మీలో ఎవరు పర్యావరణ పరిరక్షకులు?

శీర్షిక చదివితే... మీలో ఎవరు కోటీశ్వరుడు గుర్తొస్తుంది కదూ.. అవును ఇదీ అలాంటి క్విజ్‌ పోటీయే. పిల్లల్లో పర్యావరణ అవగాహన పెంచడానికి, రోజురోజుకీ దిగజారిపోతున్న జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి ఓ ముంబయి వాసి ప్రారంభించిన అతిపెద్ద పోటీ. ఇది ఏ రాష్ట్రానికో పరిమితం ...

Updated : 31 Dec 2018 16:51 IST

మీలో ఎవరు పర్యావరణ పరిరక్షకులు?

శీర్షిక చదివితే... మీలో ఎవరు కోటీశ్వరుడు గుర్తొస్తుంది కదూ.. అవును ఇదీ అలాంటి క్విజ్‌ పోటీయే. పిల్లల్లో పర్యావరణ అవగాహన పెంచడానికి, రోజురోజుకీ దిగజారిపోతున్న జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి ఓ ముంబయి వాసి ప్రారంభించిన అతిపెద్ద పోటీ. ఇది ఏ రాష్ట్రానికో పరిమితం కాదు. దేశ వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమం. అదీ ఐదు, ఆరు, ఏడు తరగతుల పిల్లలకు మాత్రమే. వీటికోసం అతను దేశమంతా తిరుగుతూ పోటీలు నిర్వహిస్తున్నాడు. ఓ వైపు సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతుంటే... మరోవైపు మార్కుల కోసం విద్యాసంస్థలు బట్టీ పట్టే విధానాన్ని ఎంపిక చేసుకున్నాయి. దీంతో విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ఆలోచనా పరిధి, నైపుణ్యాలు, పరిసరాలపై అవగాహన ఏ మాత్రం ఉండటం లేదు. వీటన్నింటిలో మార్పు తీసుకురావడానికి ముంబయికి చెందిన ఆర్కిటెక్ట్‌ రాజివ్‌ డిసిల్వా నడుంబిగించాడు. మీలో ఎవరు పర్యావరణ పరిరక్షకులు? అంటూ మొదలెట్టిన చైతన్యం గురించి తెలుసుకుందాం...

క్విజ్‌ పోటీలే ఎందుకంటే.. 
పదేళ్ల క్రితం ప్రతి పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు ఎక్కువగా క్విజ్‌ పోటీలు నిర్వహించేవారు. ప్రస్తుతం అటువంటి కార్యక్రమాలు తక్కువయ్యాయి. బ్రిటన్‌లో ఒక టీవీ ఛానెల్‌లో 13ఏళ్లపాటు ఓ క్విజ్‌ పోటీ సాగిందంటేనే అక్కడ వారికి పోటీలపై ఎంత ఆసక్తి ఉందో అర్థం అవుతుంది. ప్రపంచానికి మనమే సున్నాని పరిచయం చేశాం. ఎటువంటి సౌకర్యాలు లేని 5వేల ఏళ్లక్రితమే శస్త్ర చికిత్సలు చేసిన దేశం మనది. ఇప్పుడు సాంకేతికత రంగు పులుముకొని జ్ఞాపకశక్తిని తగ్గించేసుకుంటున్నాం. ఏ అవసరమొచ్చినా అంతర్జాలంలోనే వెతుకుతున్నాం. పూర్వం ఒక అంశం గురించి తెలుసుకోవాలంటే అనేక పుస్తకాలు చదివేవాళ్లం. దీంతో చాలా విషయాలు తెలుసుకునే వెసులుబాటు కలిగేది. కాని ఇప్పుడు అలా లేదు. అందుకే క్విజ్‌ పోటీలను ఎంపిక చేసుకున్నాం. చాలా మంది చదివితే, వింటే కొత్త విషయాలు నేర్చుకోవచ్చంటారు. ఇతరులతో చర్చిస్తే మరిన్ని విషయాలు తెలుసుకోగలం అంటాడు రాజివ్‌.

అయిదు, ఏడు తరగతుల పిల్లలు.. 
మొక్కై వంగనిది మానై వంగునా అనేది పెద్దల సామెత. చిన్న వయసులో వారికి ఏది చెప్పినా జాగ్రత్తగా విని నేర్చుకునే అలవాటు ఉంటుంది.  అందుకే అయిదు, ఆరు, ఏడు తరగతుల విద్యార్థుల్ని ఎంపికచేసుకున్నాడు రాజివ్‌. రాష్ట్ర స్థాయి పోటీలు రెండు విడతల్లో జరుగుతాయి. ఇక్కడ విజయం సాధించిన వారు రాష్ట్రం తరఫున ముంబయిలో జరిగే ఫైనల్స్‌కు ఎంపిక అవుతారు.  దేశం మొత్తంలో 40 నగరాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు డిసిల్వా. ఇక్కడ విజయవాడ, హైదరాబాద్‌ల్లో పోటీలు జరిగాయి.

ఎవరీ డిసిల్వా.. 
రాజివ్‌ డిసిల్వా.. ముంబయికి చెందిన ఆర్కిటెక్చర్‌. ఇతనికి చిన్నప్పటి నుంచి క్విజ్‌పోటీలంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఏ పాఠశాలలో ఆ పోటీలపై పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో అతనే స్వయంగా బరిలోకి దిగాడు. ఒక సారి తన మిత్రున్ని కలవడానికి వెళ్తే వాళ్లబ్బాయి ‘నాన్న నాకు ధాన్యం చెట్టు చూపించు’ అని అడగడంతో ఆశ్చర్యపోయాడు రాజివ్‌. దీంతో పిల్లలు ఏం కోల్పోతున్నారో గ్రహించిన అతను వెంటనే వారిలో మార్పు తీసుకురావాలని ముంబయికే చెందిన సేవస్‌ మేగజైన్‌తో జతకలిసి మూడేళ్ల క్రితమే పోటీలను ప్రారంభించాడు. పిల్లలకు పర్యావరణంపై అవగాహన పెంచడమే తన లక్ష్యమని దేశమంతా తిరుగుతున్నాడు.

- వాన ప్రశాంత్‌, ఈనాడు జర్నలిజం స్కూల్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని