Manalo Manam: నాకు 35.. అతడికి 23!

నాకు పెళ్లై పదేళ్లైనా పిల్లల్లేరు. కొన్నాళ్ల కిందట కారు మరమ్మతు చేయించినప్పుడు, అక్కడ పనిచేసే 23 ఏళ్ల మెకానిక్‌తో పరిచయమైంది.

Updated : 06 May 2023 08:16 IST

* నాకు పెళ్లై పదేళ్లైనా పిల్లల్లేరు. కొన్నాళ్ల కిందట కారు మరమ్మతు చేయించినప్పుడు, అక్కడ పనిచేసే 23 ఏళ్ల మెకానిక్‌తో పరిచయమైంది. తను నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అన్నాడు. నేనూ ఇష్టపడ్డాను. తర్వాత మేం బాగా దగ్గరయ్యాం. ఇప్పుడు ‘నీ ఆస్తిని నా పేర రాయించు. నీకు కావాల్సిన పిల్లల్ని ఇస్తాను’ అంటూ తను అసలు రంగు బయట పెట్టాడు. అతడిపై విపరీతంగా కోపం వచ్చినా ఏమీ చేయలేకపోయా. ఇప్పుడేమో ఆ అబ్బాయితోనే బతకాలనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పరిష్కారం చూపించండి.

 కే.ఎస్‌., ఈమెయిల్‌

* దాదాపు 35 ఏళ్ల వయసున్న మీరు 23 సంవత్సరాల కుర్రాడిపై మనసు పడ్డారంటేనే మీది కేవలం ఆకర్షణే అని అర్థమవుతోంది. నువ్వు ఆస్తి రాసివ్వు.. నీకు పిల్లల్ని ఇస్తానని అతడు చెబుతున్నాడంటేనే.. అతడికి ప్రేమ కన్నా డబ్బే ముఖ్యమని స్పష్టంగా తెలుస్తోంది. మీ ఆస్తి కావాలని అతడు క్లారిటీతో ఉన్నప్పుడు ఇంకా ఆ కుర్రాడిని ఎలా ప్రేమించగలుగుతున్నారు? పైగా తను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పడం లేదు. మానసిక భావోద్వేగాలతో ఆడుకుంటూ మోసాలకు పాల్పడే ఇలాంటి వాళ్లు ఈ సమాజంలో అడుగడుగునా ఉంటారు. మీరూ అలాంటి ఉచ్చులో పడకండి. అతడి జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతే మానసిక నిపుణుడిని కలవండి. అతని దగ్గర మీ ఫొటోలు, వీడియోలు ఉన్నా.. బ్లాక్‌మెయిల్‌ చేస్తాడేమోననే సందేహం ఉన్నా భయపడకండి. ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి.
అసలు మీ భర్తతో మీకు వచ్చిన ఇబ్బందేంటో చెప్పనేలేదు. పిల్లలు లేనంత మాత్రాన ఆయనపై అయిష్టత పెరగడమేంటి? ఇద్దరి మధ్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే ముందు వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. సాధ్యం కాని సమస్యలైతే పెద్దలతో చర్చించుకోండి. అయినా ఉపయోగం లేదనుకుంటేనే చట్టపరంగా ముందుకు వెళ్లండి. అంతేగానీ ఆకర్షణ, వ్యామోహంతో జీవితాన్ని చేజేతులా పాడు చేసుకోవద్దు.      ఎవరికీ ఆమోదయోగ్యం కాని అనుబంధం పెంచుకొని చిక్కుల్లో పడొద్దు. నేను చెప్పిన విషయాలన్నీ ఆలోచించి, ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని