ప్రేమ కాదు...భయమేస్తోంది

చదువు పూర్తవుతోందంటే స్నేహితులకు దూరమవుతున్నామనో, మళ్లీ కళాశాల రోజులు తిరిగిరావనో చాలామంది బాధ పడుతుంటారు. కానీ నా పరిస్థితి అందుకు భిన్నం. డిగ్రీ మూడో సంవత్సరం చివరి పరీక్ష రాయడంతోనే నా ఆనందానికి అవధుల్లేవు. చదువు పూర్తిచేసుకున్నందుకు కాదు ఆ ఆనందం....

Published : 09 Mar 2019 00:39 IST

చదువు పూర్తవుతోందంటే స్నేహితులకు దూరమవుతున్నామనో, మళ్లీ కళాశాల రోజులు తిరిగిరావనో చాలామంది బాధ పడుతుంటారు. కానీ నా పరిస్థితి అందుకు భిన్నం. డిగ్రీ మూడో సంవత్సరం చివరి పరీక్ష రాయడంతోనే నా ఆనందానికి అవధుల్లేవు. చదువు పూర్తిచేసుకున్నందుకు కాదు ఆ ఆనందం. అమ్మకు సాయం కాబోతున్నందుకు! అందుకు తగ్గట్టుగానే చదువుకు తగ్గ చిన్న ఉద్యోగాన్ని సంపాదించాను. కాకపోతే అమ్మకు కాస్త దూరంగా ఉండాలి. మనసులో కొంత బాధగానే ఉన్నా.. అమ్మ కల నెరవేరుస్తున్నానన్న ఆనందం ముందు ఇదెంత అనుకుని హైద్రాబాద్‌ బస్సెక్కా. కొంత బెరుకుగానే ఆఫీసులో అడుగుపెట్టా. చుట్టూ ఉన్నవారంతా సులువుగానే కలిసిపోయారు. వాళ్లలో ఒక వ్యక్తి(శరత్‌) మరీ దగ్గరగా అనిపించాడు. మొదటి చూపులోనే అతనిలో నాపై ఆసక్తి కనిపించింది. రానురానూ నాకూ అతనిపై ప్రేమ భావన కలిగినా.. నా నేపథ్యం దృష్ట్యా ఏమీ పట్టనట్టుగానే ఉండిపోయాను. కానీ ఒకరోజు అతను నేరుగా వచ్చి తన ప్రేమ విషయం చెప్పాడు. నా ఆనందానికి అవధుల్లేవు. కానీ ఒప్పుకోలేను. అలా అని కాదనలేను. నాలో నేనే చాలా మథనపడ్డాను. అమ్మానాన్నలది ప్రేమ వివాహమే కాబట్టి, అమ్మ అర్థం చేసుకుంటుందనుకున్నా. అమ్మ ఒప్పుకొంటేనే మన పెళ్లి అన్న షరతుతో సరేనన్నా. సమయం ఎలా గడిచిందో తెలియదు. ఎన్నో ఊసులు, అందమైన భవిష్యత్తుపై కలలు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఒకసారి అమ్మ నా దగ్గరకు వచ్చింది. తనకు నా ప్రేమ విషయం చెప్పా. రెండు రోజుల తరువాత.. ఇంటికి వెళ్తున్నాం, అన్నీ సర్దుకో అంది. ఏమని అడిగితే.. ఇంటికి వెళ్లాక మాట్లాడదామంది. సరే అని వెళ్లా. తెలిసినవాళ్ల ద్వారా తన గురించి వాకబు చేశాను, అతను మనకు సరిపోడు మర్చిపోమంది. ఒకసారి మాట్లాడి చూడమన్నా. వాకబు చేయించిన వారితో మాట్లాడించింది. నేను వినకపోయేసరికి 20 ఏళ్ల పెంచిన ప్రేమ ముఖ్యమా? ఏడాది పరిచయం ముఖ్యమా? తేల్చుకోమంది. అమ్మ ప్రశ్నకు ఎటువైపు మొగ్గాలో అర్థం కాలేదు. నాన్న చనిపోయాక నన్ను ఒక స్థానంలో నిలపడానికి ఎంత కష్టపడిందో నాకే తెలుసు. నాకోసం ఇంత చేసిన అమ్మను మధ్యలో విడిచిపెట్టలేకపోయా.

తనయినా నన్ను అర్థం చేసుకుంటాడనుకున్నా. ఫోన్‌ చేసి జరిగిందంతా చెప్పా. ‘అమ్మని విడిచిపెట్టలేను.. నన్ను మర్చిపో’మన్నా. ఆ మాటలను చెప్పడానికి నాలో నేను ఎంతగా నలిగిపోయానో నాకే తెలుసు. ‘తొందరపాటు నిర్ణయం తీసుకోకు. మనం వేచి చూద్దాం’ అనో, ‘నిన్ను విడిచి ఉండలేను, నేను వచ్చి అమ్మతో మాట్లాడుతాను’ అనో అంటాడనుకున్నా. పదిహేను నిమిషాలు ఆలస్యమైతేనే నిమిషనిమిషానికీ ఫోన్‌ చేసే వ్యక్తి చివరివరకూ నాతో కలిసి జీవించడానికి నాకు ఆమాత్రం భరోసానిస్తాడు అనుకున్నా. కానీ నాకు వచ్చిన సమాధానం- ‘నిన్ను చంపి, అవసరమైతే నేనూ చస్తా’ అని! షాక్‌ అయ్యాను. బాధలో అలా అంటున్నాడనుకుని తరువాత నెమ్మదిగా మాట్లాడదామని ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా, అదే తరహా సంభాషణ. గుండెల్లో ఏదో బాధ. కంట నీరు ఆగలేదు. ఒకరకమైన భయమూ ఆవహించింది. ప్రతిరోజూ తన బెదిరింపు మెసేజ్‌లతో నా ఇన్‌బాక్స్‌ నిండిపోయింది. ప్రేమంటే ఇంతేనా? ఎదురుచూడటం, త్యాగం, పరిస్థితులను అర్థం చేసుకోవడం... లాంటివి ప్రేమలో ఉండవా? ఏమిటిది శరత్‌?

- శ్రీనిజ, హైదరాబాద్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని