడు అరుణ్‌. తనతోపాటు బృందంలో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. కానీ అందరి అభిరుచి, యాటిట్యూడ్‌ సంగీతం ఒక్కటే. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, యూట్యూబ్‌లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరికొకరు పరిచయమై ట్రూప్‌గా ఏర్పడ్డారు. ఏడుగురు సభ్యుల్లో ఐదుగురు ర్యాపర్స్‌, ఇద్దరు బీట్‌ ప్రొడ్యూసర్స్‌. ఒక్కొక్కరిదీ ఒక్కో బాణి, ఒక్కో స్టైల్‌. ఛాపర్‌ ఫ్లో, లో ఫై, హిప్‌హాప్‌, ట్రాప్‌.. ఇలా పలురకాల జోనర్స్‌లో ర్యాప్‌ పలికిస్తూ ఒక బ్యాండ్‌గా మొదలై రెండేళ్లుగా ర్యాపాడేస్తున్నారు. లిరిక్స్‌ రాసుకోవడం, షూట్‌, ఎడిటింగ్‌, ప్రమోషన్‌ అన్నీ వీళ్లే చూసుకుంటారు.

అవాంతరాలు దాటుకొని
ఈ బ్యాండ్‌ సభ్యులంతా సంగీత నేపథ్యం లేని కుటుంబాలకు చెందినవాళ్లే. ఇతర ఆర్టిస్టులను చూసి, వాళ్ల నుంచి స్ఫూర్తి పొంది సొంతంగా ర్యాప్‌పై పట్టు సాధించారు. తర్వాత ర్యాప్‌ సంగీత ప్రియులను చేరుకోవడం మరో పెద్ద టాస్క్‌లా మారింది. సామాజిక మాధ్యమాల ద్వారా తమ ప్రతిభ ప్రదర్శించుకోవడానికి వేదిక సంపాదించుకోగలిగారు. ఆపై కొత్త బాణీలు సమకూర్చుకోవడానికి, తమదైన బీట్‌ సృష్టించడానికి నిరంతరం కష్టపడ్డారు. వారాంతాలతోపాటు ఏమాత్రం సమయం దొరికినా ప్రాక్టీస్‌ చేసేవారు. సొంతంగా లిరిక్స్‌ రాసుకునేవారు. మ్యూజిక్‌ పరికరాల కొనుగోలు, ఆల్బమ్స్‌ తయారు చేయడానికి జీతాల్లోంచి కొంత మొత్తం పక్కన పెట్టేవాళ్లు. ఇవన్నీ పూర్తిచేసిన తర్వాత 2020 కొత్త ఏడాది వేడుకల్లో తొలి ప్రదర్శన ఇచ్చారు. తర్వాత ప్రతి ఒక్కరూ ఒక పెన్‌ నేమ్‌ పెట్టుకొని ఆ పేరుతోనే ర్యాప్‌ చేస్తున్నారు. అలా ఇప్పటికి వందలకొద్దీ ప్రదర్శనలు ఇచ్చారు. యూట్యూబ్‌, ఇతర ఆడియో స్ట్రీమింగ్‌ వేదికల్లో ఇప్పటివరకు ముప్పై ఒక్క ర్యాప్‌ సాంగ్స్‌ విడుదల చేశారు.

అరుణ్‌- ఏజే: చిన్నప్పట్నుంచే పాశ్చాత్య సంగీతమంటే ఇష్టం. నాతోపాటే ఆ క్రేజ్‌ పెరిగింది. ఐటీ అనలిస్టుగా ఉద్యోగం సాధించాక మ్యూజిక్‌పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టా. మిత్రుడు అఖిల్‌తో కలిసి రైవల్‌ మాబ్‌ ప్రారంభించా.  
అఖిల్‌ - ఏబీ: ర్యాప్‌ని ఎమోషనల్‌గా ఫీల్‌ అయితే జీవితాంతం వదల్లేం. వారాంతాల్లో గ్రూపు సభ్యుల వీలును బట్టి బాణీలు కట్టి ట్యూన్‌ చేస్తున్నాం. మా ట్యూన్స్‌కి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందాయి. టాలీవుడ్‌ సినిమాలకు ర్యాప్‌ చేయాలన్నది మా కల.
ఎఫ్య్రామ్‌ - ఇన్‌ సేనిటీ: నోరేసుకొని వాగేయడం, బీట్‌తో ఊగేయటం ర్యాప్‌ కాదు. సంగీతం, సాహిత్యం సమపాళ్లలో పేర్చి రెండింటినీ ఒక రిథంలో కూర్చటమే ర్యాప్‌.
అశ్విన్‌ - రావన్‌: ర్యాప్‌లో ఒక్కో స్టైల్‌ ఒక్కో ఎమోషన్‌ని పలికిస్తుంది. సొంత కథలు, అనుభవాలు, అవమానాలు, జ్ఞాపకాలు.. ఈ భావాలకే బీట్‌ కట్టేసి ర్యాప్‌ పాడేస్తాం.  
సాయికిరణ్‌- మ్యాడ్‌ స్కల్‌: డిగ్రీ విద్యార్థిని. పాశ్చాత్య సంగీతం అన్నా, హిప్‌హాప్‌ కల్చర్‌ అన్నా ప్రాణం. ఈ సంస్కృతిని మన స్థానికతకు అన్వయించి జనాల్లోకి తీసుకెళ్తున్నాం.

మ్యూజిక్‌ ఈవెంట్‌లు, కాలేజీ ఉత్సవాలు, కార్పొరేట్‌ ఫెస్టివల్స్‌, యువజనోత్సవాలు, ఐటీ కంపెనీలు.. ఇవే వీరి అడ్డాలు. కొత్త సంవత్సర వేడుకలు, పండగలు, ప్రత్యేక సందర్భాలు.. ప్రతిభా ప్రదర్శనకు వేదికలు.

- పత్తిపాక ప్రవీణ్‌కుమార్‌, ఈటీవీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు