శిఖర సింగం!

చిన్నప్పటి నుంచి అతని దారే వేరు... ప్రకృతి అంటే పిచ్చి ప్రేమ.. కొండలన్నా, అడవులన్నా అంతులేని అభిమానం... ఎప్పుడు చూసినా చెట్ల గురించి ఆలోచిస్తూనో, పర్వతాలు అధిరోహిస్తున్నట్లు కలలు కంటూనో గడిపేవాడు.. వయసు పెరిగేకొద్దీ ఆ ఆసక్తీ పెరిగింది. చివరకు ప్రకృతే అతని...

Updated : 31 Dec 2018 16:56 IST

చిన్నప్పటి నుంచి అతని దారే వేరు... ప్రకృతి అంటే పిచ్చి ప్రేమ.. కొండలన్నా, అడవులన్నా అంతులేని అభిమానం... ఎప్పుడు చూసినా చెట్ల గురించి ఆలోచిస్తూనో, పర్వతాలు అధిరోహిస్తున్నట్లు కలలు కంటూనో గడిపేవాడు.. వయసు పెరిగేకొద్దీ ఆ ఆసక్తీ పెరిగింది. చివరకు ప్రకృతే అతని లక్ష్యమైంది. ఇప్పుడు తనతో పాటు వందలాది మందిని ప్రకృతిలోకి నడిపిస్తున్నాడు... కొండలను ఎక్కిస్తున్నాడు.. అందరికీ అద్భుతాలను చూపిస్తున్నాడు.

శిఖర సింగం!

క్కడో ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో నుంచి మన దేశంలోని అత్యున్నత పర్వతమైన కాంచనగంగ వరకు ఈ కుర్రాడి పట్టుదలకు తలవంచినవే. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన 29 ఏళ్ల యునాది రఘునాథ్‌ రెడ్డి ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. ఎన్నో మంచి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా అతన్ని మాత్రం తన చిన్ననాటి కలలే వెంటాడాయి. వాటిని నెరవేర్చుకోవడం కోసం తన ఆసక్తినే జీవితాశయంగా, వృత్తిగా మార్చుకున్నాడతను. ప్రకృతిలో తన ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులుండేవి. అయినా లక్ష్యాన్ని సాధించేందుకు తనకు తానే ఏర్పాట్లు చేసుకున్నాడు. స్నేహితుడితో కలిసి విజయవాడలో విద్యానుబంధంగా ఉండే ఓ సంస్థను నెలకొల్పాడు. అనంతరం తాను అనుకున్న మార్గంలో నిరాటంకంగా దూసుకుపోతున్నాడు. 2011లో మరో ఇద్దరితో కలిసి విజయవాడ అడ్వంచర్‌ క్లబ్‌ను నెలకొల్పారు. క్లబ్‌ ఆధ్వర్యంలో విజయవాడ, గుంటూరు నగరాల్లోని ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులను నిత్యం కొండపల్లి అటవీప్రాంతం, కృష్ణా పరివాహక ప్రదేశాలు, సమీపంలోని కొండలపైకి ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లడం ఆరంభించాడు.

అక్కడితో ఆగలేదు... 
కొండలు, అడవుల్లోనికి చాకచక్యంగా దూసుకెళ్లడంలో రఘునాథ్‌ దిట్ట. స్నేహితుని ఆసక్తి, పట్టుదలను గమనించిన రామదాస్‌, సురేష్‌లు ఇక్కడితో ఆగిపోవద్దని ప్రోత్సహించారు. వారి సలహా మేరకు కశ్మీరులోని జవహర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ అండ్‌ వింటర్‌ స్పోర్ట్స్‌లో చేరాడు. అక్కడ నెలరోజుల శిక్షణలో రాటుదేలాడు. అనంతరం తిరిగి వచ్చాక.. హైదరాబాద్‌ ట్రెక్కింగ్‌ క్లబ్‌లో వలంటీర్‌గా చేరాడు. అక్కడ ఉండగానే.. వందకు పైగా బృందాలను దేశంలోని వివిధ పర్వతాలను అధిరోహించేందుకు తీసుకెళ్లాడు. ఈ సమయంలోనే ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తైన పర్వతాలన్నింటినీ ఎక్కాలని నిర్ణయించుకున్నాడు. 
ప్రస్తుతం ఒక్కో శిఖరం ఎక్కుతూ ముందుకు వెళుతున్నాడు. మూడు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను ఇప్పటికే ఎక్కి వచ్చాడు. ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్నైతే.. 13 నెలల వ్యవధిలో నాలుగుసార్లు ఎక్కిన ఏకైక భారతీయుడిగా రికార్డు సాధించాడు. దిల్లీ, ఆగ్రాలోని యునెస్కో గుర్తించిన ఏడు చారిత్రక కట్టడాలను 12 గంటల వ్యవధిలోనే సందర్శించి గిన్నెస్‌బుక్‌ రికార్డు నెలకొల్పిన 23మంది సభ్యుల బృందంలోనూ రఘునాథ్‌ ఒకరు కావడం విశేషం.

కాంచనగంగ... గోచెలా... 
భారతదేశంలోని పలు పర్వతాలు రఘునాథ్‌ పట్టుదలకు దాసోహమన్నాయి. లడఖ్‌లోని 6153 మీటర్ల ఎత్తైన స్టోక్‌ కాంగ్రి, ఆరు వేల మీటర్ల గోల్‌ ఆఫ్‌ కాంగ్రి, హిమాలయాల్లోని 4800 మీటర్ల ఎత్తున్న కాంచనగంగ, ఉత్తరాఖండ్‌లోని నాలుగువేల మీటర్ల కేదార్కాంత, ఐదు వేల మీటర్ల ఎత్తున్న రూప్‌కుంద్‌ లేహ్‌, సిక్కింలోని 4940 మీటర్ల గోచెలా లాంటి పర్వతాల్ని సైతం రఘునాథ్‌ అధిరోహించారు. ప్రతి ఖండంలోని అత్యున్నత పర్వతాలపై జాతీయ జెండాని రెపరెపలాడిస్తున్నాడు. రఘునాథ్‌ ప్రతిభను గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఎవరెస్ట్‌ ఎక్కే విద్యార్థుల బృందానికి శిక్షకుడిగా నియమించింది. 2016 నుంచి 18 వరకూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరెస్ట్‌ ఎక్కిన విద్యార్థుల బృందానికి బేస్‌ క్యాంప్‌ లీడర్‌గానూ 40 రోజులు సేవలందించారు. రఘునాథ్‌ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అకాడమీ అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ కార్యదర్శిగా నియమించింది. దీని ద్వారా  పద్దెనిమిదేళ్లు నిండి ఆసక్తి ఉన్న పిల్లలకు అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.

-సి.హెచ్‌.సాయికిరణ్‌, ఈనాడు పాత్రికేయ పాఠశాల

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని