నిబిడాశ్చర్యంతో నింగి వైపు!

ఆకాశం... ఓ అనూహ్యం... ఓ అద్భుతం... అంతులేని ఆ నిశీథిలో దాగిన రహస్యాలెన్నో... అనంత ఆశ్చర్యాల విశ్వంలోకి తొంగిచూడాలని ఎవరికుండదు? ఖగోళ శాస్త్రవేత్తలకు మాత్రమే ఆ అవకాశం సొంతమా?  కాదంటోంది ఆ మిత్ర బృందం...  ఆసక్తి ఉండాలేగానీ అద్భుతాలను మీరూ శోధించవచ్చంటోంది ఆ ఆస్ట్రోక్లబ్‌..గుర్తుందా.. చిన్నప్పుడు అమ్మమ్మ ...

Updated : 28 Dec 2018 21:42 IST

నిబిడాశ్చర్యంతో నింగి వైపు!

ఆకాశం... ఓ అనూహ్యం... ఓ అద్భుతం... అంతులేని ఆ నిశీథిలో దాగిన రహస్యాలెన్నో... అనంత ఆశ్చర్యాల విశ్వంలోకి తొంగిచూడాలని ఎవరికుండదు? ఖగోళ శాస్త్రవేత్తలకు మాత్రమే ఆ అవకాశం సొంతమా?  కాదంటోంది ఆ మిత్ర బృందం...  ఆసక్తి ఉండాలేగానీ అద్భుతాలను మీరూ శోధించవచ్చంటోంది ఆ ఆస్ట్రోక్లబ్‌..

గుర్తుందా.. చిన్నప్పుడు అమ్మమ్మ ఒళ్లో పడుకుని ఆకాశంవైపు చూస్తున్నప్పుడో, ఆరుబయట మడతమంచం వేసుకుని తీరిగ్గా నింగిలోకి తొంగిచూసినప్పుడో ఆకాశం నిండా గుంపులుగుంపులుగా నక్షత్రాలే కనిపించేవి. అమావాస్య రాత్రుల్లో అయితే మరీను! అదిగో ‘పిల్లల కోడి’ అంటే అదిగో ‘తరాజు’ అనేవాళ్లం. మరి ఆ నక్షత్రాలన్నీ కళ్లలో ఒత్తులు వేసుకుని చూసినా మనకిప్పుడు కనిపించట్లేదెందుకని? ‘అవన్నీ అక్కడే ఉన్నాయి. కానీ కాంతి కాలుష్యానికి గురై.. మన కంటికి కనిపించడం లేదంతే. ముఖ్యంగా మన వీధుల్లో వాడే శక్తిమంతమైన స్ట్రీట్‌ లైట్లు, వాహనాల లైట్ల కారణంగా ఆకాశం మనకి నారింజ రంగులో కనిపిస్తుంది. అదే ఎటువంటి కృత్రిమ కాంతీ చొరబడని చిమ్మచీకటి ప్రాంతాల్లోకో, కారడవుల్లోకో వెళ్లి చూడండి. ఆకాశం నిండా అద్భుతాలే కనిపిస్తాయి. ఎటువంటి పరికరాలు లేకుండా కొన్ని గ్రహాలని నేరుగా చూడొచ్చు.  మనసుండాలే కానీ ఆకాశంలోని అద్భుతాలను అందరూ ఆస్వాదించవచ్చంటున్నారు ఆస్ట్రో ఫోటోగ్రాఫర్‌గా రాణిస్తున్న సతీష్‌పొన్నాల. ఆకాశంలోని ఆ అద్భుతాలని అందరికీ  చూపించడానికి, చిత్రాలుగా బంధించడానికి, ఆసక్తి ఉన్నవారికి ఆ విషయాలు తెలియచేయడానికి ఖగోళశాస్త్రంపై ఆసక్తి ఉన్న భరద్వాజ్‌, వెంకట్‌ పోలాన, శ్రీనివాస్‌ అల్లాడ, శివాజీలతో కలిసి హైదరాబాద్‌ ఆస్ట్రానమీ క్లబ్‌ని ప్రారంభించారు.

నిబిడాశ్చర్యంతో నింగి వైపు!

అద్భుతాలు అలా మొదలు! 
ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సతీష్‌పొన్నాలకి ఆరేళ్ల క్రితమే ఆస్ట్రో ఫొటోగ్రఫీపై ఆసక్తి మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆధునిక పరికరాలతో ఖగోళ చిత్రాలు తీయడంలో వివిధరకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు..‘నేను చదివింది కంప్యూటర్‌ సైన్స్‌. ఐటీ ఉద్యోగంలో స్థిరపడినా ఖగోళ విషయాలు మాత్రం ఎప్పటికప్పుడు నాలో ఆసక్తి రేపుతూనే ఉండేవి. అవి తెలుసుకోవడం కోసం ఆన్‌లైన్‌ మ్యాగజైన్లు చదువుతూ ఉండేవాడిని. వాటిల్లో కనిపించే చిత్రాలు మొదట్లో నాసా తీసినవేమో అనుకునేవాడిని. కానీ తర్వాత తెలిసింది అవి నాసా తీసినవి కావు నాలాంటి ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు తీసినవే అని. ఆశ్చర్యం అనిపించింది. కానీ ఎలా? మొదట్లో 114 ఇ9 టెలిస్కోప్‌తో పరిశీలించడం, మామూలు డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాతో చిత్రాలు తీయడం చేసేవాడిని. ‘లాంగ్‌ ఎక్స్‌పోజర్‌ ఫొటోగ్రఫీ’ అనే టెక్నిక్‌ని వాడి చిత్రాలు తీసేవాడిని. ఇది కొంచెం క్లిష్టమైన ప్రక్రియే అయినా నాలో మరికొంచెం ఆసక్తి పెరిగింది. వీటి కోసం ప్రత్యేకమైన కెమెరాలుంటాయన్న సమాచారం చెప్పడానికి కూడా మొదట్లో ఎవరూ లేరు. ఆన్‌లైన్‌లో సొంతంగా సమాచారం సేకరించాను. గెలాక్సీలు, పాలపుంతల, నెబ్యులా వంటివాటి చిత్రీకరణపై దృష్టి పెట్టాను. ఈ గెలాక్సీలు చిత్రీకరించడానికి ప్రత్యేకమైన కెమెరాలతోపాటు. ట్రాకర్‌ అనే పరికరం అవసరం ఉంటుంది. మన సౌరమండలాన్ని దాటి కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలను చిత్రీకరించడానికి ప్రత్యేకమైన పరికరాలుంటాయి. ఈ మహా విశ్వంలో ఏ వస్తువూ దాని స్థానంలో అది స్థిరంగా ఉండదు. కాంతి సంవత్సరాల వేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి. కెమెరా దాన్ని ఒడిసిపట్టాలంటే భూమి వేగంతో సమానంగా పరిభ్రమిస్తూ చిత్రాన్ని తీయాలి. దీనికోసమే ట్రాకర్‌ కావాలి. దీని ఖరీదూ ఎక్కువే. లక్షల్లో ఉంటుంది. ఈ ట్రాకర్‌ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నా. నిజానికి విజువల్‌ ఆస్ట్రానమీకి అంటే ఖగోళంలో ఏం జరుగుతుందో పరిశీలించడానికి ఇంత ఖరీదైన పరికరం అవసరం లేదు. టెలిస్కోప్‌ల సాయంతోనూ చూడొచ్చు. కానీ కాంతి సంవత్సరాల దూరంలో క్షణకాలం పాటు మాత్రమే ఉండే అద్భుతాన్ని బంధించడానికి మాత్రం శక్తిమంతమైన కెమెరాలు అవసరమవుతాయి. వీటి కోసం దాదాపు పదిలక్షల రూపాయలు ఖర్చు చేశా. దీంతో వచ్చే ప్రయోజనం ఏంటి అని మీరు అనొచ్చు. ఔత్సాహికులకు ఖగోళశాస్త్రం పట్ల అవగాహన తీసుకురావడమే. త్వరలో బడి పిల్లలకు వీటితో వర్క్‌షాపులు నిర్వహించాలనే ఆలోచనా ఉందని అంటున్నారు సతీష్‌. టోలీచౌకీలో తన డాబాపైన ఓ చిన్న గదిలాంటి అబ్జర్వేటరీని నిర్మించుకున్నారు సతీష్‌. ఈ గది పైభాగం మనం కావాలనుకున్నప్పుడు రోల్‌ అయి ఆకాశాన్ని ఓ కాన్వాస్‌ తెరలా ఆవిష్కరిస్తుంది. గది మధ్యలో ఎటుకావాలంటే అటు తేలిగ్గా తిప్పుకునేలాంటి అధునాతన టెలిస్కోప్‌. మామూలుగా దూరాలను వీక్షించే టెలిస్కోప్‌తో పోలిస్తే.. దీని ఫోకల్‌లెంగ్త్‌, లెన్స్‌ సామర్థ్యం చాలా ఎక్కువ. ఇంతకీ ఇవన్నీ ఎందుకూ అంటే ఆకాశపు తెరపై ఆవిష్కృతమయ్యే ఖగోళ అద్భుతాలని కెమెరా కంటితో ఒడిసిపట్టడానికే.

వీళ్లంతా ఏం చేస్తారంటే..?

నిబిడాశ్చర్యంతో నింగి వైపు!

ఫ్రెండ్స్‌ వాతావరణం అనుకూలంగా ఉంది. ఈ వారాంతంలో మియూపూర్‌లోని మన మిత్రుడి ఇంట్లో హాజరవుదాం. మనం ఎప్పుటినుంచో చూడాలనుకుంటున్న పాలపుంతని ఈ రోజు చూస్తున్నాం. అందరూ సిద్ధంగా ఉండండి. ఇలా ఈ క్లబ్‌ సభ్యులంతా కలిసి ఒకరితో ఒకరు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. ‘మేమంతా కలిసి వారాంతాల్లో నగర శివారు ప్రాంతాలు మొదలుకుని దూరప్రాంతాలు, అడవులు వరకు వెళ్లి ఆ వింతలని స్వయంగా వీక్షిస్తుంటాం’ అంటున్నారు సతీష్‌. ముప్ఫైమంది సభ్యులున్న ఈ ‘హైదరాబాద్‌ ఆస్ట్రానమీ క్లబ్‌’ సభ్యులు వారాంతాల్లో తమ చిత్రీకరణకు అనువుగా ఉండే ప్రాంతాలకు వెళతారు. ‘మబ్బులు లేకుండా ఆకాశం నిర్మలంగా ఉండి, చీకటిగా ఉన్న రోజులు ఫొటోగ్రఫీకి అనువుగా ఉంటాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు చాలా అనువుగా ఉంటాయి.  ‘మేమింతవరకూ వికారాబాద్‌, మియాపూర్‌, పోచారం, శ్రీశైలం, మెదక్‌, రోళ్లపాడు, మారేడుమిల్లి ప్రాంతాల్లో చిత్రీకరించాం. కాస్తంత ఓపికగా నిరీక్షించామా.... నక్షత్ర కూటములు, రంగురంగుల పాలపుంతలు, ఒక్కటేంటి విశ్వంలో అంతులేని అద్భుతాలని చూసి మురిసిపోవచ్చు’ అంటారు క్లబ్‌ సభ్యులు.. ఆసక్తి ఉన్నవారు మాతోపాటూ రావచ్చు అంటున్నారు సతీష్‌.  ఈ ఫొటోలని చూడాలనుకునే వారు వెబ్‌సైట్‌, ఫేస్‌బుక్‌లో’ చూడొచ్చని చెబుతారాయన.
- సత్యవాణి గొర్లె

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు