దేశ సేవకి దూరమైనా..!

2019 మే 19న ఆఫ్రికా ఖండంలోని 5,895 మీటర్ల ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని, ఆగస్టు 8న యూరప్‌ ఖండంలోని 5,643 మీటర్ల ఎత్తయిన ఎల్‌ బ్రోజ్‌ పర్వతాన్ని అధిరోహించాడు...

Updated : 07 Mar 2020 04:07 IST

* 2019 మే 19న ఆఫ్రికా ఖండంలోని 5,895 మీటర్ల ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని, ఆగస్టు 8న యూరప్‌ ఖండంలోని 5,643 మీటర్ల ఎత్తయిన ఎల్‌ బ్రోజ్‌ పర్వతాన్ని అధిరోహించాడు.
* కానిస్టేబుల్‌ విధుల్లోనూ తనదైన శైలిలో రాణిస్తూ మూడు సార్లు జిల్లా పాలనాధికారి, రెండు సార్లు తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు పొందాడు.
చిన్న వయసులోనే దేశానికి సేవ చేయాలనుకున్నాడు..


అంతేనా.. ఎక్కలేనంత ఎత్తు నుంచి దేశాన్ని సగర్వంగా చూడాలనుకున్నాడు.. కానీ, అనుకోని ప్రమాదం..
దేశ సేవకి, కన్న కలకీ దూరం చేద్దామని చూసింది.
అయినా.. పట్టు పదల్లేదు. ఆబ్కారీశాఖలో కానిస్టేబుల్‌ అయ్యాడు.. రెండు పర్వతాలను అధిరోహించాడు. అతనే ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు’ సొంతం చేసుకున్న లెంకల మహిపాల్‌రెడ్డి..

మహిపాల్‌ తండ్రి సింగరేణిలో పనిచేస్తారు. 2004లో ఇంటర్‌ పూర్తికాగానే మహిపాల్‌ భారత సైన్యంలో చేరాడు. రాజస్థాన్‌, తమిళనాడు, జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రాలలో యుద్ధ ట్యాంకర్‌ టి-72కి డ్రైవర్‌, గన్నర్‌గా పనిచేశాడు. కశ్మీర్‌లో ఉన్న సమయంలోనే ట్రెక్కింగ్‌పై అతడికి ఆసక్తి కలిగింది. అప్పుడే ప్రసిద్ధ పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు గురించి తెలుసుకున్నాడు. గిన్నిస్‌ రికార్డుతో దేశానికి ఖ్యాతి తీసుకొచ్చిన మస్తాన్‌బాబును స్ఫూర్తిగా తీసుకుని పర్వతారోహణ దిశగా అడుగులేశాడు. సైనికుడిగా ఉన్న సమయంలో అనుకోని ప్రమాదం కారణంగా భుజానికి గాయమైంది. ఆర్మీ నుంచి బయటకు రావాల్సివచ్చింది. గాయానికి చికిత్స తీసుకుంటూ ఆత్మస్థైర్యంతో బలహీనతలను అధిగమించాడు. అనతికాలంలోనే తెలంగాణ ఆబ్కారీ శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఉన్నతాధికారుల ప్రోద్బలం, తోటి ఉద్యోగుల సహకారంతో 2019 ఏప్రిల్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ అలైడ్‌ స్పోర్ట్స్‌ (ఎన్‌ఐఎంఏఎస్‌)లో నెల రోజుల పాటు పర్వతారోహణపై శిక్షణ పొందాడు. తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ నుంచి రెండు పర్వతాలను అధిరోహించిన తొలి వ్యక్తిగా ఇటీవల ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు’ సాధించిన ఘనత సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోని ఏడు శిఖరాలపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడమే తన ముందున్న లక్ష్యం అంటున్నాడు మహిపాల్‌.

- సతీశ్‌ జీవీ, ఈనాడు జర్నలిజం స్కూల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని