Updated : 22 Jan 2022 06:09 IST

టాటా పాఠాలు

రతన్‌ టాటా.. ధనవంతుల జాబితాలో కనిపించని ఐశ్వర్యవంతుడు. దేశ హితం కాంక్షించి వ్యాపారం చేసే అరుదైన బిజినెస్‌మ్యాన్‌. వేదిక ఎక్కిన ప్రతిసారీ యువత గురించే మాట్లాడతారు.. దేశం భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని ఎలుగెత్తి చాటుతారు. ఆయన నుంచి మనం ఏమేం నేర్చుకోగలమంటే..?

* లక్షల కోట్ల విలువైన సంస్థలకు అధిపతి.. ఏటా వేల కోట్లు దానం చేసే ట్రస్ట్‌కి యజమాని.. నలభై ఏళ్లకు పైగా వ్యాపార అనుభవం.. అయినా ప్రతిభ, సృజనాత్మకత ఎక్కడ ఉన్నా ఆదరిస్తారు, గౌరవిస్తారు రతన్‌ టాటా. అది తన సంస్థలో ఓ అట్టడుగు ఉద్యోగి కావొచ్చు.. బుడిబుడి అడుగులేసే ఔత్సాహిక వ్యాపారవేత్త అయ్యుండొచ్చు. ఎవరు చెప్పినా వింటారు.

- సరికొత్త ఆలోచనలు, యువ సారథ్యం, ప్రతిభపై నమ్మకంతో దాదాపు 25 స్టార్టప్‌లలో సొంతంగా పెట్టుబడులు పెట్టారు.

* నలభై ఏళ్ల కిందట వేల కోట్ల వ్యాపారంగా ఉన్న టాటా గ్రూప్‌ని లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మలిచారు రతన్‌ టాటా. ఈ ప్రస్థానంలో ఆయన పట్టినదంతా బంగారమేనా? అంటే కానే కాదు. టెట్లీ టీ, కోరస్‌లాంటి టేకోవర్‌లాంటి విజయాలతోపాటు వైఫల్యాలూ ఉన్నాయి. సామాన్యుడి కోసం తయారు చేసిన ‘నానో’ కారు కనుమరుగైంది. బ్రిటీష్‌ జాగ్వార్‌ లాండ్‌రోవర్‌ని సొంతం చేసుకున్నాక.. మొన్నటిదాకా వేలకోట్ల నష్టాలు మిగిల్చింది. అయినా ఇప్పటికీ ఆయన ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆరాధ్యుడే.

- మంచి నిర్ణయాలు, చెడు నిర్ణయాలు అంటూఏమీ ఉండవు. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి సానుకూలంగా సాగిపోవడమే అసలైన విజయం అంటారాయన.

* ఆటోమొబైల్‌, విమాన, ఐటీ, టెలికాం... ఇలా అన్ని టాటా గ్రూప్‌ కంపెనీల్లో 8 లక్షలమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ‘వాళ్లు ఉద్యోగులు కాదు.. మా కుటుంబ సభ్యులు’ అంటారు రతన్‌. ముంబయి తాజ్‌ హోటల్‌ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది ఇళ్లకెళ్లి ఓదార్చడం.. ఆరోగ్యం బాగా లేని ఓ ఉద్యోగి ఇంటికెళ్లి పరామర్శించడం.. కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారికి స్వయంగా పెద్దమొత్తం అందించడం.. ఎంత నైతిక ఓదార్పు! ఇవన్నీ ఉద్యోగికి ఇస్తున్న ప్రాముఖ్యాన్ని తెలియజేస్తాయి. సంస్థ మాది అనే భావం కలగజేస్తాయి.

- వ్యాపారాన్ని నడిపించే నాయకుడు కంపెనీ భాగస్వాములకు జవాబుదారీగా ఉండాలి. అదే సమయంలో మన కోసం పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి ఈ సంస్థ నాది అనే నమ్మకం కలిగేలా చేయాలి. అన్ని అవసరాల్లో వాళ్లకు తోడుగా ఉండాలి.. అంటారు.

* వ్యాపారంలో ఏదోరకంగా ఎదిగిపోవడం ఆయనకు నచ్చదు. అవినీతి, లంచాలకు వ్యతిరేకం. అవసరమైతే తలపెట్టిన ప్రాజెక్టునే వదులుకుంటారు తప్ప.. దేశ హితానికి భంగం కలిగే నిర్ణయాలు తీసుకోరు.

- దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన పేరు కనిపించకపోవచ్చుగాక.. వ్యాపారవర్గాల్లో, సామాన్యుల్లో మానవీయమైన వ్యక్తి రతన్‌ టాటా. ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణమూర్తి సైతం టాటాకి పాదాభివందనం చేశారంటే ఆయనకున్న గౌరవం అర్థం చేసుకోవచ్చు.


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని