చాట్‌ అయినా.. మాట అయినా స్టిక్కరే!

చాట్‌ అయినా, మాటైనా.. సూటిగా, సుత్తి లేకుండా ఉంటేనే యువతకి ఇష్టం... అందుకే.. మొన్నటిదాకా పొట్టిపదాల స్లాంగ్‌ని వాడారు... నిన్నేమో ఎమోజీలు ఇష్టపడ్డారు... తాజాగా స్టిక్కర్లపై మోజు పడుతున్నారు... ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టా, ట్విటర్‌.. మాధ్యమం ఏదైనా సరే! చాట్లాటలకే కాదు.. ఈ ట్రెండ్‌ సృష్టికర్తలకు కాసులు కూడా కురిపిస్తోంది....

Published : 02 Oct 2021 01:10 IST

చాట్‌ అయినా, మాటైనా.. సూటిగా, సుత్తి లేకుండా ఉంటేనే యువతకి ఇష్టం... అందుకే.. మొన్నటిదాకా పొట్టిపదాల స్లాంగ్‌ని వాడారు... నిన్నేమో ఎమోజీలు ఇష్టపడ్డారు... తాజాగా స్టిక్కర్లపై మోజు పడుతున్నారు... ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టా, ట్విటర్‌.. మాధ్యమం ఏదైనా సరే! చాట్లాటలకే కాదు.. ఈ ట్రెండ్‌ సృష్టికర్తలకు కాసులు కూడా కురిపిస్తోంది.

చేంతాడంత డైలాగులు.. గంటలకొద్దీ టైపింగ్‌ యువతకి ఏమాత్రం నచ్చవు. ఇన్‌స్టంట్‌ కాఫీలా.. టూ మినిట్స్‌ నూడిల్స్‌లా క్షణాల్లో తాడోపేడో తేలాలి. వాళ్లు చెప్పదలుచుకున్నది ఎదుటివాళ్ల మనసును తాకాలి. స్టిక్కర్స్‌ అందుకు దారి చూపించాయి. యువత వీటికి ఫిదా అవుతోంది.

ఎందుకింత మోజు?
తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, తమిళ్‌.. పలు భాషల్లో విడుదలైన చిత్రాల్లోని ఫేమస్‌ డైలాగ్స్‌, బాగా పేలిన రాజకీయ నాయకుల మాటలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయినవే ఈ స్టిక్కర్లకు ఊపిరి. వీటికి సరదా హావభావాల ఫొటోలు, జిఫ్‌లు, నిడివి తక్కువ ఉన్న వీడియోలు జోడిస్తారు. యాప్‌లుగా మార్చి గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ ఐవోఎస్‌లో పెట్టేస్తుంటారు. వివిధ చిత్రాల్లో సందర్భానుసారం కమెడియన్స్‌ పలికించిన కోపం, నవ్వు, ఏడుపు, బాధ, అమాయకత్వం.. ఇవన్నీ స్టిక్కర్స్‌కి ముడిసరుకే. లాక్‌డౌన్‌లో సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లో
ciam very sorry.. you have to change your attitudee’, ‘ఏం చేద్దాం అంటావ్‌ మరి’ అన్న డైలాగులు బాగా పాపులరై స్టిక్కర్లుగా మారాయి. బాలకృష్ణ, మహేశ్‌బాబు, విజయ్‌ దేవరకొండ, వెంకటేశ్‌, ప్రభాస్‌, సమంత, రష్మిక మందన్నా, సునీల్‌, ఎం.ఎస్‌. నారాయణ ఫేమస్‌ డైలాగులు, ఎక్స్‌ప్రెషన్లు అలరిస్తున్నాయి. ఇవి యానిమేటెడ్‌ రూపంలో కూడా రావడం మరో ఆకర్షణ. వీటిని వాడుతున్నవాళ్లే కాదు.. సృష్టికర్తలూ అత్యధికం కుర్రాళ్లే. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఇలాంటి యాప్‌లు వందల్లో ఉన్నాయి. తెలుగులోనే పదిహేనుకుపైగా అందుబాటులోకి వచ్చాయంటే వీటి ఫాలోయింగ్‌ అర్థం చేసుకోవచ్చు. మనకు కావాల్సిన భావోద్వేగాలతో నిడివి తగ్గేలా సూటిగా ఉండటమే కాదు.. వీటిని చూడగానే మొహంపై నవ్వులు పూయడం, ఒత్తిడి మాయమవడం వీటికున్న బలం.


కాసుల ఖజానా

స్టిక్కర్‌ యాప్‌ రూపకర్తలకు ఆదాయం దండిగానే ఉంటోంది. వీటిని వాడుతున్నప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్‌ ద్వారా కొంత డబ్బులు వస్తాయి. అలాగే కొత్త సినిమాలు విడుదలైనప్పుడు ప్రమోషన్‌ కోసం స్టిక్కర్స్‌ రూపొందించమని నిర్మాతలు అడుగుతారు. ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో కూడా కాసులు కురిపించుకోవచ్చు.


సొంతంగా...

సినిమా, రాజకీయ నాయకులవే కాదు.. మన ఫొటోలతోనే  స్టిక్కర్స్‌ రూపొందించుకునే ట్రెండ్‌ పెరుగుతోంది. కొందరు యాప్‌ క్రియేటర్లు ప్రత్యేకించి ఇలాంటి వాళ్ల కోసమే ఓ సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. ఇందులో మన, మన ఫ్రెండ్‌ ఫొటోని సెలెక్ట్‌ చేసి, కావాల్సిన పరిమాణంలో క్రాప్‌ చేసి ఊతపదాలు, డైలాగులను జత చేస్తే సరి. మీ చాట్‌ సంభాషణకు ఇంకాస్త సరదాని జత చేసినట్టే. ఇలాంటి వాటిలో ఉచితం, పెయిడ్‌ రెండు రకాలున్నాయి.


భార్య సలహాతో..

2018 అక్టోబరు నుంచి వాట్సాప్‌ స్టిక్కర్స్‌ని సపోర్ట్‌ చేయడం మొదలుపెట్టింది. అప్పట్నుంచే ఈ ట్రెండ్‌ మొదలైందని చెప్పొచ్చు. మొదట్లో వాట్సాప్‌కి సంబంధించినవే అందుబాటులో ఉండేవి. తర్వాత ఏపీఐ అభివృద్ధి చేయడంతో థర్డ్‌పార్టీ స్టిక్కర్లూ వాడుకోవడానికి వీలు కుదిరింది. అప్పుడు నేను టోక్యోలో ‘వైబర్‌’లో ఉద్యోగం చేస్తున్నా. మాది ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ కంపెనీ. మా సంస్థ స్టికర్స్‌ తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాత నేనూ సొంతంగా ‘స్టిక్కర్‌ బాబాయ్‌’ ప్రారంభించా. తెలుగులో మాదే తొలి యాప్‌. విడుదలైన వారంలోనే లక్ష డౌన్‌లోడ్స్‌ అయ్యాయి. తర్వాత ఇండియాలోనే టాప్‌ యాప్‌లలో ఒకటిగా నిలిచింది. నా భార్య తన స్నేహితులతో చాట్‌ చేస్తున్నప్పుడు మూవీ క్లిప్‌లు స్క్రీన్‌షాట్‌ తీసి పంపిస్తుండేది. వాటిని చూసినప్పుడు మాటల సందర్భానికి తగ్గట్టుగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఉండే సినిమా స్టిక్కర్లు ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది. అదేసమయంలో వాట్సాప్‌ సపోర్ట్‌ చేయడంతో నేను రంగంలోకి దిగా. నేను కంటెంట్‌ తయారు చేస్తే, నా భార్య డిజైన్‌ చేస్తుంది. ఇద్దరం కలిసి కోడ్‌ రాస్తాం. అప్‌డేట్‌ చేస్తాం. వారాంతాల్లోనే ఇదంతా కొనసాగుతుంది.

- తరుణ్‌ కూరపాటి, స్టిక్కర్స్‌ బాబాయ్‌ రూపకర్త


రూ.2 వేలతో మొదలెట్టాం

అంతకుముందు మేం ‘బాబు బద్దాం’ పేరుతో మీమ్స్‌ చేశాం. మంచి పేరొచ్చింది. దాంతో కొత్తగా వచ్చిన స్టిక్కర్స్‌నీ ప్రయత్నించాలనుకున్నాం. యాప్‌ రూపొందించే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డాం. బగ్స్‌ వచ్చినప్పుడు వేగంగా స్పందించాల్సి వచ్చేది. యాప్‌పై ఎక్కువ లోడ్‌ పడ్డప్పుడు హ్యాంగ్‌ అయ్యేది. వీటన్నింటినీ సరిదిద్దాం. మా స్టిక్కర్లతో వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టుకునేలా ‘స్టేటస్‌ డౌన్‌లోడర్‌’ ఫీచర్‌ తీసుకొచ్చాం. ఇదంతా పూర్తైన కొన్నాళ్లకు లక్షా యాభైవేల డౌన్‌లోడ్స్‌ అయ్యాయి. కానీ మేం చేసిన చిన్న తప్పిదంతో యాప్‌ మొత్తం ప్లేస్టోర్‌ నుంచి తొలగించారు. మళ్లీ జీరో నుంచి ప్రారంభించాం. మూడు నెలలదాకా ఆదాయం లేదు. దాన్ని అధిగమించి జనాల్లోకి వచ్చాం. రెండువేల రూపాయలతో మొదలైన మా యాప్‌తో నెలకు రెవెన్యూ కూడా బాగానే వస్తుంది. ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌లో 8లక్షలకు పైగా డౌన్‌లోడ్స్‌ అయ్యాయి. సృజనాత్మకంగా ఆలోచించడం, సాఫ్ట్‌వేర్‌ పరిజ్ఞానం, సినిమాలపై పట్టు, కొత్తగా డిజైన్‌ చేయగలగడం.. ఇవి తెలిస్తే స్టిక్కర్లు సక్సెస్‌ అవుతాయి. మత్తు వదలరా, మీకు మాత్రమే చెబుతా, ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలకు మేం ప్రమోషన్‌ కూడా చేశాం. 

- హరి చీర్ల, స్టిక్కర్‌ రాజా

- తమ్మా తేజస్విని మణిమాల, ఈనాడు డిజిటల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు