ప్రేమకి లేని అభ్యంతరం పెళ్లికెందుకు?

ఒకమ్మాయి, నేను ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మా విషయం వాళ్లింట్లో తెలుసు. వచ్చే ఏడాది పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. సమస్య ఏంటంటే.. తనకు ఈమధ్య విదేశీ సంబంధాలు వస్తున్నాయట.

Published : 22 Jan 2022 01:53 IST

ఒకమ్మాయి, నేను ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మా విషయం వాళ్లింట్లో తెలుసు. వచ్చే ఏడాది పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. సమస్య ఏంటంటే.. తనకు ఈమధ్య విదేశీ సంబంధాలు వస్తున్నాయట. నన్ను కూడా ఫారిన్‌ ఉద్యోగం వెతుక్కోమంటోంది. నేను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నాకిష్టం. నన్ను వదిలించుకోవడానికే తనలా షరతు పెడుతుందేమో అనిపిస్తోంది. తనంటే నాకు చాలా ప్రేమ. ఆమెని ఎలా ఒప్పించాలి?

- పవన్‌, ఈమెయిల్‌

మీ ప్రేమ విషయం వాళ్లింట్లో తెలుసన్నారు.. మరి ప్రేమకి లేని అభ్యంతరం పెళ్లికెందుకో కనుక్కున్నారా? మీకు మీ ఉద్యోగం ఇష్టమే.. కానీ ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని విదేశీ ఉద్యోగం వెతుక్కోమని చెప్పడానికి కారణమేంటో తెలుసా? మనకిష్టమైన వ్యక్తుల ఉద్దేశం తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి వచ్చేయకూడదు! ఆ అమ్మాయి మిమ్మల్ని బలవంతం చేస్తోంది అంటే ఇంట్లోవాళ్లను ఒప్పించడానికేమో అని కూడా అనుకోవచ్చు కదా! ఫారిన్‌ సంబంధమే చేస్తామని తన పేరెంట్స్‌ బలవంతం చేస్తున్నారేమో! ఈ విషయాలన్నీ ముందు మీ ప్రియురాలితో మాట్లాడండి.

మీది ఐదేళ్ల ప్రేమ అన్నారు. అంటే ఈపాటికే ఒకర్నొకరు బాగా అర్థం చేసుకొని ఉండాలి. ఈ సమయంలో ఎప్పుడైనా ఆ అమ్మాయి డబ్బు మనిషి అనీ, హోదాకి ప్రాముఖ్యం ఇస్తుందని అనిపించిందా? అలా అనిపిస్తే తను మిమ్మల్ని వదులుకోవాలి అనే ఆలోచనలో ఉందనుకోవడంలో అనుమానమేం లేదు. మీ తరపు నుంచి చేయాల్సిన వాటి విషయానికొస్తే.. ఒకవేళ పెద్దలు ఒప్పుకోవడానికి ఉద్యోగమే అడ్డమైతే మీరు ఫారిన్‌ ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ జీవితాంతం ఒకే ఉద్యోగంలో ఉండాలనేం లేదు. అవసరమైతే పెళ్లయ్యాక మీరు మళ్లీ పాత కెరీర్‌లోకి తిరిగిరావొచ్చు. ఒకర్నొకరు అర్థం చేసుకోవడం, అవసరమైతే సర్దుకుపోవడం.. ఇవే ప్రతి బంధాన్నీ నిలబెడతాయి. అన్నింటికన్నా ముందు మీరో నిర్ణయానికి వచ్చేటప్పుడు.. ఆ అమ్మాయితో మనసు విప్పి మాట్లాడండి. సమస్యలేంటో కనుక్కోండి. తర్వాత అవే తేలిగ్గా పరిష్కారం అవుతాయి. ఆల్‌ ది బెస్ట్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని