ఆలోచించే చెయ్యి

రూ.150కి ఒక స్టూల్‌... రూ.300కి మంచి ఫర్నీచర్‌.. ఇలా అతి తక్కువ ధరలోనే పిల్లలకు మంచి స్కూల్‌ బ్యాగు... ఎక్కడ..? ఎక్కడ? దొరుకుతాయనేగా మీ ప్రశ్న. సులభంగా దొరికే అట్టముక్కలతో బహుళ ప్రయోజన ఫర్నీచర్‌ను సొంతంగా

Published : 19 Jan 2019 00:19 IST

ఆలోచించే చెయ్యి

రూ.150కి ఒక స్టూల్‌... రూ.300కి మంచి ఫర్నీచర్‌.. ఇలా అతి తక్కువ ధరలోనే పిల్లలకు మంచి స్కూల్‌ బ్యాగు... ఎక్కడ..? ఎక్కడ? దొరుకుతాయనేగా మీ ప్రశ్న. సులభంగా దొరికే అట్టముక్కలతో బహుళ ప్రయోజన ఫర్నీచర్‌ను సొంతంగా తయారు చేస్తున్న పాతబస్తీ మహిళల దగ్గరకి వెళ్లాలి మనం. వారిని అలా నైపుణ్య వంతులుగా తీర్చిదిద్దుతున్న ఓ ఆర్కిటెక్ట్‌ తలుపు తట్టాలి మనం. ఎవరా అర్కిటెక్ట్‌? ఏమతని లక్ష్యం?

అంధులు, మూగ, చెవిటి వారికోసం సంతోష్‌ బీఎమ్‌డీ(బ్లైండ్‌, మ్యూట్‌, డెఫ్‌) అనే వాచ్‌ను రూపొందించాడు. 2015లోని వంద ఉత్తమ ఆవిష్కరణల్లో ఒకటిగా ఎంపికైంది. హెచ్‌126 పేరుతో రూ.2లక్షలకే ఇల్లు నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇది ఇప్పుడు ప్రయోగ దశలో ఉంది. త్వరలోనే దీన్ని పేదలకు అందించాలన్నది సంతోష్‌ ఆశయం.

దిమందికి ఉపయోగపడాలనే తపనుంటే... ఏం పనిచేస్తున్నా మన కళ్లకు దీనులే కన్పిస్తుంటారు. వారి కష్టమే దర్శనమిస్తుంటుంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి ఆస్ట్రియాలో ఆర్కిటెక్ట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన కేతన్‌ సంతోషకుమార్‌ను అలాంటి తపనే కుదిపేసింది. ఆస్ట్రియాలో ఆర్కిటెక్ట్‌ చదువుతున్నా, పనిచేస్తున్నా అతని మనసు మాత్రం హైదరాబాద్‌లోని మురికివాడల చుట్టూ తిరుగుతుండేది. వారికేదైనా చేయాలనే కల కనేవాడు. చదివిన ఆలోచించే చెయ్యికోర్సుకు విలువుంది.. డబ్బులు విపరీతంగా సంపాదించుకునే అవకాశముంది. అయితే అవేమీ పట్టించుకోలేదు. 2014లో హైదరాబాద్‌ వచ్చేశాడు. గెస్ట్‌ఫ్యాకల్టీగా ఆర్కిటెక్చర్‌ పాఠాలు చెప్పాడు. ‘వెనుకబడిన తరగతులకోసం మన చదువులు ఉపయోగపడాలనే ఆయన ఆలోచనలు విని అక్కడి విద్యార్థులు స్ఫూర్తి పొందారు. ‘ఏదైనా చేయండి సార్‌.. మేం సాయంగా ఉంటాం’ అన్నారు. దీంతో తన ఆలోచనకి కార్యరూపం ఇచ్చాడు. మొదట ‘కేతన్స్‌ అట్లియర్‌’ అనే ఆర్కిటెక్చర్‌ ఆఫీసు మొదలెట్టాడు. అక్కడే ఎన్జీవోను నెలకొల్పాలనుకున్నాడు. ఆలోచనల్లో అనుకుంది చేతులతో చేయటమనే అర్థమొచ్చేట్లే ఆ ఎన్జీవోకు ‘థింకింగ్‌ హ్యాండ్‌’ అని పేరుపెట్టాడు.

పనికొచ్చే పని చేసుకోమన్నారు!
వెనుకబడిన వర్గాలకు తక్కువ ఖర్చుతో ఫర్నీచర్‌, ఇల్లు తయారు చేసివ్వాలన్నది సంతోష్‌కుమార్‌ లక్ష్యం. తన మనసులోని మాట చెబితే కొందరు ఎకసెక్కాలాడారు. ఇలాంటివి మాని పదో పరకో సంపాదించుకోవటానికి పనికొచ్చేది చేయి’ అంటూ బుద్ధులు చెప్పారు. ఇవేమీ పట్టించుకోలేదు. అమ్మ, అన్నయ్య, మిత్రుడు రవి, మధుసూదన్‌, రమేష్‌.. లాంటి కొందరు శ్రేయోభిలాషులు సంతోష్‌ను ప్రోత్సహించారు. దీంతో కిషన్‌బాగ్‌లో ముస్లింల బాగు కోసం పనిచేసే ముఫ్తిని కలిశాడు. తన ఆలోచన చెప్పాడు. పది మంది వాలంటీర్స్‌తో కిషన్‌బాగ్‌ స్లమ్‌కి వెళ్లాడు. అక్కడ తండ్రి, భర్తలేని మహిళలు దాదాపు నాలుగువేల మంది ఉన్నారు. వీళ్లంతా దాదాపు చిన్నపనులు చేస్తూ జీవనపోరాటం సాగిస్తున్నవారే. ముఫ్తి సాయంతో యాభై మంది ముస్లిం మహిళలు వచ్చారక్కడికి. వాలంటీర్ల సాయంతో కళ్లముందే అట్టముక్కల సాయంతో ఉపయోగపడే రెండు ఫర్నీచర్స్‌ చేశారు. అక్కడికొచ్చినవాళ్లు ‘మాకూ నేర్పించండి’ అని అడిగారు. కర్వెక్స్‌, ఆర్‌300 అనే ఫర్నీచర్స్‌ నేర్పించి, వారితోనే తయారు చేయించారు.

ఆలోచించే చెయ్యి

శిక్షణతో పాటు ఉపాధి
రెండునెలల నుంచీ వర్క్‌షాప్స్‌తో విద్యార్థులను చైతన్యం చేస్తోంది ‘థింకింగ్‌ హ్యాండ్‌’. కొందరు ముస్లిం మహిళలు రోజుకు 12 పెట్టికోట్‌లు కుడితే నలభై రూపాయలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలనుకున్నాడు సంతోష్‌. పాతికేళ్లనుంచీ ఉండే కిషన్‌బాగ్‌ స్లమ్‌కి వెళ్లాడు. వాళ్లకు కర్వెక్స్‌, ఆర్‌300 ఫర్నీచర్స్‌ చేయడం నేర్పించాడు. ఇది పూర్తిగా అట్టబోర్డుతో తయారు చేశారు. పేపరును గమ్‌తో అతికించటం, లోపల ఉండే టైట్‌ స్ట్రక్చర్‌ ఆధారంగా ఇది కంఫర్ట్‌గా ఉంటుంది. కర్వెక్స్‌ హాయిగా ఉండటంతో పాటు 150 కేజీల బరువును తట్టుకుంటుంది. దీంతోపాటు ఇందులో పెద్దవాళ్లు డబ్బులు, చిరుతిళ్లు, ఆకులు, వక్కపొడి.. లాంటివి దాచుకునేందుకు అనువుగా ఉంటుంది. ఇది 150 రూపాయల్లో తయారు చేయవచ్చు. ఆర్‌300 ఫర్నిచర్‌లో 300 కేజీలుండే బరువు పెట్టినా ఇబ్బందిలేదు. ఇది మూడువందల రూపాయల్లోపే తయారవుతుంది. త్వరలో ఈ ఫర్నిచర్స్‌ను వాటర్‌ప్రూఫ్‌ చేస్తున్నారు. వీటితో పాటు పేపర్లతో అడ్జస్టబుల్‌ ల్యాంపును తయారుచేయడం నేర్పించాడు. తన దగ్గరికొచ్చే విద్యార్థులతో అనాథలకోసం అట్టముక్కలతో ఓ స్కూలుబ్యాగును తయారు చేశాడు. అందులో పుస్తకాలు, టిఫెన్‌ బాక్సుతో పాటు స్కూల్‌లో ఆ బ్యాగ్‌పై రాసుకునేందుకు వీలుగా తీర్చిదిద్దాడు. వీటన్నింటినీ పెద్దఎత్తున తయారు చేయిస్తున్నారు. ఈ పనిలో నిపుణులైన వారికి తగిన పారితోషికం ఇస్తారు. తయారైన వాటిని అవసరమైన పేదలకు అందిస్తారు. దీనివల్ల కొందరికి ఉపాధి... కొందరికి ఉపశమనం.

- రాళ్లపల్లి రాజావలి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని